37 పనులు రూ.2.17 కోట్లు .. మెదక్ జిల్లాలో తీరనున్న అంతర్గత రోడ్ల సమస్య

  • మెదక్, నర్సాపూర్, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లకు ఉపాధి హామీ నిధులు
  • గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి కేటాయింపు 

మెదక్​, వెలుగు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద మెదక్​ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు రూ.2.17 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దుబ్బాక, మెదక్, నర్సాపూర్​ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని 36 గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.2.09 కోట్లు, ఓ గ్రామంలో అంగన్​వాడీ బిల్డింగ్​నిర్మాణానికి రూ.8 లక్షలు మంజూరయ్యాయి. 

మండలాల వారీగా చూస్తే చేగుంట మండలానికి అత్యధికంగా 13 సీసీ రోడ్లకు రూ.80 లక్షలు, నార్సింగి మండలంలో 5 సీసీ రోడ్లకు రూ.33 లక్షలు, పాపన్నపేట మండలంలో 9 సీసీ రోడ్లకు రూ.45 లక్షలు,  హవేలీ ఘనపూర్​ మండలంలో 2 సీసీ రోడ్లకు రూ.10 లక్షలు, శివ్వంపేట మండలంలో రెండు సీసీ రోడ్లు, ఓ అంగన్​వాడీ బిల్డింగ్​కు రూ.21 లక్షలు, రామాయంపేట, చిన్నశంకరంపేట, నర్సాపూర్, చిలప్​ చెడ్, కౌడిపల్లి మండలాల్లో ఒక్కో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున మంజూరయ్యాయి. 

నిధులు మంజూరైన గ్రామాలివే

చేగుంట మండలం గొల్లపల్లి, జైత్రాం తండా, మక్కరాజ్​పేట, కరీంనగర్, కర్నాల్​పల్లి, చందాయిపేట, కసన్​పల్లి, ఉల్లి తిమ్మాయిపల్లి, ఇబ్రహీంపూర్, చిట్టోజిపల్లి, పోలంపల్లి, పోతన్​శెట్టిపల్లి, రాంపూర్​, నార్సింగి మండలంలో నార్సింగి, వల్లూర్, నర్సంపల్లి, పెద్దతండా, భీంరావ్​పల్లి, చిన్నశంకరంపేట మండలం టి.మాందాపూర్​ తండా, రామాయంపేట మండలం దామరచెరువు తండా, పాపన్నపేట మండలం ముద్దాపూర్, అర్కెల దమ్మాయిపల్లి, సీతానగర్, అన్నారం, మల్లంపేట, పాత లింగాయిపల్లి, నామాపూర్, గాజులగూడెం, హవేలీ ఘనపూర్​ మండలం వాడి, మగ్దుంపూర్​, కౌడిపల్లి మండలం వెల్మకన్న, శివ్వంపేట మండలం పిల్లుట్ల, చండి, నర్సాపూర్​ మండలం లింగాపూర్​, చిలప్​చెడ్​ మండలం చిలప్​చెడ్​లో సీసీ రోడ్ల నిర్మాణానికి, శివ్వంపేట మండలం పిల్లుట్లలో అంగన్​ వాడీ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. 

తీరనున్న ఇబ్బందులు

సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో ఆయా గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు తీరనున్నాయి. కొద్దిపాటి వర్షం పడితే అంతర్గత రోడ్లు బురదమయంగా మారి రాకపోలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిధులు మంజూరు కావడంతో మట్టి రోడ్లు సిమెంట్​రోడ్లుగా అభివృద్ధి కానున్నాయి.