భద్రాచలం, వెలుగు : నిషేధిత మావోయిస్టు పార్టీకి పేలుడు పదార్ధాలను సప్లై చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను భద్రాచలం పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఏఎస్పీ పంకజ్ పరితోష్ వివరాల ప్రకారం... చర్ల మండలం నాయకుల కొత్తూరుకు చెందిన గుంజి విజయ్ మావోయిస్టులకు కొరియర్గా వ్యవహరిస్తున్నాడు. మహబూబ్బాద్ జిల్లా శేనిగాపురం గ్రామానికి చెందిన, పేలుడు పదార్థాలు అమ్మే బొంత నవీన్ నుంచి అదే జిల్లాలోని బడి తండాకు చెందిన భూక్యా నవీన్ మధ్యవర్తిత్వంలో విజయ్ జిలెటిన్ స్టిక్స్, వైర్లు ఇతర సామగ్రి కొనుగోలు చేశాడు.
వాటితో పాటు మావోయిస్టు సాహిత్యం, కరపత్రాలు తీసుకుని ఛత్తీస్ గఢ్ అడవుల ద్వారా చర్లకు వెళ్లేందుకు విజయ్, బొంత నవీన్, భూక్యా నవీన్ భద్రాచలం బస్టాండ్లో వేచి ఉన్నారు. పక్కా సమాచారంతో సీఐ నాగరాజురెడ్డి, టౌన్ ఎస్సై పీవీఎన్ రావు బస్టాండులోని ఏడో నంబరు ప్లాట్ ఫారంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా గుట్టురట్టు అయ్యింది. పేలుడు పదార్ధాల తరలింపు, ఉపా చట్టాల కింద ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని ప్రజలను ఆయన కోరారు.