బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు సైబర్ నేరస్తులు కుచ్చుటోపీ పెట్టారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి ఆయన ఖాతాలోని రూ.11.8 కోట్లు కొల్లగొట్టారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తాను నవంబర్ 25–డిసెంబర్ 12 మధ్య పెద్ద మొత్తంలో డబ్బులు మోసపోయానని బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పోలీసులను ఆశ్రయించాడు. టెకీ ఫిర్యాదుప్రకారం.. తొలుత నవంబర్ 11న ట్రాయ్ ఆఫీసర్‌నంటూ ఓ వ్యక్తి కాల్ చేశాడు.
‘‘నీ ఆధార్ కార్డు తో తీసుకున్న సిమ్‌తో చట్టవ్యతిరేక అడ్వర్టైజ్మెంట్స్ఇచ్చారు. దీనిపై ముంబైలోని కొలాబ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది” అని బెదిరించాడు. ఆ తర్వాత మరో వ్యక్తి స్కైప్ కాల్ చేశాడు. ‘నీ ఆధార్‌కార్డు ఉపయోగించి ఓ ప్రముఖ బిజినెస్ మెన్బ్యాంకు ఖాతా తెరిచి, రూ.6 కోట్ల మనీ లాండరింగ్ చేశాడు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి, మాకు సహకరించకపోతే అరెస్ట్ చేస్తాం” అని దబాయించాడు.
నవంబర్ 25 న మరో వ్యక్తి పోలీస్‌డ్రెస్ వేసుకొని స్కైప్‌లో కాల్ చేశాడు. కేసు సుప్రీంకోర్టులో ఉందని, తాము చెప్పిన విధంగా నడుచుకోకుంటే కుటుంబం మొత్తాన్ని అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. ‘‘నీ అకౌంట్లో ఉన్నదంతా పంపించు. ఆపై వెరిఫై చేసి ఆ మొత్తాన్ని తిరిగి పంపుతాం” అని చెప్పారు. దీంతో భయపడిపోయిన బాధితుడు క్రమంగా సైబర్ మోసగాళ్లకు మొత్తం రూ.11.8 కోట్లు పంపించాడు.