హైదరాబాద్‌లో వేర్వేరు చోట్ల ముగ్గురు ఆత్మహత్య

హైదరాబాద్‌లో వేర్వేరు చోట్ల ముగ్గురు ఆత్మహత్య

ఇబ్రహీంపట్నం/జవహర్ నగర్, వెలుగు: నిద్రలేమి, కడుపునొప్పి, భర్త వేధింపులు తట్టుకోలేక సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు సూసైడ్​చేసుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా కీసర మండలం తిమ్మాయిపల్లికి చెందిన రజినీకాంత్​రెడ్డి(37)కు భార్య సంధ్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. స్థానికంగా వ్యవసాయ పనులకు వెళ్లే రజినీకాంత్ కొంతకాలంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు రెండేండ్ల కింద డాక్టర్​ద్వారా కౌన్సిలింగ్​ఇప్పించారు. అప్పటి నుంచి రజినీకాంత్​మందులు వాడుతున్నాడు. నిద్ర మాత్రలు లేకపోవడంతో నాలుగు రోజుల నుంచి సరిగ్గా నిద్రపోవడం లేదు. 

మంగళవారం బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందిచకపోవడంతో అతని భార్య సంధ్య కీసర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్​కేసు ఫైల్​చేసిన పోలీసులు లోకేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం గుట్టల్లో శవమై కనిపించాడు. డెడ్​బాడీ పక్కన పురుగుల మందు డబ్బా ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి  తరలించారు. నిద్రలేని సమస్యతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని సంధ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

బావిలో దూకి వృద్ధుడు.. 

రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రానికి చెందిన నర్ల అంజయ్య(75) కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలు, కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. బుధవారం ఉదయం నిద్రలేచేసరికి ఇంటి వద్ద అంజయ్య కనిపించకపోవడంతో అతని కొడుకు లింగ స్వామి ఊరంతా వెతకసాగాడు. అంతలోకి ఓ గ్రామస్తుడు ఫోన్​చేసి అంజయ్య బావిలో పడ్డాడని చెప్పాడు. అక్కడికి వెళ్లి చూడగా శవమై తేలుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వృద్ధుడి మృతదేహాన్ని బయటకి తీయించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ మధు తెలిపారు. 

ఏడాది కింద ప్రేమ పెండ్లి.. అంతలోనే.. 

మేడ్చల్​జిల్లా జవహర్​నగర్​పరిధిలోని బాలాజీనగర్ ముత్తుస్వామి కాలనీకి చెందిన రమ్య(23), దాసరి మహేశ్(22) ఫ్రెండ్స్. కొన్నేండ్లుగా ప్రేమించుకుని గతేడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. రమ్య గ్రాడ్యుయేషన్​పూర్తిచేసి ఇంటి వద్దే ఉంటోంది. పెండ్లి చేసుకున్నప్పటి మహేశ్​ఖాళీగానే ఉంటున్నాడు. జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. డబ్బు కావాలని తరచూ భార్య రమ్యను వేధిస్తున్నాడు. రెండు రోజుల కింద ఫుల్లుగా తాగొచ్చి రమ్యను కొట్టాడు. 

బాధతో ఆమె పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రులు సర్దిచెప్పి తిరిగి అత్తగారింటికి పంపించారు. మంగళవారం మరోసారి భార్యతో గొడవపడిన మహేశ్ తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమ్య మంగళవారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్​కు ఉరివేసుకుంది. అర్ధరాత్రి తర్వాత ఇంటికి వచ్చిన మహేశ్​తలుపు కొట్టగా తీయలేదు. స్థానికుల సాయంతో తలుపు పగలకొట్టగా రమ్య ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించింది. కిందికి దింపి108ను పిలిపించగా, అప్పటికే రమ్య చనిపోయినట్లు అంబులెన్స్​సిబ్బంది తెలిపారు. మహేశ్​మానసికంగా, శారీరకంగా వేధించడంతోనే తమ బిడ్డ చనిపోయిందని రమ్య తల్లి ఐలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బుధవారం మహేశ్​ను అరెస్ట్​చేసి రిమాండుకు తరలించారు.