Threads: థ్రెడ్స్ యాప్‌లో కొత్త ఫీచర్.. పోస్టులను ఎడిట్ చేసుకోవచ్చు..!

మెటా న్యూ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ థ్రెడ్స్ (Threads) కొత్త యూజర్ల వేటలో పడింది. సరికొత్త ఫీచర్లను లాంచ్ చేస్తూ యూజర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. లాంచ్ అయినప్పటి నుంచి కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న మెటా సంస్థ.. థ్రెడ్స్ యాప్లో తాజాగా పోస్ట్‌లను ఉచితంగా ఎడిట్ చేసుకునే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఎడిట్, వాయిస్ థ్రెడ్స్‌ (Voice Threads) ఫీచర్లను విడుదల చేస్తున్నాం. ఎంజాయ్ చేయండి అంటూ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ట్వీట్ చేశారు. 

Also Read : పెద్దారెడ్డి టైపోడు : అంబానీ పీఏ అంట.. దిల్ రాజు అల్లుడి కారు కొట్టేశాడు.. పోలీసులతోనే ఓవరాక్షన్

థ్రెడ్స్‌కు ప్రధాన పోటీదారు ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఎడిట్ ఫీచర్‌ను కేవలం పెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంచింది. థ్రెడ్స్‌ మాత్రం పబ్లిష్ చేసిన ఐదు నిమిషాలలోపు పోస్ట్‌లను ఫ్రీగా ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని యూజర్లందరికీ అందిస్తోంది. ఈ ఫీచర్‌తో అక్షరదోషాలను సరి చేసుకోవచ్చు. లేదా పోస్ట్‌లను డిలీట్ చేసి మళ్లీ పోస్ట్ చేయకుండా వాటిని అప్‌డేట్ చేసుకోవచ్చు.

థ్రెడ్స్‌ మొబైల్, వెబ్ వెర్షన్లలో ఎడిట్ బటన్ ఫీచర్ అందుబాటులో ఉంది. థ్రెడ్స్‌ ప్లాట్‌ఫామ్‌లో వాయిస్ నోట్స్‌ను షేర్ చేసుకునే ఆప్షన్ వల్ల యూజర్ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగుపడుతుంది. యూజర్లు మైక్రోఫోన్ బటన్‌ను నొక్కి వాయిస్‌ని రికార్డ్ చేసి దాన్ని పోస్ట్‌గా షేర్ చేయవచ్చు. ఈ ఫీచర్ థ్రెడ్స్‌ను మరింత ఇంటరాక్టివ్‌గా, టెక్స్ట్ కంటే ఆడియోను ఇష్టపడే యూజర్లకు ఆకర్షణీయంగా మారుస్తుంది.

ఎడిట్ ఫీచర్ ప్రత్యేకత

థ్రెడ్స్‌లో పోస్ట్‌ను ఎడిట్ చేసినప్పుడు పోస్ట్ చేసిన సమయానికి పక్కన ఒక చిన్న ఐకాన్ కనిపిస్తుంది. పోస్ట్‌లో ఏదో మార్చినట్లు ఈ ఐకాన్ చూపుతుంది. కానీ ఏం మార్చారో లేదా ఒరిజినల్ పోస్ట్ ఏంటో ఇతరులు చూడలేరు. పోస్ట్‌లో ఏం ఎడిట్ చేశారో యూజర్‌కు మాత్రమే తెలుస్తుంది. పోస్ట్‌లో చేసిన మార్పులను చూసేందుకు X వేరే ఫీచర్‌ని ఆఫర్ చేస్తోంది కానీ థ్రెడ్స్‌కు ఈ ఫీచర్ లేదు.