డబ్బుపై వ్యామోహంతో ఫ్రాంచైజీ క్రికెట్ వైపు పరుగులు పెడుతున్న క్రికెటర్ల సంఖ్య ఇటీవల కాలంలో మరీ ఎక్కువ అవుతోంది. అడపాదడపా ఏదో ఒక ఫార్మాట్ లో దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ.. మిగిలిన కాలాన్ని ఫ్రాంచైజీ క్రికెట్ కు కేటాయిస్తున్నారు. అంతకూ కాదంటే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి ఫ్రాంచైజీ క్రికెట్ కు పూర్తి సమయం వెచ్చిస్తున్నారు. మూడు, నాలుగు దేశాల క్రికెటర్లు మినహా చాలా మంది ఇలాంటి విధానాన్నే అనుసరిస్తున్నారు. అలాంటి వారందరూ కళ్ళు తెరిచేలా ఆఫ్గన్ తాలిబన్ ప్రభుత్వ పెద్దలు కఠిన నిర్ణయం తీసుకున్నారు.
రెండేళ్లు నిషేధం
దేశం కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమన్న ముగ్గురు అఫ్గనిస్థాన్ క్రికెటర్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్(Mujeeb Ur Rahman), ఫజల్‌హక్ ఫారూఖీ(Fazalhaq Farooqi), నవీన్ ఉల్ హక్(Naveen Ul Haq)లపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆంక్షలు విధించింది. ఐపీఎల్‌తో పాటు ఇతర ఫ్రాంచైజీ లీగ్స్‌లో ఆడకుండా వీళ్లపై రెండేండ్ల పాటు నిషేధం విధించింది. అంతేకాదు, ఏడాది పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకూడదని నిర్ణయించింది. పైగా వీరు ఏ ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆడటానికి వీలు లేకుండా గతంలో ఏసీబీ ప్రత్యేక కమిటీ ఇచ్చిన ఎన్ఓసీని రద్దు చేసింది. దీంతో ఈ ముగ్గురు క్రికెటర్లు ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
? ANNOUNCEMENT ?
— Afghanistan Cricket Board (@ACBofficials) December 25, 2023
The ACB has decided to delay the annual central contracts and opt not to grant NOCs to three national players, @Mujeeb_R88, @fazalfarooqi10 and Naveen Ul Haq.
Full Details ?: https://t.co/FKECO8U7Ba pic.twitter.com/GMDaTzzNNP
తాలిబన్ నేతల కనుసన్నల్లోనే ఆఫ్ఘన్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఏ దేశ క్రికెటర్లయినా ఐపీఎల్‌తో పాటు విదేశీ లీగ్‌లలో ఆడటానికి ఆ దేశ బోర్డు నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది లేనియెడల సదరు లీగ్‌ల నిర్వాహకులు వారి ఆడటానికి అనుమతించరు.
సన్ రైజర్స్‌కు దెబ్బ
నవీన్ ఉల్ హక్‌ను లక్నో సూపర్ జెయింట్స్, ఫజల్‌హక్ ఫారుకీను సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటిపెట్టుకోగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ 2024 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఫజల్‌హక్ సన్ రైజర్స్ ప్రధాన బౌలర్. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ కట్టడి చేయగల సమర్థుడు. దీంతో హైదరాబద్ ఫ్రాంచైజీ ఏం చేయాలనే దానిపై సమాయత్తం అవుతోంది.