వింత కీటకాలు అప్పుడప్పుడు తారసపడుతుంటాయి. రోడ్డుపై గుంపులు గుంపులుగా ఎగురుతూ..వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయి. అయితే ఇలాంటి సన్నివేశాలు విదేశాల్లో జరిగినట్లు వింటాం..కొన్ని వీడియోలు కూడా చూస్తాం. కానీ మన తెలంగాణలో మొదటిసారిగా వింత కీటకాలు వాహనదారులకు చుక్కలు చూపించాయి. రోడ్డుపై ఒకే దగ్గర గుంపులు గుంపులుగా ఎగురుతూ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ అలుగునూరు వంతెనపై వింత కిటకాలు విజృంభించాయి. లక్షల సంఖ్యలో కీటకాలు ఎగురుతూ జనాలను భయాందోళనకు గురిచేశాయి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ.. తెల్ల తెల్లగా..మిడతల వలే ఉన్నాయి. కానీ ఇవి మిడతలు కావు. అయితే ఈ వింత కీటకాలు రోడ్డుపై గుంపులుగా చేరడంతో వాహనదారులకు దారి కన్పించలేదు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ప్రాంతంలో ప్రతీ ఏడాది ఇదే సీజన్ లో వింత కీటకాలు పరేషాన్ చేస్తున్నాయని స్థానికులు, వాహనదారులు చెబుతున్నారు. వేలాదిగా కాకతీయ కాల్వల పరిసరాల్లో సంచరిస్తూ..న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటాయని బాధితులు వెల్లడించారు. గతంలో ఈ వింత కీటకాలపై మున్సిపల్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని..ఆ సమయంలో ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేసి కీటకాలను దారి మళ్లించారని గుర్తు చేశారు. తాజాగా మరోసారి కీటకాలు ఇబ్బంది పెడుతున్నాయి...అధికారులు మళ్లీ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.