పాపం పసివాళ్లు... అనాథలైన ముగ్గురు చిన్నారులు

  • పదకొండేండ్ల కింద చనిపోయిన తల్లి
  • ఏడాది కింద మరో పెండ్లి చేసుకున్న తండ్రి
  • రెండు నెలల వ్యవధిలోనే అనారోగ్యంతో భార్యాభర్తలు మృతి

కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : అనారోగ్యంతో పదకొండేళ్ల కింద తల్లి చనిపోగా ఇద్దరు చిన్నారుల ఆలనాపాలన తండ్రే చూసుకున్నాడు. పిల్లల బాగోగుల కోసం ఏడాది కింద మరో మహిళను పెండ్లి చేసుకున్నాడు. ఆమె కూడా రెండు నెలల కింద ఓ మగ పిల్లాడు పుట్టిన ఐదు రోజులకే కన్నుమూసింది. మిగిలిన తండ్రి కూడా రెండు రోజుల కింద అనారోగ్యంతోనే చనిపోయాడు. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. నానమ్మ, తాత వద్ద ఉంటూ కాలం వెల్లదీస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే... కొమురంభీమ్‌‌‌‌ ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లా కౌటాల మండలం పార్డి గ్రామానికి చెందిన మడావి దివాకర్‌‌‌‌ (36)కు 2010లో దహేగాం మండలానికి చెందిన భారతితో వివాహమైంది. వీరికి అజిత్‌‌‌‌కుమార్‌‌‌‌, విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ కొడుకులు పుట్టారు. అజిత్‌‌‌‌ వయసు ఏడాదిన్నర, విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ వయసు 10 నెలలు ఉన్నప్పుడు 2013లో భారతి అనారోగ్యంతో చనిపోయింది. దీంతో దివాకర్‌‌‌‌ తన తల్లిదండ్రుల సహకారంతో ఇద్దరు కొడుకులను చూసుకున్నాడు. పిల్లల బాగోగుల కోసం ఏడాది కిందట మహారాష్ట్రలోని వీరూర్‌‌‌‌కి చెందిన శారదను పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు ఈ ఏడాది మార్చిలో మగశిశువు పుట్టాడు. శిశువు పుట్టిన అయిదు రోజులకే శారద అనారోగ్యంతో హాస్పిటల్‌‌‌‌లో చేరి మార్చి 15న చనిపోయింది. ఈ బాధ నుంచి బయటపడేలోగానే దివాకర్‌‌‌‌ అనారోగ్యానికి గురయ్యాడు.

హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ పొందుతూ రెండు రోజుల కింద కన్నుమూశాడు. దీంతో 12 ఏండ్ల అజిత్‌‌‌‌, 11 ఏండ్ల విజయ్‌‌‌‌, రెండు నెలల శివకుమార్‌‌‌‌ అనాథలయ్యారు. ప్రస్తుతం వీరు వృద్ధులైన నానమ్మ, తాత వద్ద ఉంటున్నారు. వీరికి ఉన్న మూడు ఎకరాల్లో హాస్పిటల్‌‌‌‌ ఖర్చులకు సగం భూమి అమ్ముకోవాల్సి వచ్చింది. తాము బాగున్నంత వరకు పిల్లల ఆలనాపాలన చూస్తామని, తాము మంచాన పడితే పిల్లల పరిస్థితి ఏమిటని వృద్ధులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అనాథలైన పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని, దాతలు స్పందించి సాయం చేయాలని కోరుతున్నారు.