భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు
ఎన్నో పోరాటాలు, త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఫార్మా కాలుష్య కారక కంపెనీలు పెట్టి సీమాంధ్ర పాలకులు విధ్వంసం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఈ అంశం కూడా కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు రాష్ట్రంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేయడం అంటే సీమాంధ్ర పాలకుల విధానాలను అమలు చేయడమే. జీరో కాలుష్యం అంటూ.. విదేశాలకు మన బృందాలను పంపి స్టడీ చేయించామని చెబుతున్న పాలకులు ముందుగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కాలుష్యాన్ని నిర్మూలించాలి. తెలంగాణ వచ్చే ఆరేండ్లు గడిచిన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వెదజల్లుతున్న కాలుష్యాన్ని నివారించలేకపోయాం. అలాంటప్పుడు ఫార్మా సిటీలో కాలుష్యం ఉండదంటే నమ్మేదెట్లా? వ్యవసాయ పంటలకు అనువైన భూములను ముచ్చర్ల ఫార్మాసిటీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తోంది. దీంతో ఎన్నో ఏండ్లుగా ఈ భూములను నమ్ముకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న భూమి కోల్పోతే మరో దగ్గర కొనే పరిస్థితిలో రైతులు లేరు. ఫార్మా సిటీ రాకతో పరిసరాలు విషతుల్యం అవుతాయని ఆలస్యంగా గుర్తించిన ఆయా గ్రామాల ప్రజలు, రైతులు ఫార్మా సిటీ భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు.
19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ
రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం, కడ్తాల్ మండలాల్లో ముచ్చర్ల వద్ద 19,300 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటును 2014లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో 500కు పైగా ఇంటర్నేషనల్, నేషనల్ ఫార్మా కంపెనీలు పెట్టుబడులు పెడతాయని చెప్పింది. ఫార్మాసిటీకి కేటాయించిన భూముల్లో ప్రభుత్వ, ప్రైవేటు ల్యాండ్స్ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్, కందుకూరు, యాచారం మండలాల్లోని 12 గ్రామాల పరిధిలో వ్యవసాయ భూములను ప్రభుత్వం సేకరిస్తోంది. ప్రభుత్వ భూమినే తీసుకుంటామని, పట్టా భూములు తీసుకునే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొదట్లో రైతులు, ప్రజలకు చెప్పారు. ప్రస్తుతం పట్టా భూములను కూడా తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఫార్మా సిటీ భూసేకరణకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలోని కొంతమంది రైతులు ఒప్పుకున్నారు. కానీ, యాచారం మండలంలోని 4 గ్రామాల ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. దీంతో దళారులను రంగంలోకి దించి భూసేకరణకు రైతులు భూములు ఇచ్చేలా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
రోజూ వందల టన్నుల రా వేస్ట్
ఫార్మాసిటీ పూర్తయితే రోజూ 217 నుంచి 434 మిలియన్ లీటర్ల నీళ్లు వాడకం ద్వారా 314 మిలియన్ లీటర్ల కాలుష్య జలాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రతి రోజూ వందల టన్నుల రా వేస్ట్ వెలువడుతుంది. ఇది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం ఫార్మా కంపెనీలు రోజూ విడుదల చేస్తున్న వ్యర్థాలకు నాలుగింతలు. ఇప్పటికే ఉన్న పరిశ్రమల్లో ఉత్పత్తి చేసే మందులతోపాటు రసాయన ఘన వ్యర్థ జలాలు, విషవాయువులు వెలువడుతున్నాయి. కంపెనీలు ఎంత దూరంలో ఉన్నా వీటి ప్రభావం చాలా ప్రాంతాలపై పడుతోంది. ఈ వాసన పీల్చే వారికి మెదడు మొద్దుబారటం, తుమ్ములు రావడం, ముక్కు నుంచి నీరు రావడం, నిద్ర మత్తు ఆవహించడం, నరాల బలహీనతకు గురవడం, అసహనం, చికాకు కలగడం తదితర లక్షణాల బారినపడుతున్నారు. స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై పీసీబీ తనిఖీలు జరిపి గతంలో 13 కంపెనీలకు నోటీసులు జారీ చేశాయి. వాటిలో నాలుగు కంపెనీలపైనే చర్యలకు టాస్క్ఫోర్స్ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని రెండు పారిశ్రామికవాడలుఅత్యంత ప్రమాదకరమైనవిగా గతంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. ఐడీఏ బొల్లారంను అతి ప్రమాదకరమైనదిగా, కూకట్ ప ల్లిని సెమీ పొల్యూటెడ్ఏరియాగా గుర్తించింది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఘాటు వాసనలు, పొగలు ముంచెత్తుతున్నాయి.
భూసేకరణ చట్టానికి తూట్లు
2013 భూసేకరణ చట్టం ప్రకారం అసైన్డ్, ప్రైవేటు భూములకు ఎలాంటి తేడా లేకుండా నష్టపరిహారం చెల్లించాలి. ఈ పరిహారం ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మూడు రెట్లు అధికంగా ఉండాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టానికి వ్యతిరేకంగా ఫార్మాసిటీ కోసం భూసేకరణ చేస్తోంది. అసైన్డ్ భూమికి రూ.7,50,000, పట్టా భూములకు రూ.12 లక్షల చొప్పున ధర నిర్ణయించింది. కందుకూర్, కడ్తాల్, యాచారం భూముల ధరలు చాలా ఎక్కువ. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారమే భూమి విలువ ఎకరానికి 20 లక్షల నుంచి 40 లక్షల దాకా ఉంది. అయినా ప్రభుత్వం భూమి విలువ కంటే తక్కువగా నష్టపరిహారం చెల్లించి రైతులను మోసం చేస్తోంది. నష్టపరిహారం విషయంలో టీఆర్ఎస్ నాయకులు దళారులుగా మారి రైతులను మోసం చేస్తున్నారు.
గజ్వేల్ ప్రజలు.. ముచ్చర్ల ప్రజలు ఒక్కటి కాదా?
ఫార్మాసిటీ పూర్తయితే అక్కడున్న పరిశ్రమల వల్ల అనేక అనర్ధాలు జరుగుతాయి. 800కు పైగా పరిశ్రమలు ఒకే చోట ఏర్పాటైతే వెలువడే కాలుష్యాన్ని నియంత్రించడం సాధ్యం కాదు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించినా ఫార్మా రంగంలో వెలువడే కాలుష్యాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించడం కుదరనిపని. సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ ప్రాంతంలో ఓ ఫార్మా కంపెనీ నుంచి పొల్యూషన్ వస్తోందనే కారణంతో ఎనిమిది నెలల నుంచి మూసేయించారు. అంటే సీఎంకు గజ్వేల్ ప్రజలు.. ముచ్చర్ల ప్రజలు ఒక్కటి కారా? ఒకే దగ్గర వందలాది ఫార్మా పరిశ్రమలు వస్తే కాలుష్యం రాదా? మచ్చర్ల సమీపంలోని ప్రజలు ఫార్మా కాలుష్యంతో మరణించాలా? ఇదెక్కడి న్యాయం. ముచ్చర్ల పరిసర ప్రాంతాల ప్రజల జీవితాలు ఫార్మా కాలుష్యంతో నాశనం అవుతాయి కాబట్టి.. ఇప్పుడైనా ప్రభుత్వం వెనక్కి తగ్గాలి. ముచ్చర్ల ఫార్మా సిటీని వెంటనే రద్దు చేసి రైతుల భూములను కాపాడాలి. ప్రజల జీవితాలతో ఆడుకోవడం ఎప్పటికైనా పాలకులకు మంచిదికాదని గుర్తించాలి.
తినే తిండి, పీల్చే గాలి కలుషితమవుతయ్
ఫార్మా సిటీ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ శివారు ప్రాంతాలతోపాటు రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లోని చాలా ప్రాంతాలు కాలుష్యం బారిన పడతాయి. ఈ పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో తినే తిండి, పీల్చే గాలి కలుషితమవుతాయి. ఫలితంగా ప్రజలు కిడ్నీ సమస్యలు, చర్మవ్యాధులు, క్యాన్సర్ తోపాటు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తు్న్నారు. ఒకేసారి వందల ఫార్మా కంపెనీల నుంచి విడుదలయ్యే కాలుష్యాన్ని ఆపడం ఎవరితరం కాదంటున్నారు. ప్రభుత్వం చెబుతున్న జీరో పొల్యూషన్ సాధ్యం కాదనేది వీరి వాదన. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ఈ రంగంలో ఉత్పత్తులను నిషేధించడమే ఇందుకు ఉదాహరణ అని చెబుతున్నారు. ఫార్మాసిటీ వల్ల వ్యవసాయం కూడా దెబ్బతింటుంది. చుట్టుపక్కల దాదాపు 35 కి.మీ వరకు పంట దిగుబడి తగ్గుతుంది. చెరువులు, కుంటలు కాలుష్య కారకంగా మారతాయి. విష పదార్థాల నిల్వ, రవాణా వల్ల దీర్ఘ కాలంలో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఫార్మా కంపెనీల నుంచి వెలువడే లిక్విడ్ రా వేస్ట్ ఏ మేరకు డికంపోస్ట్ అయినా భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అవుతాయి.-మన్నారం నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లోక్సత్తా పార్టీ
ఫార్మా సిటీతో ప్రజలకు ముప్పు
- వెలుగు ఓపెన్ పేజ్
- January 18, 2021
లేటెస్ట్
- విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
- బుద్వేల్లో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన DCM
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- హైదరాబాద్ నడిబొడ్డున రూ.11 లక్షల నకిలీ సిగరెట్లు సీజ్
- బీర్ల ధరల పెంపు.. కొత్త బ్రాండ్ బీర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- తిండైన మానేస్తారు కానీ వాళ్ళు అది మాత్రం ఆపరు: రాశీ కన్నా
- షమీ వచ్చేశాడు.. ఇక వార్ వన్ సైడే: 14 నెలల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ
- గుండెపోటుతో తాటిచెట్టుపైన గీతకార్మికుడు మృతి
- IND vs ENG: ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- బుజ్జితల్లి వీడియో సాంగ్ రిలీజ్.. ఎమోషనల్ ట్రీట్ ఇచ్చారుగా..
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- Fateh Box Office: గేమ్ ఛేంజర్కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- IND vs ENG: ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- Daaku Maharaj: డాకు మహారాజ్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?
- కాంటినెంటల్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ