బొగ్గు బావులు, ఓపెన్​కాస్ట్​లతో ముప్పు

బొగ్గు బావులు, ఓపెన్​కాస్ట్​లతో ముప్పు

భారతదేశంలో  బొగ్గు  బావుల  తవ్వకం  ప్రారంభం అయినకాడ  భూమికి  పుండు అయినట్లే!  ఆ ప్రాంతంలో  భూమి  రైతు చేతికి వచ్చినా  పనికిరాదు.  మన దేశం 80 శాతం థర్మల్  విద్యుత్ మీదే ఆధారపడాల్సి వస్తున్నది. ఈ కారణంగా  బొగ్గు ఉత్పత్తిని  ఇప్పుడప్పుడే ఆపే పరిస్థితి లేదు.  భూమి ఉపరితలం  మందంను  గనుల తవ్వకం బలహీనపరచినదని  ఈ మధ్య కాలంలో జరిపిన ఒక అధ్యయనంలో తీసిన చిత్రాలతో  వెల్లడైనది! 

అడవులు, నీటి నిల్వలు,  వ్యవసాయ యోగ్యమైన భూములపై తవ్వి వేసిన బొగ్గు బావులకు సంబంధించిన భూమిని వాడి తిరిగి ముందున్న ఉత్పాదకశక్తిగా మార్చే ప్రక్రియ చాలా కష్టతరం. ఆ భూమిని తిరిగి సారవంతం చేసేందుకు  ఇప్పుడు ఉన్న మార్గదర్శకాలు,  నియమ,  నిబంధనలు  పరిపూర్ణంగా లేవు. ఎందుకంటే,  వీటిలో  న్యాయపరమైన చట్రంలో లోపాలు ఉన్నాయని నిపుణుల అభిప్రాయం. కొత్తగా జరిగిన అధ్యయనం ద్వారా బొగ్గు తవ్విన తరువాత తిరిగి అట్టి భూమిని  ఉపయోగం లోకి  తేవాలంటే  ఉన్న సవాళ్ళు  అనేకం.ప్రత్యేకంగా  ఇప్పుడు  భారతదేశం బొగ్గు ఉత్పత్తి  నుంచి  పక్కకు  జరగాలనే  భావనలో ఉన్నది.  మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్​ రాష్ట్రాల్లో  ఉన్న  బొగ్గు బావులు  ఇప్పటికే  భూమిపై ఉన్న  ప్రకృతి సిద్ధమైన భూపొరలను 35% వరకు భ్రష్టు పట్టించినవని అనేక పరిశోధనలలో బయటపడింది. 

2070 నాటికి జీరో అవుతుందా!

2040  వరకు బొగ్గు ఉత్పత్తి,  గనుల తవ్వకం జరగవచ్చు. ఎందుకంటే, అటు తరువాత  ఈ బొగ్గు తవ్వకం,  ఉత్పత్తిని  క్రమబద్ధీకరించవచ్చు.  తద్వారా 2070   సంవత్సరంలోగా  జీరో స్థాయి సాధించాలనే ఉద్దేశంతో ఉన్నారు.   కానీ, ఈ భూమిని పునరుద్ధరించటం, తిరిగి ఉపయోగకరించేలా చేయటం అసాధ్యం.  ఇంటర్నేషనల్  ఫోరమ్ ఫర్  ఎన్విరాన్​మెంట్​ సస్టైనబిలిటీ,   టెక్నాలజీ  సంస్థ పరిశోధన ఆలోచనాపరుల  అభిప్రాయం ఇది... 4.4 లక్షల హెక్టార్లలో  బొగ్గు బావులు ఉన్నవి. దేశంలో  ఇప్పటివరకు 4.4 లక్షల హెక్టార్ల భూమిని గనుల తవ్వకానికి,  థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి  వాడుతున్నారు.  

ఇందులో ఎక్కువ భాగం  ఈస్టర్న్ కోల్  లిమిటెడ్  బెల్ట్ లో వాడుతున్నారు.  గత  పదేండ్లలో  ప్రభుత్వరంగ బొగ్గు సంస్థలు తమ భూ పచ్చదనపు భాగంను 18,849 హెక్టార్లలో   మాత్రమే తిరిగి మొక్కలు పెంచగలిగారు.  బొగ్గు గనులకు వాడే భూమిలో  చాలా  స్వల్ప భాగం మాత్రమే. 2021లో పర్యావరణ, అడవులు మంత్రిత్వశాఖ.. అటవీశాఖ అనుమతులు పెండింగులో ఉన్నప్పటికీ,  తమ ఉత్పత్తి శక్తిని 40% నుంచి 50 శాతంకు పెంచుకో వచ్చునని కొందరికి అనుమతి ఇచ్చింది.  ఈ అంశం చాలా విపులంగా  రాసిన  సుబోధ్ కె. మైతి (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్)   ఏమన్నారంటే...మైనింగ్ పూర్తి చేసిన  మైన్స్ భూమిని తిరిగి పొందటం తప్పనిసరి.  కానీ,  ఆచరణకు  ఇంకా చాలా దూరం ప్రయాణించాలి.  ఇప్పుడు ఉన్న మార్గదర్శకాలు పూర్తిస్థాయిలో  లేవు.  ఎందుకంటే  ఈ భూముల్లో  పర్యావరణ పునరుద్ధరణ కలిగించాలంటే కావాల్సిన పరిస్థితులను కల్పించే పద్ధతులు న్యాయపరమైన చట్రంలోకి ఇమిడే విధంగా లేవని తెలిపారు.  

30 ఏండ్ల  పరిశోధన!

దాదాపు 30 సంవత్సరాలకు పైగా జరిగిన పరిశోధనలో..  మైనింగ్ వలన అక్కడి భూమి, కొండలు,  గుట్టలను ఎంతమేరకు  ప్రభావితం చేసినదీ  లెక్క కట్టారు. ఈ పరిశోధనలో తెలిసింది ఏమిటంటే  1994 నుంచి 2022  వరకు మైనింగ్ వలన   అడవులు 7.32 శాతం  నుంచి 17.61 శాతం మేరకు  క్షీణించాయి.  వాటర్ బాడీస్  -5  నుంచి 10శాతం,  పంటపొలాలు 3శాతం నుంచి 5శాతం నష్టపోయినవి. ఈ గణాంకాలు ఈ విధంగా ఉంటే.. ప్రభుత్వం  ప్రకటన మరోవిధంగా తెలియజేస్తున్నది. మైనింగ్ చేయటంలో, భూమిని  తిరిగి పొందటంలోను  బిషరాంపూర్ ప్రాంతం ఒక నిర్దిష్ట  ప్రమాణం ఏర్పాటు చేసిందని,  మూసివేయబడిన 1,472 హెక్టార్లలో  319 హెక్టార్ల  అటవీ భూమి, 906.82 హెక్టార్ల ఇతర భూమిని  గత పదేండ్లలో  తిరిగి పునరుద్ధరించినట్టు పేర్కొన్నది.  

కానీ, బిషరాంపూర్  అటవీ ప్రాంతం మొత్తం 3 ప్రాంతాల్లో  భారీగా తగ్గిపోయింది. ఈ పరిశోధనలు జరిపిన 3 ప్రాంతాల వివరాలను పరిశీలిస్తే 1994 నుంచి 2022 వరకు  బిషరాంపూర్  38% అటవీ భూమి కోల్పోయింది.   సోలా పూర్ 34% కోల్పోయింది. జామున అండ్ కొత్మ 22%  కోల్పోయింది. కొత్తగా  ప్లాంటేషన్ చేయబడిన భూమి  బిషరాంపూర్ లో  2.03% ,  సోలాపూర్  4.30% ,  జమున అండ్ కొత్మ  9.67% పెరిగింది.  కాగా,  తరుణ్ కె. ఠాకూర్  పరిశోధనలో ఇలా ఉన్నాయి.  ఎక్కడైతే  అటవీ, చెట్ల పెంపకం  చేపట్టారో  ఆ ప్రాంతంలో  నియమిత కాలం ప్రకారం నిజానిజాలను తెలుసుకోవడానికి నిర్ధారణ సర్వే జరిపించాలి. 

విధి విధానాలు అవసరం

కోల్ ఇండియా, దాని అనుబంధ సంస్థలు ఓపెన్ కాస్ట్ బావుల  భూములను తిరిగి ఉపయుక్తంగా మార్చటం కోసం సన్నాహాలు చేస్తున్నారు.  రిమోట్ సెన్సింగ్,  ఉపగ్రహ చిత్రాల ద్వారా,  గనుల్లోని శూన్య  ప్రదేశాలను నింపడం,  చెట్ల పెంపకం, నీటి వసతి,  అటవీ భూమి,  పంట పొలాలు మొదలైన వాటిని అంచనా వేయడంతో పాటు నిర్ధారణకు రావడం జరుగుతుంది.  గనులకు భూమి తీసుకుని, బొగ్గు తీయడం ముగిశాక  భూమిని తిరిగి సారవంతం చేయడానికి వాడే, నాటే మొక్కలు, వాటి  పర్యవేక్షణ మీద  నిర్దిష్టమైన విధి విధానాల అవసరం ఉన్నది. 

- ఎండి మునీర్, సీనియర్ జర్నలిస్ట్-