- ఫారెస్ట్ ఆఫీసర్లను కారుతో ఢీకొట్టి
- పరారైన మరో 9 మంది కోసం ప్రత్యేక టీమ్ తో గాలింపు
ఖానాపూర్, వెలుగు : అక్రమంగా టేకు కలప రవాణా చేస్తుండగా పట్టుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ ఆఫీసర్లను కారుతో ఢీకొట్టి పారిపోయిన స్మగ్లింగ్ ముఠాలోని ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కిరణ్‌కుమార్ తెలిపారు. మరో 9 మంది పరారీలో ఉన్నట్టు చెప్పారు. స్థానిక రేంజ్ ఆఫీస్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత నెల 19న ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ఇక్బాల్ పూర్, తర్లపాడ్ బీట్ లో కొందరు అక్రమంగా 10 టేకు చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారు.
నిందితులు తమ వాహనాలకు ఫేక్ నంబర్ ప్లేట్లు బిగించి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. నిందితులు జగిత్యాల జిల్లాలో ఉన్నట్లు సమాచారం అందడంతో మంగళవారం ఫారెస్ట్ ఆఫీసర్లు వెళ్లారు. అదే జిల్లాలోని సారంగాపూర్ మండలంలో నిందితులను అరెస్ట్ చేయడానికి వెళ్లిన సెక్షన్ ఆఫీసర్ రవీందర్, బీట్ అధికారి కుతుబుద్దీన్ ను ముగ్గురు స్మగ్లర్లు కారుతో ఢీకొట్టి పారిపోయారు. దోనూరు వద్ద స్మగ్లింగ్ ముఠాలోని కడెం మండలం దోస్త్ నగర్ కు చెందిన జి.నగేశ్, కొత్తమద్ది పడగకు చెందిన డి.శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఎం.రాజ్ గోపాల్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మిగతా వారికోసం ప్రత్యేక టీమ్‌తో గాలిస్తున్నట్లు చెప్పారు. ఖానాపూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రవీందర్, బీట్ ఆఫీసర్లు నరేందర్, మోహిద్, ముత్యం, రాంచందర్, కుతుబుద్దీన్ ఉన్నారు.