నిర్మల్, వెలుగు: కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. చరిత్రలో ఎన్నడు లేని విధంగా బుధవారం దాదాపు 5 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో రావడంతో ఓ దశలో ప్రాజెక్టు అస్థిత్వం ప్రశ్నార్థకమైంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు కూడా 17 గేట్లను ఎత్తేసి 3లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోను దిగువకు వదిలినప్పటికీ వరద ఉధృతి శాంతించలేదు. అయితే.. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఎగువ నుంచి ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతూ వచ్చింది. గురువారం ఉదయం 10 గంటలకు ఎగువ నుంచి 1,93,895 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగింది. క్రమంగా ఈ ఇన్ ఫ్లో సాయంత్రం 5 గంటలకు 1,62,610 క్యూసెక్కులకు తగ్గిపోయింది.
నీరు వచ్చింది వచ్చినట్లుగానే దిగువకు..
అధికారులు ఎగువ నుంచి వస్తున్న నీరును వచ్చింది వచ్చినట్లుగానే దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 17 గేట్ల నుంచి నీటిని కిందికి వదులుతున్నారు. వరద క్రమక్రమంగా తగ్గిపోవడంతో ఇటు ప్రాజెక్టు అధికారులు, అటు ముంపు గ్రామాల ప్రజల్లో టెన్షన్ తగ్గింది. రెండు రోజులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపిన వారంతా తేరుకుంటున్నారు. బుధవారం ఉదయం కడెం ప్రాజెక్టుకు మైసమ్మ గుడి వద్ద గండిపడడంతో ఆ గండి ద్వారా దాదాపు లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు కిందికి వెళ్లడం వల్ల ప్రాజెక్టుపై కొంత మేర భారం తగ్గింది. ప్రాజెక్టును వరద నుంచి రక్షించడంతో ఈ గండి తోడ్పడిందని అధికారులు, స్థానికులు అంటున్నారు. ఇక వరద గేట్ల రిపేర్లకు హైదరాబాద్ నుంచి టెక్నికల్ ఆఫీసర్ల టీమ్‌ను రప్పిస్తున్నారు. 2 రోజుల్లో ఈ టీం కడెం ప్రాజెక్టు వద్దకు చేరుకోనుంది. ముఖ్యంగా 8వ నంబర్ గేటుకు రిపేర్లు చేపట్టనుంది.
షెల్టర్ జోన్లలోనే నిరాశ్రయులు
కడెం ప్రాజెక్టు ద్వారా ముంపునకు గురయ్యే అవకాశాలున్న 13 గ్రామాల ప్రజలను అధికారులు షెల్టర్ జోన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. రెండో రోజైన గురువారం కూడా వీరందరినీ షెల్టర్ జోన్లోనే ఉంచారు. మరో రెండు రోజుల వరకు ఇక్కడే ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఎమ్మెల్యే రేఖా నాయక్‌తో పాటు పలు స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు వీరికి సౌకర్యాలు సమకూరుస్తున్నారు.
గేట్లకు రిపేర్లు లేకనే..
కడెం ప్రాజెక్టుకు ప్రతిసారి ఫ్లడ్ గేట్లు మొరాయించడంతోనే అసలు సమస్య ఏర్పడుతున్నది. ఏటా రిపేర్లు చేయకపోవడంతో వదర వచ్చినప్పుడు గేట్లను ఎత్తడం సవాల్‌గా మారుతున్నది. 1995లో కూడా గేట్లు మొరాయించిన కారణంగా ప్రాజెక్టుకు నష్టం జరిగింది. ఈ సారీ గేట్ల నిర్వాహణపై పర్యవేక్షణ లోపించినట్లు ఫిర్యాదులున్నాయి. ప్రాజెక్టు మొత్తం 18 గేట్లకుగాను 17 గేట్లు పనిచేస్తున్నాయి. 8వ నంబర్ గేటు మొరాయించడంతో పైకి ఎత్తలేకపోయారు. మిగతా 17 గేట్ల ద్వారా కిందికి నీటిని వదిలారు. ప్రభుత్వం ప్రాజెక్టుల రిపేర్లకు ఏటా నిధులు విడుదల చేయని కారణంగానే గేట్ల రిపేరు పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయని ఆఫీసర్లు అంటున్నారు.