బిజినెస్ లో నష్టాలు.. ఈజీ మనీకి చోరీ ప్లాన్

బిజినెస్ లో నష్టాలు.. ఈజీ మనీకి చోరీ ప్లాన్
  •     తుర్కయాంజల్ లో వ్యాపారి ఇంట్లో దోపిడీకి యత్నం 
  •     పలువురు నిందితుల అరెస్ట్ 
  •      మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి

ఎల్ బీనగర్, వెలుగు : రియల్ ఎస్టేట్, ఇసుక బిజినెస్ లో నష్టపోయి ఈజీగా మనీ సంపాదించేందుకు ముగ్గురు వ్యాపారులు భారీ చోరీకి ప్లాన్ చేసి దొరికిపోయారు. నిందితులను ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. బ్రాహ్మణపల్లికి చెందిన బోగిని జంగయ్య, శేఖర్ రెడ్డి, మహమూద్ ఫ్రెండ్స్. వీరు రియల్ ఎస్టేట్, ఇసుక బిజినెస్ చేస్తుండగా.. తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఈజీగా మనీ సంపాదించేందుకు ప్లాన్ చేశారు. జంగయ్యకు తుర్కయాంజల్ లో ఉండే చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లో సుమారు రూ. 950 కోట్ల డబ్బు ఉందని, పాత వాచ్ మెన్ ద్వారా తెలిసింది.

దీంతో అతడు శేఖర్ రెడ్డి, మహమూద్ కు  చెప్పాడు.  వీరు ముందుగా కూకట్ పల్లి నుంచి ఒక పూజారిని తీసుకొచ్చి డబ్బు గురించి తెలుసుకునేందుకు పూజలు చేయించాలని స్కెచ్ వేశారు. కానీ పూజారి వస్తా అని చెప్పి రాలేదు. దీనిపై తమకు తెలిసిన పెద్ది శ్రీనివాస్ కు చెప్పగా అతను పాల్గొంటానని చెప్పడమే కాకుండా.. విజయవాడకు చెందిన రజాక్ నంబర్ ఇచ్చాడు. అతనికి చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లో నల్ల డబ్బు గురించి చెప్పారు.  రజాక్ తనకు తెలిసిన వారి ద్వారా గతంలో పనిచేసిన ఆ ఇంటి మేనేజర్ నంబర్ తీసుకొని అడగగా డబ్బు ఉన్నమాట వాస్తవమేనని చెప్పాడు.

దీంతో తమకు తెలిసిన సతీష్ కు ఫోన్ చేసి దోపిడీపై వివరంగా చెప్పారు. అతను మహమూద్ కు, రజాక్ కు కామన్ ఫ్రెండ్ అయిన జాకీ లఖానికి, సవూద్ లకు చెప్పాడు. జాకీ లఖాని తన బావమరిది ఆదిల్ తో పాటు ముదాసీర్, ఖాదర్, అక్బర్, షమీం, జాఫర్, ఇస్మాయిల్ కు చెప్పారు. వీరంతా కలిసి దోపిడీ చేసేందుకు ఇనుప రాడ్ లు, కత్తులు కొనుగోలు చేసి రెండు కార్లలో, ఒక స్కూటి మీద తేదీ ఈనెల 5న  తుర్కయంజాల్ లోని చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంటికి వెళ్లారు. వాచ్ మెన్ ఉండడంతో వెనక్కి వచ్చారు. మరోసారి ప్లాన్ చేసుకుని.. ఈసారి వాచ్ మెన్ అడొస్తే  కొట్టి దోపిడీ చేయాలని నిర్ణయించుకుని ఈనెల 11న మళ్లీ వెళ్లారు.  

ముందుగా గోడ దూకి నలుగురు చొప్పున  ఇంట్లోకి  వెళ్లి సీసీ టీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. వీరిని చూసి అడ్డుకోబోయిన ఇద్దరు వాచ్ మెన్లను కొట్టి తాళ్లతో బంధించారు.  అరిస్తే చంపుతామని మెడపై కత్తి పెట్టి బెదిరించారు. ముగ్గురు వ్యక్తులు గ్రౌండ్ ఫ్లోర్ లోని మెయిన్ డోర్ తీసుకొని వెళ్లి లోపలి డోర్ ను పగులగొట్టటానికి ప్రయత్నించారు.  చప్పుడు విని ఇంట్లోని వారు లేచి సీసీ టీవీలో రికార్డైన వీడియోలను చూశారు. ఇంట్లోకి దొంగలు వచ్చారనుకుని వెంటనే 100 కాల్ చేశారు.  పోలీసులు సైరన్ వేసుకుంటూ వెళ్లగా దొంగలు పారిపోయారు.

ఓనర్ తురుమన తురై ఫిర్యాదుతో ఆదిబట్ల ఇన్ స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద 3 కార్లు, 1 స్కూటీ, 16 మొబైల్స్, 2 ఐరన్ కట్టర్లు, 80 వేల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం ఏసీసీ రాజు, సీఐ రాఘవేందర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.