తప్పుల పేరుతో పోడు తిప్పలు.. వేలమందికి అందని పోడు పట్టాలు

రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందికి అందని పోడు పట్టాలు
వివిధ కారణాలతో ఇవ్వకుండా పక్కన పెట్టిన ఆఫీసర్లు 
ఒక్క భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనే 700 మందికి అందలే
అర్హుల లిస్టులో ఉన్నవారి పాస్​బుక్​లు నేటికీ ఆఫీసర్ల వద్దే!
రైతుబీమా దరఖాస్తుకు ఇయ్యాలే ఆఖరు
ఆందోళనలో గిరిజనులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:ఆఫీసర్ల నిర్లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందికి ఇంకా పోడు పట్టాలు అందలేదు. అర్హుల లిస్టులో ఉన్నప్పటికీ ప్రింటింగ్​లో తప్పులు, కోర్టు కేసులంటూ అధికారులు పంపిణీ చేయకుండా పక్కన పెట్టేశారు. ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే సుమారు 700 మంది గిరిజనులకు పట్టాలు అందలేదు. మరోవైపు రైతు బీమాకు అప్లై చేసుకునేందుకు శనివారంతో గడువు ముగియనుంది. దీంతో ఇప్పటికే రైతుబంధుకు దూరమవుతున్న పోడు సాగుదారులు, తాజాగా రైతు బీమాకు కూడా దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. పట్టాలు లేకపోతే వానాకాలం క్రాప్​లోన్లకూ రైతులు అవకాశం కోల్పోనున్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని సర్కారు చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా  4.14 లక్షల మంది12.5 లక్షల ఎకరాల కోసం అప్లై చేసుకున్నారు. ఏడాది తర్వాత వీటిలో కేవలం మూడో వంతు1,50,224 మంది రైతులకు 4,01,405 ఎకరాలకు మాత్రమే అటవీ హక్కు పత్రాలను అందిస్తామని ప్రకటించింది. జూన్ నెలలో పంపిణీ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ప్రింటింగ్​లో తప్పులున్నాయంటూ రాష్ట్రవ్యాప్తంగా అధికారులు వేలాది మందికి ఇవ్వకుండా ఆపేశారు.

తప్పులు సరిచేసేందుకు ఇన్నిరోజులా?
అర్హుల లిస్టులో ఉండి కూడా పోడు పట్టాలు చేతికి అందకపోవడంతో గిరిజనులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. జూన్ 30వ తేదీన భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో మంత్రులు హరీశ్​రావు, పువ్వాడ అజయ్​కుమార్​పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల్లో మండలాల వారీగా ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అయితే ‘‘పట్టాల ప్రింటింగ్​లో తప్పులు దొర్లాయి.. కొందరి పేరు మీద విస్తీర్ణం ఎక్కువగా ఉంది.. మరికొందరికి తగ్గింది..  ఇంకొందరి పట్టాల్లో విస్తీర్ణం పేజీ ఖాళీగా ఉంది’’ ఇలా వివిధ కారణాలతో వేర్వేరు మండలాల్లో అర్హుల లిస్టులో ఉన్న వేలాది మందికి పట్టాలు ఇవ్వకుండా ఆపారు. ‘‘ప్రింటింగ్​విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.. తప్పులకు తావులేకుండా అన్నిరకాల చర్యలు చేపట్టాం.. ఇందుకు గానూ ప్రత్యేక సిబ్బందిని నియమించాం.. పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయ్..” అని పలు సందర్భాల్లో చెప్పిన అధికారులే తీరా పంపిణీ టైంలో ఇవ్వకుండా ఆపడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మార్పులు చేసి ఇస్తామని చెప్పి నెలరోజులు దాటినా నేటికీ పంపిణీ చేయకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి, ఆళ్లపల్లి, గుండాల, టేకులపల్లి, పాల్వంచ, కరకగూడెం, పినపాక, అశ్వాపురం, చండ్రుగొండ, దుమ్ముగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, ముల్కలపల్లి తదితర మండలాల్లో దాదాపు 700 మందికి పైగా పోడు పట్టాలు అందాల్సి ఉంది. వీరందరికీ పట్టాల్లో తప్పులు వచ్చాయంటూ ఇవ్వకుండా పక్కన పెట్టారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో కోర్టు కేసులంటూ దాదాపు 250కి పైగా పోడు పట్టాలను చివరి క్షణంలో పంపిణీ చేయకుండా ఆపేశారు. శాటిలైట్​ సర్వే చేశామని చెప్పిన ఆఫీసర్లు.. కోర్టు ఆదేశాల మేరకు పంపిణీ చేయకుండా ఆపుతున్నామని పేర్కొనడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. రెవెన్యూ, ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరితోపాటు రాష్ట్రంలోని మిగిలిన ఏజెన్సీ ఏరియాల్లో వందల మందికి పోడు పట్టాలు అందాల్సి ఉంది. 
ఈసారికి బీమా లేనట్లే
రైతు బీమాకు దరఖాస్తు చేసుకునేందుకు శనివారంతో గడువు ముగియనుంది. పట్టాదార్​పాస్​బుక్కులు లేకపోతే బీమాకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. పోడు పట్టాలు అందకపోవడంతో ఈసారి వేలాది మంది గిరిజనులకు బీమా అందకుండా పోతుంది. మరోవైపు వానాకాలం సీజన్​కు సంబంధించి రైతుబంధును కోల్పోతున్నారు. పట్టాలు లేక బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు.

నెలరోజులుగా అతీగతి లేదు
నెలన్నర కింద పోడు పట్టా వచ్చిందని ఆఫీసర్లు చెప్పారు. తీరా పంపిణీ చేసే టైంకు పట్టా ప్రింటింగ్​లో తప్పులు దొర్లాయి అన్నారు. వాటిని సరిచేసి ఇస్తామని చెప్పారు. చెప్పి నెల రోజులు అవుతున్నా అతీగతీ లేదు. పట్టా అందకపోవడంతో రైతు బీమాకు దరఖాస్తు చేసుకునే చాన్స్​లేకుండా పోయింది. ఇప్పటికే పట్టా అందక రైతుబంధు రాకుండా పోయింది.
- నేమియా, బంగారు చెలక, భద్రాద్రికొత్తగూడెం జిల్లా

సరిచేసి ఇస్తామంటే సరేనన్నా
పోడు చేసిన భూమికి పట్టా వచ్చిందని ఆఫీసర్లు చెప్తే మస్తు సంబుర పడ్డా. తర్వాత ఆఫీసర్ల వద్దకు వెళ్లి అడిగితే పట్టాల్లో తప్పులు దొర్లాయి, సరి చేసి ఇస్తామంటే సరేనన్నా. చెప్పి నెల దాటింది ఇప్పటి వరకు పట్టా చేతికి రాలే. అది లేకపోవడంతో రైతు బీమాను కోల్పోతున్నా.
- వజ్జా రవికుమార్, కొత్త చింతకుంట, భద్రాద్రికొత్తగూడెం జిల్లా