
- అప్పులకు మిత్తి పెరిగిపోతోందని ఆవేదన
మెదక్, నిజాంపేట, వెలుగు: సర్కార్ గైడ్లైన్స్ఎప్పుడొస్తయో మాకు గొర్రెలు ఎప్పుడిప్పిస్తరో అని జిల్లాలో వేలాది మంది గొర్ల కాపరులు ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ సబ్సిడీపై గొర్లను ఇస్తామని చెబితే వాటి కోసం అర్హులైన గొల్ల, కుర్మలు తమ వంతు వాటాగా డీడీలు కట్టారు. నెలలు గడిచినా ప్రభుత్వం గొర్లను అందించలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అసలు గొర్రెలు వస్తాయా ? రావా ? అని గొర్ల కాపారులు ఆందోళన చెందుతున్నారు. మిత్తికి అప్పు తెచ్చి, బంగారం కుదువ పెట్టీ డీడీలు కడితే అటు గొర్రెలు రాక.. ఇటు తెచ్చిన అప్పులకు మిత్తి పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గొల్లకుర్మలకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లా వ్యాప్తంగా 341 సంఘాలు ఉండగా, వాటిల్లో 20,182 మంది సభ్యులు ఉన్నారు. మొదటి విడతలో జిల్లాలో రూ.128.37 కోట్లతో 12,997 గొర్రెల యూనిట్లను మంజూరు చేశారు. రెండో విడతలో 6,774 మంది గొల్ల కుర్మలు రిజిస్టర్ చేసుకున్నారు. గతంలో యూనిట్కాస్ట్ రూ.1.25 లక్షలు ఉండగా అది కాస్త రూ.1.75 లక్షలకు పెరిగింది. ఈ క్రమంలో పెరిగిన యూనిట్ వ్యయానికి అనుగుణంగా లబ్దిదారు వాటా రూ.31,250 నుంచి రూ.43,750కి పెరిగింది.
ఈ మేరకు 2,584 మంది లబ్దిదారులు వర్చువల్ ఐడీ ద్వారా తమ వాటా డబ్బులు చెల్లించారు. వారిలో కేవలం 642 మంది లబ్దిదారులకు మాత్రమే 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లు ఇప్పించారు. మిగితా వేలాది మంది డీడీలు కట్టి ఏడాది గడచినా గొర్రెల యూనిట్లు మంజూరు కాలేదు. దీంతో గొల్లకుర్మలు రోజుల తరబడి ఆఫీస్ల చుట్టూ తిరుగుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల స్కీంను అమలు చేస్తారా? లేదా? అని గొర్రెల కాపరులు ఆందోళన చెందుతున్నారు. డీడీలు కట్టిన వారికి గొర్రెలు ఇప్పించాలని కోరుతున్నారు. రెండు రోజుల కిందట గొర్రె కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేశం యాదవ్, నర్సాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మురళీ యాదవ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
డీడీలు కట్టిన వారికి వెంటనే గొర్రెలు ఇప్పించాలని లేదా కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై వెటర్నరీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లను అడిగితే గొర్రెల పంపిణీ స్కీం అమలు గురించి గవర్నమెంట్ నుంచి ఎలాంటి గైడ్లైన్స్ రాలేదని చెబుతున్నారు. గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే తదనుగుణంగా చర్యలు చేపడతామని అంటున్నారు.
డీడీ కట్టి పదినెళ్లవుతుంది
గొర్ల కోసం డీడీ కట్టి పది నెలలు అయింది. మా వాటా కోసం పైసలు మిత్తికి తెచ్చి డీడీ కట్టినా. అప్పు తెచ్చిన దగ్గర మిత్తిలు పెరుగుతున్నాయి కానీ గొర్లు మాత్రం రావడం లేదు. ఆఫీసర్లు ఇప్పటికైనా గొర్లు తొందరగా అచ్చేటట్టు చూడాలి.కంపె పర్శయ్య, చల్మెడ
ఇంకా గైడ్లైన్స్ రాలేదు
రెండో విడత గొర్రెల పంపిణీకి సంబంధించి ఇంకా గవర్నమెంట్ నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదు. ఏవైనా గైడ్లైన్స్ వస్తే తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
విజయ్శేఖర్ రెడ్డి, జిల్లా వెటర్నరీ ఆఫీసర్
అప్పులోళ్లు ఇంటికి వస్తున్రు
గొర్లు వస్తయని చెబితే 18 నెలల కింద అప్పు తెచ్చి డీడీ తీసినం. అప్పులోళ్లు ఇంటికి వస్తున్నారు కానీ గొర్లు మాత్రం రావడం లేదు. మా బతుకు దెరువే గొర్ల తోటి వాటిని ఇప్పిస్తేనే సాదుకుంట బతుకుతం. తొందరగా గొర్లు అచ్చేటట్టు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలే.
ఎల్లయ్య, నిజాంపేట