హైదరాబాద్లో.. అదీ రాయదుర్గంలో.. పట్టపగలు బొమ్మ తుపాకీతో బెదిరించి లక్షలు కాజేశారు..!

హైదరాబాద్లో.. అదీ రాయదుర్గంలో.. పట్టపగలు బొమ్మ తుపాకీతో బెదిరించి లక్షలు కాజేశారు..!

చేతిలో నిజమైన తుపాకీ ఉన్నా నలుగురు ఉన్న చోట ఇతరులను బెదిరించి దోపిడీకి పాల్పడాలంటే సంకోచించాల్సిందే. ఎక్కడ ఎదురు తిరుగుతారో అన్న భయం దొంగల్లోనూ కనిపిస్తుంటుంది. అటువంటిది ఇద్దరు దొంగలు బొమ్మ తుపాకితో బెదిరించి లక్షలు కాజేశారు. ఈ ఘటన హైదరాబాద్లో.. అదీ రాయదుర్గంలో పట్టపగలు జరగడం గమనార్హం.

ఈనెల 9వ తేదీన ఉదయం 6 గంటల సమయంలో రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని తేవర్ బార్ అండ్ కిచెన్ రెస్టారెంట్‌లో ఈ దోపిడీ జరిగింది. ఉదయాన్నే రెస్టారెంట్ లోపలకి ప్రవేశించిన ఇద్దరు దుండుగులు.. అక్కడున్న బార్ సెక్యూరిటీ సిబ్బంది తలకు బొమ్మ తుపాకీ గురిపెట్టి 4లక్షల యాభై వేల రూపాయల నగదు, యాపిల్ మ్యాక్ బుక్, ఐఫోన్‌తో ఉడాయించారు. 

ఈ ఘటనపై రెస్టారెంట్ యజమాని శ్యామ్ అనిరుద్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ దోపిడీ వెలుగులోకి వచ్చింది. విచారణ మొదలుపెట్టిన రాయదుర్గం పోలీసులు.. దోపిడీ జరిగిన తీరు, దొంగలు ప్రవేశించిన సమయాన్ని బట్టి ఇది ఇంటిదొంగల పనేనని తేల్చారు. గతంలో రెస్టారెంట్‌లో పనిచేసి మానేసిన వారి వివరాలు ఆరా తీశారు. ఇక్కడే పోలీసులకు ఓ క్లూ దొరికింది. అనుమానం వచ్చిన పోలీసులు.. గతంలో అదే రెస్టారెంట్‌లో క్యాషియర్ గా పనిచేసిన శుభమ్ కుమార్‌ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో అతను చేసిన తప్పును అంగీకరించాడు. 

యజమానిపై కక్ష్యతో..

యజమాని తనను విధుల నుంచి తొలగించారనే కక్ష్యతో శుభమ్ కుమార్.. స్నేహితుడు బిష్విజిత్ పాండాతో కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డాడు. ప్రస్తుతం శుభమ్ కుమార్ పోలీసుల అదుపులో ఉండగా.. అతని స్నేహితుడు బిష్విజిత్ పాండా పరారీలో ఉన్నాడు. పోలీసులు నిందితుడి నుంచి నగదు, ఐఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.