బీ కేర్‌ఫుల్.. వరద నీటితో రోగాల ముప్పు

కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అన్‌‌లాక్‌‌ ప్రక్రియ మొదలవ్వడంతో ఎవరి జీవితాల్లో వారు బిజీ అవుతున్నారు. ఈ తరుణంలో అనుకోని రీతిలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉంటూ, ఒకరికొకరం సాయపడుతూ, సమిష్టి కృషితో సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఈ వానల వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుని, అప్రమత్తంగా ఉండాలి.

ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు

వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందు తెలుసుకుందాం. సాధారణంగా వర్షాకాలం మొదలవగానే వాతావరణ మార్పులతో ఫ్లూ లక్షణాలు కలగడం సహజం. జలుబు, జ్వరం, దగ్గు, అలసట, ఒళ్లు నొప్పుల నుంచి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం  ఉంటాయి. కరోనా లక్షణాలు ఏ ఫ్లూ వైరస్‌‌లో అయినా సహజం. ఎక్కువ శాతం ఇవి వైరస్‌‌ల వల్ల కలుగుతాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న వారు, ఎదుటి వారికి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, అది కరోనా కాదని నిర్ధారించుకోవాలి. కూల్​ డ్రింక్​లు తీసుకోకపోవడం, మాస్క్ ధరించడం, ఏ కాలంలో వచ్చే పండ్లు ఆ కాలంలో తినడం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు చేసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ముఖ్యం. ముందుగా వైరల్ ఇన్ఫెక్షన్ తో మొదలయినప్పటికీ, తర్వాత బాక్టీరియా ఇన్ఫెక్షన్​గా మారే అవకాశం ఉంది. కాబట్టి, ఆలస్యం చేయకుండా డాక్టర్ల సలహా తీసుకోవాలి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారు, ఇమ్యూనిటీ పవర్​ తక్కువ ఉన్న వాళ్లు ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. దమ్ము, ఆస్తమా వంటి ఊపిరితిత్తుల సమస్యలున్న వాళ్లకు చల్లటి వాతావరణం వల్ల ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. డాక్టర్ల సలహాతో ఇన్హేలర్, ఇతర మందులు క్రమం తప్పకుండా వాడుతూ, బయటకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ముందు జాగ్రత్తలు అవసరం

వర్షాలు, అపరిశుభ్ర నీటి ద్వారా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. టైఫాయిడ్, అతిసార, కలరా, వాంతులు, విరేచనాలు వంటివి రాకుండా కాచి చల్లార్చిన శుభ్రమైన మంచి నీరు తాగాలి. బయటి ఆహారం కాకుండా, ఇంట్లోనే వండిన ఆహారం అది కూడా వేడిగా ఉన్నప్పుడే తీసుకోవడం మంచిది. చల్లారిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసుకుని తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకవేళ అతిసార లక్షణాలు ఉంటే.. ముఖ్యంగా చిన్న పిల్లలు, ముసలివారు కొద్ది కొద్దిగా, ఎక్కువ సార్లు ద్రవ పదార్థాలు తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్‌‌‌‌ఎస్‌‌ కలిపిన నీళ్లు తాగాలి. నీళ్ల విరేచనాలకు అడ్డుకట్ట వేయడానికి సాబుదాన(సగ్గు బియ్యం) ఉపయోగపడుతుంది. పెరుగు ఎక్కువగా తీసుకోవడం వల్ల త్వరగా కోలుకుంటారు. లక్షణాలు తగ్గకపోతే, వెంటనే డాక్టర్‌‌‌‌ను కలవాలి.

దోమలు పెరగకుండా చూసుకోవాలి

వర్షాకాలంలో దోమల వల్ల కూడా జబ్బులు ప్రబలుతాయి. వర్షం వల్ల నిలిచిపోయే నీటిలో దోమలు వృద్ధి చెందుతాయి. దోమ కాటు వల్ల మలేరియా, డెంగీ మొదలైన వ్యాధులు వస్తాయి. మనదేశం మలేరియాకి ఎండమిక్. అందుకే ఏటా అధిక సంఖ్యలో జనం మలేరియా బారిన పడుతుంటారు. గత ఏడాది డెంగీ కేసులు అధిక సంఖ్యలో నమోదై, ఎందరో రోగులకు ప్లేట్‌‌లెట్స్‌‌ సంఖ్య తగ్గిపోయింది. వేల మందికి ప్లేట్‌‌లెట్స్‌‌ ఎక్కించాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితులకు జ్వరం రాగానే, అది కరోనా కాదని నిర్ధారణ చేసుకోవడం ఒక పెద్ద సమస్య. కరోనా, డెంగీ రెండింటితో ట్రీట్​మెంట్​కు వస్తున్న రోగులను చూస్తున్నాం. అలాంటప్పుడు ట్రీట్​మెంట్​ ఇంకా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. కాబట్టి, దోమ కాటుతో వచ్చే వ్యాధుల నుంచి తమని తాము కాపాడుకోవడానికి, ఇంట్లో, చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, మురుగునీటి కుంటల్లో కిరోసిన్ వేయడం, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమ తెరలు వాడడం, శరీరం మొత్తం కప్పే లాగా బట్టలు వేసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం, చలితో వణకడం వంటి లక్షణాలుంటే డాక్టర్​ను కలిసి ట్రీట్​మెంట్​ తీసుకోవాలి.

చిన్న చిన్న జాగ్రత్తలే బెటర్

కరోనా వచ్చి తగ్గిన వారిలో కూడా మళ్లీ రీ-ఇన్ఫెక్షన్ వస్తోందని వార్తలు వస్తున్నాయి. అందువల్ల ఇప్పటికే కరోనా బారిన పడిన వారు, పడనివారు కూడా, ఇంకొంత కాలం మాస్క్ లు ధరిస్తూ, శానిటైజర్ వాడుతూ, ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించాలి. వ్యాక్సిన్ ఒక్కటే ఈ మహమ్మారి నుంచి బయటపడే మార్గంగా కనిపిస్తున్నందున అప్పటి వరకు, ఎవరి ఆరోగ్యంపై వారే బాధ్యతగా వ్యవహరించడం అవసరం. లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జనం, తమ ఆరోగ్యాన్ని, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని చిన్న చిన్న జాగ్రత్తలతో కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని మర్చిపోకూడదు.

అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి

భారీ వర్షాల వల్ల, రోడ్లపై నీరు నిలిచిపోయి.. ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియడంలేదు. కాబట్టి, అత్యవసరమైతే తప్ప బయటకు
రాకపోవడం మంచిది. సరిగ్గా లేని రోడ్లు, అదుపులో ఉండని వాహనాల దృష్ట్యా, వేగాన్ని నియంత్రించుకోవడం ముఖ్యం. యాక్సిడెంట్లు కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ప్రమాదం బారిన పడితే వారితో పాటు కుటుంబ సభ్యులు ఆస్పత్రులకు వచ్చి ఇతర రోగాల బారిన పడకుండా ముందే జాగ్రత్త పడాలి. వర్షాలు తగ్గినాక, లాక్ డౌన్ వల్ల డాక్టర్ల వద్దకు వెళ్లలేకపోయిన దీర్ఘకాలిక
వ్యాధిగ్రస్తులు అపాయింట్ మెంట్ తీసుకుని డాక్టర్‌ ను కలవడం మంచిది. షుగర్, కొలెస్ట్రాల్, బీపీ, థైరాయిడ్, గుండె జబ్బులు ఉండి, పరీక్షలు అవసరమైన వాళ్లు ఆలస్యం చేయడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలకు టీకాలు ఇప్పించవలసిన వాళ్లు, రెగ్యు లర్ చెక్ అప్ చేసుకోవలసిన గర్భిణులు ఆలస్యం చేయడం మంచిది కాదు. తగు జాగ్రత్తలతో డాక్టర్లను కలిసి మందులు వాడాలి.

For More News..

మూసీని ఆక్రమించింది రాష్ట్ర సర్కారే

తెలంగాణ ప్రతిపాదనకు కర్నాటక నో!

ఖమ్మం అత్యాచార బాధితురాలు మృతి

ఎల్ఆర్ఎస్ గడువు పెంచిన ప్రభుత్వం