‘మావోయిస్టుల లేఖ’ కేసులో ముగ్గురు అరెస్ట్​..పరారీలో మరో నిందితుడు

  • మహబూబ్​నగర్​ ఎస్పీ డి.జానకి వెల్లడి

మహబూబ్​నగర్​, వెలుగు : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి ఇంటికి ‘మావోయిస్టుల లేఖ’ పేరిట పోస్టర్ ను అంటించిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు మహబూబ్​నగర్​ఎస్పీ డి.జానకి తెలిపారు.  మీడియా సమావేశంలో బుధవారం ఆమె వివరాలను వెల్లడించారు. వారం కిందట జిల్లాలోని రాజాపూర్​ మండలం రంగారెడ్డిగూడలోని జడ్చర్ల ఎమ్మెల్యే ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు మావోయిస్టుల పేరిట లేఖను అంటించారు. దీనిపై అదే గ్రామానికి చెందిన రవి కుమార్​  ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్ మంగళవారం కేసును ఛేదించారు. రంగారెడ్డిగూడకు చెందిన షేక్ రఫీక్, కుమ్మరి భగవంతు, మహమ్మద్ షా అలీ, షేక్ తౌఫిక్ నలుగురిపై కేసు నమోదు చేశారు. షేక్​ తౌఫిక్​ పరారీలో ఉండగా.. మిగతా ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. నిందితుల నుంచి 29 డూప్లికే టుటుటుట్  ​లెటర్ ప్యాడ్​లను, మూడు సెల్ ఫోన్లు, బైక్ ను స్వాధీనం చేసుకొని సీజ్​చేశారు. కేసును ఛేదించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నాగార్జున గౌడ్​, రాజాపూర్​ఎస్ఐ రవి, సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డు అందజేశారు.