
- నాలుగు నెలల్లో 3,150 మిస్సింగ్ కేసులు
శ్రావణి, మనీషా, కల్పన.. ముగ్గు రిదీ ఒకే కథ.మిస్సింగ్‌గా మొదలైన వారి కథ.. విగత జీవులుగా ముగిసింది. శ్రీనివాసరెడ్డి కిరాతకానికి వాళ్లు బలైపోయారు. వాళ్లే కాదు.. రాష్ట్రం లో ఇంటి నుంచి బయటకొచ్చి తిరిగిరాని వారు వేలాది మంది ఉన్నారు. మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బిడ్డలు కనిపించించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఏళ్ల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. కేసు పెట్టినా పోలీసులు ఓ నాలుగు రోజులు వెతికి తర్వాత వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు 5 వేలకు పైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.అందులో 3,150 కేసులు మహిళలు, బాలికలకు సంబంధించినవే. తల్లిదండ్రులు తిట్టారనో,చదవడం ఇష్టం లేదనో, ప్రేమ వ్యవహారాల వల్లో బాలికలు ఇంటి నుంచి వదిలి వెళ్లిపోతున్నారు.భర్త తాగొచ్చి హింసించడం, అనుమానాలతో వేధింపులకు మహిళలు ఇంటి నుంచి వెళ్లిపోతున్నారని పోలీసులు చెబుతున్నారు. 70 శాతం కేసులను వెంటనే ఛేదిస్తున్నా, 30 శాతం కేసుల్లో మాత్రం పురోగతి ఉండడం లేదని సమాచారం.పోలీసులూ ఆయా కేసులపై లోతుగా దర్యాప్తు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.హాజీపూర్శ్రావణి, కల్పన, మనీషా ఉదంతాల్లోనూ పోలీసులు ఇలాగే వ్యవహరించారన్న విమర్శలున్నాయి. శ్రావణి కేసులో రెండు రోజులైనా ఎస్సైదర్యాప్తు చేయకపోవడం అందుకు ఉదాహరణ.
హైదరాబాద్‌లోనే ఎక్కువ....
రాష్ట్ర వ్యాప్తంగా రోజూ 30 నుంచి 70 కేసులు నమోదవుతున్నాయి. అందులో సగటున 25 కేసులు మహిళలు బాలికల మిస్సింగ్ కేసులే. ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో 80 శాతం కేసులు హైదరాబాద్, రాచకొండ, సైబారాబాద్ కమిషనరేట్ల పరిధిలోనే ఉండడం గమనార్హం. అవికాకుండా పోలీసుల దాకా రాని మిస్సింగ్ కేసులూ ఉంటున్నాయి. కొందరు పరువు పోతుందన్న భయం,ఇతర కారణాలతో పోలీసుల దగ్గరకు వెళ్లడం లేదు. పోలీసులకూ ఈ మిస్సింగ్ కేసులు తలనొప్పిగా మారాయి. కుటుంబ సభ్యుల ఆందోళన,ఆవేదనతో వారిపై ఒత్తిడి పెరుగుతోంది. ఎక్కువ కేసులను మిస్సయిన వారు వాడే సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగానే ఛేదిస్తున్నారు. సెల్‌ఫోన్ వాడని వాళ్ళ యితే జాడ తెలుసుకోవడం కష్టమవుతోందని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.
డాటాబేస్ నిర్వహణలో నిర్లక్ష్యం…
పెండింగ్ లో ఉన్న 23,163 మిస్సింగ్ కేసుల్లో కేవలం 9,894 మంది ఫొటోలనే క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్ వర్క్ సిస్టం (సీసీటీఎన్ ఎస్ ) డేటాబేస్ లో పోలీస్ సిబ్బంది అప్‌లోడ్ చేశారు. ఇంకా 13,269 మంది వ్యక్తుల ఫొటోలను అప్‌లోడ్ చేయకపోవడం సిబ్బంది పనితీరుకు అద్దం పడుతోంది. దీంతోనెల క్రితం డేటాబేస్ నిర్వహణ తీరుపై డీజీపీమహేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సీసీటీఎన్ ఎస్ డేటాబేస్ ను త్వరగా అప్‌డేట్ చేయాలని, మిగతా మిస్సయిన వ్యక్తులఫొటోలను అ ప్లోడ్ చేయలని అప్పటికప్పుడు ఆయన ఓ సర్క్ యులర్ జారీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా నమోదవుతున్న మిస్సింగ్ వ్యక్తులు, పిల్లల వివరాలను ‘ట్రాక్ ది మిస్సింగ్ చైల్డ్’వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంటారు. ఈ వెబ్ సైట్ లోనూ రాష్ట్రానికి సంబంధించిన కేసుల సంఖ్యను తక్కువగా చూపడం, పిల్లల సమాచారం, ఫొటోలను మొక్కుబడిగా అప్‌లోడ్ చేస్తున్నారు. కావాలనే పోలీసులూ మిస్సింగ్ కేసుల అసలు సంఖ్యను దాచిపెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.