
- రెండు రికార్డింగ్స్‌తో పోలీసులకు మళ్లీ కంప్లైంట్ ఇచ్చిన నవ్య
- సరైన సాక్ష్యాధారాలు లేవన్న ధర్మసాగర్ సీఐ రమేశ్
హనుమకొండ, ధర్మసాగర్, వెలుగు: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు తన అనుచరులపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య ఆరోపించారు. బెదిరింపు కాల్స్ వస్తున్న రెండు నెంబర్లు, వాటికి సంబంధించిన ఆడియో రికార్డింగ్స్‌తో ఆదివారం ఆమె ధర్మసాగర్ సీఐ ఒంటేరు రమేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకు సంబంధించిన ఓ వ్యక్తి నుంచి వస్తున్న కాల్స్ భరించలేకపోతున్నానని, తనకు ప్రాణభయం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, సర్పంచ్ నవ్య రెండు సార్లు ఫిర్యాదు చేయగా.. అందులో ఎఫ్ఐఆర్ కంటెంట్ లేదని, అందుకే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ధర్మసాగర్ సీఐ రమేశ్ స్పష్టం చేశారు. పిటిషన్లో ప్రైమరీ సాక్ష్యాధారాలు లేకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేమని, నవ్య దంపతులు ఇచ్చిన పిటిషన్ లో కూడా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కాగా, కేసు నమోదు చేయకపోవడంపై నవ్య అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, తమ లాయర్ తో మాట్లాడి ఈ ఘటనపై పోరాడుతామని స్పష్టం చేశారు.