రెండేండ్లకు మళ్లొస్తం .. వనంలోకి వెళ్లిన సమ్మక్క, సారక్క

రెండేండ్లకు మళ్లొస్తం .. వనంలోకి వెళ్లిన సమ్మక్క, సారక్క
  • ముగిసిన జాతరలు మొక్కులు సమర్పించుకున్న భక్తులు 

కోల్​బెల్ట్/మంచిర్యాల, వెలుగు: వనంలో నుంచి జనం లోకి వచ్చి భక్తులకు దర్శనమిచ్చిన వనదేవతలు సమ్మక్క, సారక్క తిరిగి వనంలోకి వెళ్లిపోయారు. దీంతో నాలుగు రోజులుగా జరుగుతున్న జాతర శనివారం ముగిసింది. రామకృష్ణాపూర్ పట్టణ శివారు ఆర్కే1ఏ బొగ్గు గని సమీప​ పాలవాగు ఒడ్డున, శ్రీరాంపూర్​లోని ముక్కిడి పోచమ్మ ఆలయం ఆవరణలో పూజలందుకున్న తల్లులు మళ్లీ వనంలోకి ప్రవేశించారు. సాయంత్రం కోయపూజారులు దేవతామూర్తులకు ఉద్వాసన కార్యక్రమం చేపట్టారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి సమ్మక్క, సారలమ్మ, పగిడిగిద్దెరాజు, జంపన్నల దేవతామూర్తులను గద్దెలపై కదిలించడం ద్వారా ఉద్వాసన కార్యక్రమం పూర్తయ్యింది. 

ఆ తర్వాత తల్లులను వనప్రవేశం చేయించారు. అంతకుముందు మందమర్రి ఏరియా సింగరేణి ఎస్​ఓటుజీఎం, జాతర కమిటీ చైర్మన్, రాజేశ్వర్​రెడ్డి, ఏజీఎం నాగరాజు, ఆర్కేపీ పీఓ గోవిందరావు, ఆర్కే1ఏ మేనేజర్​జయంత్ కుమార్, ఏఐటీయూసీ లీడర్​సలెంద్ర సత్యనారాయణ, జాతర కమిటీ మెంబర్లు ప్రత్యేక పూజలు చేశారు. ఎస్​ఓటుజీఎం మాట్లాడుతూ..  జాతర విజయవంతానికి ఆర్కే-1ఏ గని యాజమాన్యం, ఎంప్లాయిస్​, పోలీసులతో పాటు సింగరేణి అన్ని డిపార్ట్​మెంట్ల ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఎంతో కృషి చేశాయని వారిని అభినందించారు. ఆర్కే-1ఏ మేనేజర్​ జయంత్​ కుమార్​ నేతృత్వంలో టీం సేవలను  అభినందించారు.  

మందమర్రికి కానుకలు

రామకృష్ణాపూర్​లోని జాతరకు నాలుగో రోజు సైతం భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి తల్లులకు మొక్కులు సమర్పించుకున్నారు. ఉదయం నుంచి భక్తుల సందడి కొనసాగింది. హూండీలతో పాటు భక్తులు సమర్పించిన కుడుకలు, వస్ర్తాలు, బియ్యం, ఇతర కానుకలను మందమర్రికి తరలించారు. శ్రీరాంపూర్​ ఏరియాలోని సీసీసీ నస్పూర్ ​ముక్కిడి పోచమ్మ తల్లి ఆలయం ఆవరణలో నిర్వహించిన సమక్క సారలమ్మ జాతర ముగింపు కార్యక్రమంలో శ్రీరాంపూర్​ఏరియా సింగరేణి జీఎం సంజీవరెడ్డి, ఎస్​ఓటుజీఎం రఘుకుమార్, ఏజీఎం మురళీధర్, డీజీఎం పర్సనల్​అరవింద్​ తదితరులు పాల్గొని పూజలు చేశారు. 

మంచిర్యాలలో 3 లక్షల మందికిపైగా..

మంచిర్యాల గోదావరి నదీతీరంలో జన ప్రవేశం చేసిన తల్లులను కోయపూజారులు ఉదయం 10 గంటలకు వన ప్రవేశం చేయించడంలో జాతర ముగిసింది. ఇక్కడ జరిగిన జాతరకు మూడు లక్షల మందికి పైగా తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. ఎత్తు బంగారం సమర్పించి, యాటలు బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. పోలీసుల సమ క్షంలో హుండీ ఆదాయం లెక్కించగా రూ.14 లక్షల 22 వేలు సమకూరింది..