
న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా మూడు కోచ్‌లతో నడిచే మెట్రో రైళ్లు పట్టాలెక్కించేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్ సీ) అధికారులు సిద్ధమయ్యారు. ఢిల్లీలో స్వల్ప దూరం ప్రయాణించే వారికి సేవలందించడమే లక్ష్యంగా ఈ తరహా రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. అందుకు సంబంధించి ప్రత్యేక మెట్రో కారిడార్ నిర్మాణ పనులు కొనసాగుతున్నట్టు వారు వెల్లడించారు. లజపత్ నగర్– సాకేత్ జీ బ్లాక్ రూట్‌లో ఈ రైళ్లను నడపనున్నారు.
ఢిల్లీ మెట్రో నాలుగో దశలో భాగంగా ఎనిమిది కి.మీల మేర ఈ ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు. కనెక్టివిటీని పెంచడం, ప్రస్తుతం ఉన్న కారిడార్లతో సులువుగా ఇంటర్ ఛేంజ్ కోసం ఈ లైన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు డీఎంఆర్ సీ అధికారులు తెలిపారు. స్వల్ప దూర ప్రయాణించే వారి కోసం ఈ కారిడార్‌లో మూడు కోచ్‌ల రైళ్లు నడపుతామని చెప్పారు.
ప్రయాణికుల రద్దీ అంచనాల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఒక్కో కోచ్‌లో దాదాపు 300 మంది ప్రయాణించవచ్చని, తద్వారా ఒక ట్రిప్‌లో 900 మంది గమ్యస్థానాలకు చేరుకోవచ్చన్నారు. కారిడార్‌లో ఎనిమిది స్టేషన్లు ఉంటాయని వివరించారు.