
హైదరాబాద్, వెలుగు: పొరుగు రాష్ట్రాలతో ఫ్రెండ్లీగా ఉంటూ అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడాలన్నదే తెలంగాణ ఆకాంక్ష అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామన్నారు. అభివృద్ధి విషయంలో తమ విధానాలు పారదర్శకంగా, సుస్థిరంగా ఉంటాయని, పారిశ్రామికవేత్తలు పూర్తి నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. దావోస్ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో కలిసి “కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్” రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉమ్మడి ఏపీ సీఎంలుగా పని చేసిన చంద్రబాబు, వైఎస్సార్ రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన తీరు అసాధారణం.
హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడుతోంది. న్యూయార్క్, టోక్యోలాంటి నగరాల స్థాయికి దీనిని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని చెప్పారు. ‘‘రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తాం. ఓఆర్ఆర్ లోపల కోర్ అర్బన్ ప్రాంతంలో ఐటీ, ఫార్మా రంగాలున్నాయి. రెండో భాగం ఓఆర్ఆర్ నుంచి 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే 65 శాతం తెలంగాణ నగర ప్రాంతంగా మారుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీ, ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు, మాంసం, కోళ్లు, చేపల ఎగుమతితో పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహిస్తాం” అని సీఎం రేవంత్ వివరించారు.