టోల్ ప్లాజా వద్ద మూడున్నర కిలోల బంగారం పట్టివేత

  •    విలువ సుమారు రూ.రెండున్నర కోట్లు 
  •     చెన్నై నుంచి బీదర్ కు కారులో తరలింపు 
  •     చౌటుప్పల్ పంతంగి  టోల్ ప్లాజా వద్ద స్వాధీనం చేసుకున్న అధికారులు 

చౌటుప్పల్, వెలుగు : రూ. రెండున్నర కోట్ల విలువైన మూడున్నర కిలోల బంగారాన్ని రవాణా చేస్తున్న ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద డైరెక్టరేట్ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు పట్టుకున్నారు. చెన్నై నుంచి బీదర్ కు కారులో అక్రమంగా విదేశీ బంగారాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద గురువారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు నిఘా పెట్టారు. టోల్ ప్లాజా వద్దకు వచ్చిన కారును ఆపి తనిఖీలు 

నిర్వహించారు. కారు హ్యాండ్ బ్రేక్ కింద ప్రత్యేకంగా ఒక ఖాళీ స్థలం ఏర్పాటు చేసి  అందులో 3.5 కిలోల (3,577 గ్రాముల)  ఐదు బంగారు కడ్డీలను పెట్టి మూసేశారు. దీన్ని అధికారులు గుర్తించి బయటకు తీశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని, బంగారం, కారు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2,51,46,310 ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు.