
- తుపాకీ, 35 బుల్లెట్లు స్వాధీనం
గజ్వేల్, వెలుగు : తుపాకీతో బెదిరించి చోరీలకు యత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను సిద్దిపేట జిల్లా గౌరారం పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన ఎండీ.ఎథిజాజ్ సికింద్రాబాద్ బాలాజీ నగర్‌లో ఉంటూ ఆటో నడుపుతున్నాడు. ఇతడికి జవహర్‌నగర్‌కు చెందిన డిగ్రీ స్టూడెంట్ ఎండీ. హిదాయత్ అలీ అలియాస్ హిడ్డూ, బాలాజీనగర్‌కు చెందిన మద్దూర్‌లాల్ అలియాస్ నాని ఫ్రెండ్స్. ముగ్గురు కలిసి ఈజీగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో గోల్డ్ చైన్లు, బైక్‌లు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా హిదాయత్ అలీ, మద్దూర్ లాల్ ఇటీవల బీహార్‌లోని ముంగర్ పట్టణానికి వెళ్లి ఓ పిస్తోల్, 35 బుల్లెట్స్ కొనుగోలు చేశారు. ఎథిజాజ్, హిదాయత్ ఏప్రిల్ 2 నుంచి 5 వరకు సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో ఉండి చుట్టుపక్కల ప్రాంతాల్లో నేరాలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడ సీసీ కెమెరాలు ఉండడంతో వెనక్కి తగ్గారు. తర్వాత గ్రామాల్లో చోరీలు చేయాలని నిర్ణయించుకొని ఆదివారం వర్గల్‌కు వచ్చారు. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతూ.. గస్తీ కాస్తున్న పోలీసుల కంట పడ్డారు. ఈ క్రమంలో గౌరారం ఎస్సై కరుణాకర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి యువకులను విచారిస్తుండగా.. పెప్పర్ స్ర్పై చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు.
అలర్ట్ అయిన పోలీసులు ఇద్దరినీ పట్టుకొని వారి వద్ద ఉన్న బ్యాగ్‌లను తనిఖీ చేయగా.. ఒక ఒరిజినల్, మరో డమ్మీ తుపాకీ, 35 బుల్లెట్లు, పెప్పర్ స్ర్పే బాటిళ్లు, దాడికి ఉపయోగించే పంచ్‌లు, సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులు దొరికాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. వారు ఇచ్చిన సమాచారంతో మద్దూర్‌లాల్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురినీ గజ్వేల్ కోర్టులో హాజరుపరుచగా రిమాండ్ విధించారు. నిందితులను పట్టుకున్న గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి, గౌరారం ఎస్సై కరుణాకర్‌రెడ్డి, సిబ్బందిని సిద్దిపేట సీపీ అనురాధ అభినందించారు.