విశ్లేషణ: వర్సిటీ భూములను కాపాడాలి

ఎన్నో ఏండ్లుగా, ఎంతో మంది స్టూడెంట్లకు జీవితాన్నిచ్చిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్​ ఉనికి నేడు ప్రమాదంలో పడింది. దీనికి కారణం వర్సిటీ చుట్టూ ఉన్న వేల కోట్ల విలువ చేసే భూములు కబ్జాలకు గురికావడమే. ఆ భూములను గుర్తించేదెవరు? కబ్జా కోరల్లో చిక్కిన వాటిని కాపాడేదెవరు? ఎంతో మంది ప్రముఖులను దేశానికి అందించిన ఈ యూనివర్సిటీ.. భవిష్యత్​ తరాలకు సేవలు అందించాలంటే దానిని కాపాడుకోవడం ఒక్కటే మార్గం. వర్సిటీని, దానికి సంబంధించిన భూములను కాపాడుకునేందుకు అందరూ నడుం బిగించాలి.

తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 399 మంది బలిదానం కారణంగా 610 జీవోలో భాగంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తెలంగాణకు సెంట్రల్​ యూనివర్సిటీని ప్రకటించారు. అప్పుడు నగరానికి దూరంగా ఉన్న 2,835 ఎకరాల భూమిని యూనివర్సిటీకి కేటాయించారు. మొదటి వైస్ చాన్స్​లర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న గుర్ భక్షి సింగ్ దాదాపు 29 కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్రేట్ వాల్ ఆఫ్ యూనివర్సిటీని నిర్మించారు. ఆ తర్వాత హైదరాబాద్ అభివృద్ధి చెంది, ఐటీ హబ్ గా మారడంతో ఇక్కడి భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వర్సిటీ భూములను కబ్జా చేస్తున్నారు. ఈ భూములను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.

అదను చూసి ఆక్రమించాలని..

దాదాపు ఐదు వేల మంది స్టూడెంట్స్‌‌‌‌ ఉన్న యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్‌‌‌‌ ను 1974లో స్థాపించారు. కేంద్రం ప్రకటించిన ఇన్‌‌‌‌స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ టాప్ 10 యూనివర్సిటీల్లో ఇది ఒకటి. ఇటీవల వర్సిటీకి చెందిన 394 ఎకరాల భూమిని కబ్జా చేసే కుట్ర జరుగుతోంది. రాజకీయ నాయకులు ప్రభుత్వాధికారులతో చేతులు కలిపి ఈ భూములు ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారు. కరోనా కారణంగా స్టూడెంట్లంతా తమ ఇండ్లకు వెళ్లిపోయారు. స్టూడెంట్స్‌‌‌‌ లేకపోవడంతో ఇదే అదనుగా భావించి ఇక్కడి భూములను ఆక్రమించాలని చూస్తున్నారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా వర్సిటీలో ఉన్న లెఫ్ట్, రైట్ వింగ్, దళిత, బహుజన, బీసీ కులాల విద్యార్థి సంఘాల నాయకులే కాకుండా వర్సిటీ అధికారులు విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తున్నాయి.

స్టూడెంట్లకు సేవలు..

ప్రస్తుతం యూనివర్సిటీ మానవీయ సామాజిక శాస్త్రాలు, సాంఘిక శాస్ట్రాలు, మేనేజ్‌‌‌‌మెంట్ కోర్సులు, లైఫ్ సైన్స్, ప్యూర్ సైన్స్, పబ్లిక్ హెల్త్ వంటి విభిన్న విభాగాల్లో ఉన్నత విలువలతో కూడిన పరిశోధనలకు అవకాశం కల్పిస్తోంది. అలాగే శాస్ట్ర సాంకేతిక రంగాలకు కావాల్సిన హ్యూమన్ రిసోర్స్ ను, ఉద్యోగ కల్పనను అందిస్తోంది. ఈ వర్సిటీకి తెలంగాణ నుంచే ఈ ఏడాది దాదాపు 46 శాతం అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో చదివే స్టూడెంట్లలో 80 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌‌‌‌ తదితర వెనుకబడిన తరగతుల చెందిన వారే. అతి తక్కువ ఫీజులతో స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ ప్రతి నెలా బీబీఎల్‌‌‌‌ ఫెలోషిప్ అందిస్తూ సామాన్య, నిరుపేద విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తోంది. అంతేకాక ఈ మధ్యకాలంలో ప్రైమ్ మినిస్టర్ ఫెలోషిప్స్​కు కూడా భారీ సంఖ్యలో విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ వర్సిటీలోని ఎంతో మంది పద్మశ్రీ, పద్మ భూషణ్, శాంతి పురస్కారాలు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందారు. వీరే కాకుండా కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ బహుమతికి సెలక్ట్ అయిన వారూ ఉన్నారు. ప్రస్తుతం వర్సిటీలో కరోనా వైరస్ పై ఎక్స్ పెరిమెంట్స్‌‌‌‌ జరుగుతున్నాయి. అలాగే అనేక దీర్ఘ, స్వల్ప కాలిక వ్యాధులపై, పబ్లిక్ హెల్త్ పైనా పరిశోధనలు సాగుతున్నాయి. ఇంతటి ఉన్నతమైన వర్సిటీ భూములను స్థానిక నాయకులు కబ్జా చేయాలని చూస్తున్నారు.

భూముల విలువ పెరగడంతో..

యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో ఇక్కడి భూములకు విలువ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్ విలువ ఒక్కో ఎకరాకు సుమారు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు ఉంది. ఈ కారణంగా ఈ భూములపై స్థానిక లీడర్లు కన్ను వేశారు. వీరిని ఇలాగే వదిలేస్తే వర్సిటీలోని భూమినంతటినీ ఆక్రమించే అవకాశం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీని కాపాడేందుకు చర్యలు చేపట్టాలి. స్థానికులకు ఉద్యోగ అవకాశాలను కల్పించి, ఈ వర్సిటీని ప్రపంచ పటంలో ఉండేందుకు కావాల్సిన అన్ని చర్యలనూ తీసుకోవాలి. అంతే కాని కబ్జాదారులకు మద్దతు ఇవ్వకూడదు. ఇప్పటికే రాష్ట్రంలో విద్యార్థులకు రిజర్వేషన్స్‌‌‌‌ అందకుండా, ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ రాకుండా కేవలం డబ్బున్న వారే చదువుకునేలా, సామాన్యులను విద్యకు దూరం చేసేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలి. ఇది విద్యకు సంబంధించిన అంశం. విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. కనుక దీనిపై కేంద్రం కూడా జోక్యం చేసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి.  కబ్జాదారుల నుంచి వర్సిటీ భూములను కాపాడటానికి వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు సిద్ధాంతాలకు అతీతంగా ముందుకు రావాలి. ఈ భూములను కాపాడుకోవడం మనందరి బాధ్యత.

ఎన్నో అక్రమ కట్టడాలు..

ప్రస్తుతం 2,300 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ ఉంది. ఇందులో మూడు చెరువులు, కొండ ప్రాంతాలు, 734 రకాల మొక్కలు, అనేక రకాల అడవి జంతువులు, పక్షులకు నిలయంగా ఉంది. అయితే వర్సిటీకి చెందిన భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇప్పటికే ఎన్నో దేవాలయ నిర్మాణాలు చేపట్టారు. వర్సిటీ చుట్టూ రక్షణ కవచంగా నిర్మించిన గోడను పడగొట్టి అక్రమ నిర్మాణాలను చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వర్సిటీ ప్రహారీ గోడను కూల్చడం వల్ల అనుమానిత వ్యక్తులు వర్సిటీలోకి ప్రవేశించి, స్టూడెంట్స్‌‌‌‌పై భౌతిక దాడులకు పాల్పడే అలాగే, సంఘ వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉంది. ఫలితంగా మహిళల రక్షణ, వర్సిటీలో ఉన్న బయోడైవర్సిటీ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ భూములను కబ్జాలు చేయడం వల్ల జీవావరణం పూర్తిగా దెబ్బతింటోంది.

–వై.శివకుమార్, రాష్ట్ర ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్