
- ముగ్గురి అరెస్టు
- రూ.1.50 లక్షలు, ఒక ఫోన్, కారు స్వాధీనం
హాలియా, వెలుగు: బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్సెల్ఫోన్ టవర్లే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని నల్గొండ జిల్లా పెద్దవూర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం పెద్దవూర పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జునసాగర్ సీఐ బీసన్న వివరాలు వెల్లడించారు. తిరుమలగిరి సాగర్ మండలం జానారెడ్డి కాలనీకి చెందిన జటావత్ మహేశ్, నాగేశ్, వినోద్ పెద్దవూర మండలంలోని రెండు టవర్లు, తిరుమగిరి సాగర్, నరసరావుపేట పరిధిలో రెండు టవర్లలో 5 జీ సిగ్నల్స్ కోసం బిగించిన రేడియో రిమోట్, బేస్ బాండ్ యూనిట్లను ఎత్తుకెళ్లారు. వాటిని హైదరాబాద్ నాంపల్లి లో వారికి తెలిసిన వ్యక్తి మాలిక్‌కు విక్రయించారు. వచ్చిన డబ్బులను సమానంగా పంచుకున్నారు.
వరుసగా దొంగతనాలు జరుగుతుండటం పోలీసులకు సవాల్‌గా మారింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో ఆదివారం పోతునూర్ శివారు టోల్ గేట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో కారులో వెళ్తున్న మహేశ్, నాగేశ్, వినోద్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో చోరీలు చేసినట్లు వారు ఒప్పుకున్నారు. దీంతో, ఆ ముగ్గురి వద్ద నుంచి రూ. 1.50 లక్షలు, రిమోట్యూనిట్, ఒక ఫోన్, కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న డీఎస్పీ రాజశేఖర్ రాజు, నాగార్జున సాగర్ సర్కిల్ సీఐ బీసన్న, పెద్దవూర ఎస్ఐ వీరబాబు,హెడ్ కానిస్టేబుల్ ఇద్దయ్య, సిబ్బంది లోకేశ్ రెడ్డి, యాదయ్య, శ్రీకాంత్, కర్ణం వెంకట్ రామ్ రెడ్డి లను ఎస్పీ అభినందించారు.