మనిషి చనిపోయిన కొన్ని రోజులకే శవం కుళ్లిపోతుంది. అందుకే ఒకప్పుడు ఈజిప్ట్ ప్రాంతంలో మమ్మిఫికేషన్ చేసేవాళ్లు. అలా చేసిన మమ్మీలను ఇప్పటికీ చూస్తున్నాం. కాకపోతే.. వాటిలో చాలావరకు పాడైపోయాయి. కానీ.. ఇది ఈజిప్ట్ మమ్మీల కంటే చాలా పురాతనమైనది. వేల ఏండ్ల నాటి ఈ డెడ్ బాడీకి ఎలాంటి కెమికల్స్, పసర్లు రాయలేదు. అయినా.. ఇప్పటికీ అది చెక్కుచెదరకుండా ఉంది! ఇంతకీ అది ఎవరి శవం? మంచులో ఎందుకు కూరుకుపోయింది? అతన్ని ఎవరు చంపారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికీ దొరకడం లేదు.
అది 1991 సెప్టెంబర్19.. ఇటలీ–ఆస్ట్రియా సరిహద్దులోని ఆల్ప్స్ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంది. చల్లని గాలి, మంచు కొండల నుంచి వచ్చే గ్లేసియర్లతో అందంగా.. ప్రశాంతంగా ఉంది. అక్కడి మంచు పర్వతాలను ఎక్కేందుకు జర్మన్ జంట ఎరికా, హెల్మట్ సైమన్ వెళ్లారు. పర్వతాల నుంచి వస్తున్న ‘నీడర్‌జోచ్‌ఫెర్నర్’ అనే గ్లేసియర్ గుండా హైకింగ్ చేస్తున్నప్పుడు కొంతదూరంలో వాళ్లకు ఒక వింత ఆకారం కనిపించింది. అదేంటోనని దగ్గరికి వెళ్లి చూశారు. అంతే ఒక్కసారిగా భయపడిపోయారు. అది మంచులో కూరుకుపోయిన శవం.
పర్వతారోహకుడు ఎవరో ప్రమాదంలో చనిపోయి ఉంటాడని అనుకున్నారు. కానీ.. వాళ్లు అనుకున్నట్టు అతను పర్వతారోహకుడు కాదు.. వేల ఏండ్ల నాటి వేటగాడు. ఆ బాడీ దాదాపు 5,300 ఏండ్ల నాటిది. అప్పటినుంచి అది మంచులోనే ఉంది. అంతేకాదు.. అది ప్రపంచంలోని పురాతన మమ్మీల్లో ఒకటి. అందుకే సైంటిస్ట్‌లు దాన్ని జాగ్రత్తగా భద్రపరిచారు. ఆ మమ్మీ దొరికిన ప్రాంతం ఆల్ప్స్ ఓట్జ్ అనే గ్రామానికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఆస్ట్రియన్ జర్నలిస్ట్ కార్ల్ వెండ్ల్ దానికి ‘ఒట్జీ’ అని పేరు పెట్టాడు. ఐస్‌లో దొరకడం వల్ల చాలామంది ‘ఐస్‌మ్యాన్’ అని కూడా పిలుస్తారు ఆ మమ్మీని.
నియోలిథిక్ యుగం నాటిది
మమ్మీని 1991లో కనుగొన్నప్పటి నుంచి ఇప్పటివరకు దానిమీద ఎన్నో రీసెర్చ్‌లు జరిగాయి. పురావస్తు శాస్త్రవేత్తలు, డాక్టర్లు, క్రిమినాలజిస్టులు ఆ రీసెర్చ్‌ల్లో పాల్గొన్నారు. వాటిల్లో అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఒట్జీకి చేసిన శవ పరీక్షలో.. అతనికి సుమారు 48 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఎత్తు160 సెం.మీ., బరువు 50 కిలోలు. పొడవైన చేతులు, వెడల్పైన భుజాలు, ముదురు రంగు ఉంగరాల జుట్టు, గడ్డం ఉండేవి. 2011లో డచ్ ఆర్టిస్ట్‌లు అడ్రియన్, అల్ఫోన్స్ కెన్నిస్ ఒట్జీ మమ్మీ ఆధారంగా అతని బాడీని రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఇన్స్‌బ్రక్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పురావస్తు శాస్త్రవేత్త వాల్టర్ లీట్నర్ ఈ మమ్మీపై పరిశోధనలు చేసి.. ఓట్జీ చనిపోయేనాటికి ఆరోగ్యంగా లేడని చెప్పాడు. అతను నియోలిథిక్ కాలం నాటి మనిషి. చనిపోయేనాటికి దంత క్షయం, చిగుళ్ల వ్యాధి, బోరెలియోసిస్(కీటకాలు కుట్టడం వల్ల వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్)తో బాధపడుతున్నాడు. అతని కడుపులో హెలికోబాక్టర్ అనే బ్యాక్టీరియా ఉంది. అతని కడుపులో పుండ్లు కూడా ఉన్నాయి. ఒట్జీ ఊపిరితిత్తుల మీద చేసిన రీసెర్చ్‌లో అతను ఒక రకమైన ఫంగస్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు తెలిసింది.
పచ్చబొట్లు
అతని వేషధారణ, శరీర అలంకరణ విషయానికి వస్తే.. ఒట్జీ జీవించిన కాలం కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాడు. శరీరంపై మొత్తం 61 టాటూలు ఉన్నాయి. రాతియుగం నాటివాళ్లు అలంకరణపై పెద్దగా శ్రద్ధ పెట్టేవాళ్లు కాదు. మరి అన్ని టాటూలు ఎందుకు వేయించుకున్నాడు అనే అనుమానం వస్తుంది కదా. అయితే అప్పట్లో బాడీ పెయిన్స్ నుంచి ఉపశమనం కోసం టాటూలు వేయించుకునేవాళ్లని కొందరు ఆర్కియాలజిస్ట్‌లు చెప్పారు. ఒట్జీ శరీరంలో పక్కటెముకలపై నాలుగు చిన్న గీతలతో పచ్చబొట్టు ఉంది. అది బైలరీ మెరిడియన్‌ని సూచిస్తుంది. ఒట్జీ గాల్ బ్లాడర్ (పిత్తాశయంలో)లో రాళ్లు కూడా ఉన్నాయి.
క్రైమ్ సీన్
ఒట్జీకి అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే అతను చనిపోయి ఉంటాడని అందరూ అనుకున్నారు. అతని దగ్గర ఒక గొడ్డలి, కత్తి, విల్లు, 14 చెక్క బాణాలు దొరికాయి. కాబట్టి అతను వేటాడేందుకు మంచు ప్రాంతానికి వచ్చి ప్రమాదంలో చనిపోయాడని మరికొందరు అనుకున్నారు. కానీ.. ఆ రెండూ వాస్తవం కాదు. ఒట్జీకి 2001లో చేసిన ఎక్స్–రే టెస్ట్‌లో అతనికి బాణం గుచ్చుకోవడం వల్లే అతను చనిపోయాడని ఎక్స్‌పర్ట్స్ చెప్పారు. ఒట్జీ ఎడమ చేయి కుడివైపు తిరిగి ఉంది. ఎడమ చేయితో అతని మెడ ముందు భాగాన్ని కప్పుకున్నాడు. అక్కడ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అనే టెక్నాలజీ వాడి మల్టీడైమెన్షనల్ ఇమేజెస్ తీశారు. వాటిలో సైంటిస్ట్‌లు ఐస్‌మ్యాన్ ఎడమ భుజం కింది భాగంలో బాణం తల ఉన్నట్టు కనుగొన్నారు. ఆ బాణం ఒక అంగుళం కంటే ఎక్కువ పొడవు ఉంది.
అది అతని వీపు, నరాలను చీల్చి, పక్కటెముకల వరకు దూసుకెళ్లింది. అయితే.. అది ముఖ్యమైన అవయవాలను మాత్రం డ్యామేజ్ చేయలేదు. కానీ.. బాణం వల్ల బ్లీడింగ్ ఎక్కువగా జరగడం వల్లే అతను చనిపోయి ఉండొచ్చని తేల్చారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఎందుకంటే.. అసలతను బతికిన కాలంలో యుద్ధాలు జరగలేదు. ఆహారం కోసం తప్ప ఇద్దరు మనుషుల మధ్య గొడవలే వచ్చేవి కాదు. అలాంటి కాలంలో ఒట్జీని బాణం వేసి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అసలు అతన్ని ఎవరు చంపారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు.
ఆకస్మిక దాడి
ఒట్జీ పోరాడి చనిపోలేదు. ఎందుకంటే.. అతను చనిపోయిన టైంలో అతను చాలా సేఫ్‌గా ఉన్నట్టు భావించాడు. అతనిపై ఆకస్మిక దాడి జరిగింది. అతను శత్రువులను గమనించే లోపే వెనుక నుంచి దాడి చేసి చంపేశారు. చుట్టుపక్కల దొరికిన వస్తువుల ఆధారంగా ఎక్స్‌పర్ట్స్ ఈ విషయాన్ని తేల్చారు. దాడికి ముందే అతను కడుపు నిండుగా తిన్నాడు. హత్య జరగడానికి కొద్దిసేపటి క్రితం ధాన్యాలతో చేసిన గంజి తాగాడు. అతని కడుపులో ఎర్ర జింక, ఐబెక్స్(ఒక రకమైన మేక) కండరాల్లో ఉండే ఫైబర్స్ ఉన్నాయి. అంటే.. వాటి మాంసం కూడా తిన్నాడు.
వాటితోపాటు నాచు, ఫెర్న్, ఆకులు కూడా తిన్నట్టు సైంటిస్ట్‌లు చెప్పారు. ఇలాంటి ఫుడ్ వేసవి లేదా స్ప్రింగ్ సీజన్‌లో దొరుకుతుంది. కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒక సీజన్‌లో అతను చనిపోయి ఉండొచ్చు!
ప్రతీకారంతోనే...
రాతియుగంలో దోపిడీ, దొంగతనాల్లాంటివి లేవని పరిశోధకులు చెప్తున్నారు. ఒకవేళ దోపిడీ చేయడానికి అతన్ని చంపి ఉంటే.. ఒట్జీ దగ్గరున్న దుస్తులు, ఎంతో విలువైన గొడ్డలిని తీసుకెళ్లి ఉండేవాళ్లు. కానీ.. అవి అతను చనిపోయిన చోటే ఉన్నాయి. మరి ఒట్జీని చంపడానికి కారణం ఏంటి? హత్యకు కొన్ని రోజుల ముందు హింసాత్మక ఘర్షణ ఏదైనా జరిగిందా? దాడి చేసిన వ్యక్తి, ఒట్జీ ఒకరికొకరు తెలుసా?
ప్రతీకారం కోసం చంపారా? లేదంటే అధికారం కోసం చంపారా? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తాయి. కానీ.. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం కనుక్కోలేకపోయారు. ప్రస్తుతం ఒట్జీ మమ్మీ ఇటలీలోని బోల్జానోలోని సౌత్ టైరోల్ మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీలోని ప్రత్యేక కోల్డ్ సెల్‌లో ఉంది.
ఇప్పటికీ చూడొచ్చు
రాతియుగం ప్రజలు ఎలా జీవించారు? ఎలా పనిచేశారు? వాళ్ల లైఫ్ స్టయిల్ ఏంటి? ఇలాంటి అనేక విషయాలను ఒట్జీ విలేజ్‌కి వెళ్లి తెలుసుకోవచ్చు. అక్కడ ఏర్పాటు చేసిన ఆర్కియాలజీ పార్క్‌లో అప్పటి గుడిసెలు, వాళ్లు వాడిన పనిముట్లు, ఆయుధాల నమూనాలు ఉంచారు. అక్కడికి వెళ్తే.. అప్పటి మనుషుల విలువిద్య నైపుణ్యాలు, చర్మాన్ని శుభ్రపరుచుకునే విధానాలు చూడొచ్చు.