హర్యానా ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం లక్షకుపైగా లారీ డ్రైవర్లను రోడ్డున పడేసింది. లారీ డ్రైవర్లందరికీ లైసెన్సులు ఉంటాయి. ఇది చాలా కామన్. అయితే బయటి రాష్ట్రాల లైసెన్సులు చెల్లవని 2016 లో మనోహర్ లాల్ ఖట్టర్ నాయకత్వాన గల హర్యానా ప్రభుత్వం పేర్కొంది. అందరూ హర్యానా ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ ఇచ్చే లైసెన్సులు తీసుకోవాలని జీవో జారీ చేసింది. కథ అంతటితో ఆగలేదు. లైసెన్స్ ఇవ్వడానికి లారీ డ్రైవర్ కనీసం టెన్త్ క్లాస్ చదివి ఉండాలని షరతు పెట్టింది. మూడేళ్ల కిందట హర్యానా సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపుగా రాష్ట్రంలోని డ్రైవర్లంతా ఉపాధి కోల్పోయారు. లారీలు నడపడం మానేసి చిన్నా చితకా ఇతర పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు.
సహజంగా లారీ డ్రైవర్లకు చదువు పెద్దగా ఉండదు. ఎక్కువ మంది టెన్త్ లోపే చదివి ఉంటారు. టెన్త్ పాసైన వారు చాలా తక్కువగా ఉంటారు. లైసెన్స్ ఇవ్వడానికి టెన్త్ పాసై ఉండటం తప్పనిసరి చేయడంతో లారీ డ్రైవర్లు లబోదిబో మంటున్నారు. నూహ్ జిల్లాలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. టెన్త్ సర్టిఫికెట్ లేకపోవడంతో ఈ జిల్లాలో మెజారిటీ డ్రైవర్ల లైసెన్సులు రెన్యూవల్ కాలేదు. దీంతో డ్రైవర్ ఉద్యోగానికి దూరంగా మిగతా పనులు చేసుకుని బతుకుతున్నారు.
మహమ్మద్ ఇస్మాయిల్ నూహ్ జిల్లాకు చెందిన ఓ ట్రక్కు డ్రైవర్. ఖట్టర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో రోడ్డున పడ్డాడు. ఇస్మాయిల్ ది వానాకాలం చదువు. ఎనిమిదో తరగతితో చదువు ఆపేశాడు. చదివింది పది లోపే అయినా హై వేస్ పై ఇంగ్లీషులో రాసి ఉన్న అన్ని బోర్డులను చదవగలడు. ఉర్దూ, హిందీ మాట్లాడతాడు. దీంతో దేశంలోని ఏ ప్రాంతానికైనా లోడ్ తీసుకుని వెళ్లగలడు. 27 ఏళ్ల అనుభవం ఉన్న డ్రైవర్ ఉద్యోగానికి కేవలం టెన్త్ సర్టిఫికెట్ లేదన్న కారణంతో దూరమయ్యాడు. డ్రైవింగ్ మానేసి చిన్నా చితకా పనులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. లారీ డ్రైవర్ గా ఉన్నప్పుడు నెలకు రూ. 30 వేల వరకు సంపాదించుకునే వాడు. ఇప్పుడు చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకురావడానికి చెమటోడుస్తున్నాడు.
జాఫర్ ఖాన్ ది మరింత దయనీయమైన స్టోరీ. 2016 వరకు లారీలు నడుపుతూ దిలాసాగా జీవితం గడిపాడు. పెద్ద కుటుంబం. ఆదాయం కూడా బాగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. టెన్త్ సర్టిఫికెట్ మెలిక పెట్టడంతో లారీలు తోలడం బంద్ అయింది. దాచుకున్న సొమ్ములతో ఇన్నాళ్లూ నెట్టుకొచ్చాడు. ఇంట్లో పెళ్లికెదిగిన కూతురు. స్కూల్ కెళుతున్న పిల్లలు. బండి ఎలా నడపాలో తెలియక జాఫర్ ఖాన్ నానా ఇబ్బందులు పడుతున్నాడు. వీరే కాదు నూహ్ జిల్లాలో చాలా మందిది ఇలాంటి పరిస్థితే.ఏమైనా ఖట్టర్ సర్కార్ పెట్టిన ఓ రూల్ లక్షలాది మంది లారీ డ్రైవర్లకు పని లేకుండా చేసింది.
సేద్యం లేదు, పరిశ్రమలూ లేవు
నూహ్ జిల్లా, దేశంలోనే బాగా వెనుకబడ్డ ప్రాంతం. ఈ జిల్లాలోని భూములు సాగుకు పనికిరావు. అలా అని పరిశ్రమలు కూడా లేవు.ఎక్కువ మంది పేదవారు.చదువులు కూడా తక్కువే. దీంతో చాలా మంది కాస్తంత వయసు రాగానే డ్రైవింగ్ నేర్చుకుంటారు. ఎక్కడ్నుంచో ఓ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుని లారీ డ్రైవర్లుగానో పెద్ద వారి ఇళ్లల్లో కారు డ్రైవర్లుగా చేరిపోతారు. ఒక్క నూహ్ జిల్లా నుంచే లక్ష మందికి పైగా లారీ డ్రైవర్లు ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ ఓ లారీ డ్రైవర్ ఉంటాడు. వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు.