కరీంనగర్ జిల్లాలో హోలీ పండుగ రోజున విషాదం నెలకొంది. సదాశివపల్లి వద్ద తీగత వంతెన సమీపంలో మానేరు వాగులో సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీశారు. మృతులు ముగ్గురు హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులు వీరాంజనేయులు (12), అనిల్ (13), సంతోష్(14) గా గుర్తించారు. మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బంధువుల ఆందోళన
అయితే తమ పిల్లల చావుకు రివర్ ఫ్రంట్ కాంట్రాక్టరే కారణమంటూ మృతుల బంధువులు ఆరోపించారు. సంఘటన స్థలానికి వచ్చిన ఏసీపీ కరుణాకర్ వాహనాన్ని అడ్డుకుని దాదాపు రెండు గంటలు ఆందోళన చేపట్టారు . తమ పిల్లల చావుకు కారణమైన కాంట్రాక్టరుపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి గంగులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని పోలీసులు చెప్పడంతో ఆందోళన విరమించారు.
కేసీఆర్ దిగ్భ్రాంతి.. రూ. 5 లక్షల పరిహారం
ముగ్గురు చిన్నారుల మృతిపట్ల సీఎం కేసీఆర్, మంత్రి గంగుల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం తరపున రూ. 3 లక్షలు, మంత్రి గంగుల తరపున రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.