- గిరి ప్రదక్షిణ’కు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు
చిన్నచింతకుంట, వెలుగు: పేదల తిరుపతిగా పేరొందిన మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో వెలిసిన కురుమూర్తి క్షేత్రం కాషాయమయమైంది. వీహెచ్పీ పిలుపు మేరకు శనివారం నిర్వహించిన కురుమూర్తి గిరి ప్రదక్షిణకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అమ్మాపూర్ గ్రామం నుంచి వీహెచ్ పీ లీడర్లు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, భక్తులు కురుమూర్తి క్షేత్రానికి కాలి నడకన బయల్దేరారు.
రాజ గోపురం వద్ద దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి, తూడి మేఘారెడ్డి, శివానంద స్వామిజీ, శంకర స్వామీజీ, అమ్మాపూర్ సంస్థానాధీశుడు శ్రీరామ్ భూపాల్ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి క్షేత్రం చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. రాజ గోపురం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎమ్మార్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటిసారి సీఎం స్థాయి వ్యక్తి కురుమూర్తి క్షేత్రానికి వచ్చారని తెలిపారు.
స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ క్షేత్రం డెవలప్మెంట్ కోసం రూ.110 కోట్లు మంజూరు చేశారన్నారు. మరిన్ని అభివృద్ధి పనుల కోసం అదనంగా రూ.60 కోట్ల ఎస్టిమేషన్లు పంపినట్లు చెప్పారు. ఆలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఈవో మధనేశ్వర్ రెడ్డి, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు యాజిరెడ్డి, వీహెచ్పీ లీడర్లు కురువ రమేశ్, శివన్న, శ్రీకృష్ణ పాల్గొన్నారు.