విభజన సమస్యలపై మూడు కమిటీలు

విభజన సమస్యలపై మూడు కమిటీలు
  • ఆఫీసర్ల కమిటీలో రెండు రాష్ట్రాల సీఎస్​లు
  • రెండు వారాల్లోగా ఆఫీసర్ల కమిటీ సమావేశం 
  • పరిష్కారం కాని సమస్యలు మంత్రుల కమిటీ దృష్టికి 
  • అక్కడా కొలిక్కి రాని అంశాలు సీఎంల ముందుకు 
  • డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు జాయింట్​ ఆపరేషన్
  • ప్రజాభవన్​లో చర్చించిన సీఎంలు రేవంత్​, చంద్రబాబు
  • వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, 
  • ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్
  • ఇరు రాష్ట్రాల ఆఫీసర్లు, మంత్రులు, సీఎంల స్థాయిలో విడివిడిగా ఏర్పాటు
  • తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీలో నిర్ణయం

హైదరాబాద్​,  వెలుగు: పదేండ్లుగా పెండింగ్​లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులు, మంత్రులు, సీఎంల స్థాయిలో వేర్వేరుగా మూడు కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆఫీసర్ల కమిటీలో రెండు రాష్ట్రాల సీఎస్​లతోపాటు ముగ్గురు చొప్పున తెలంగాణ, ఏపీకి చెందిన ఉన్నతాధికారులు ఉంటారు. ఈ కమిటీ రెండు వారాల్లోగా సమావేశమై.. విభజనకు సంబంధించిన అంశాలకు వారి స్థాయిలో పరిష్కార మార్గాలను ప్రతిపాదిస్తుంది. 

అక్కడ పరిష్కారం కాని సమస్యలను రెండు రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటైన కమిటీ చర్చించి పరిష్కారానికి కృషి చేస్తుంది.  మంత్రుల స్థాయిలోనూ ఏకాభిప్రాయం కుదరని అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించి.. పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు. విభజన సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాభవన్​లో శనివారం సాయంత్రం భేటీ అయ్యారు.  ఇందులో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెండు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు జూబ్లీహిల్స్‌‌ నుంచి ప్రజాభవన్‌‌కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రులు బొకే అందజేసి స్వాగతం పలికారు.

అనంతరం ప్రజాభవన్​లో చంద్రబాబును శాలువతో రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి సత్కరించి.. కాళోజీ నారాయణరావు రాసిన ‘నా గొడవ’ పుస్తకాన్ని బహూకరించారు. విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా రెండు రాష్ట్రాల సీఎంల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆ వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్​ మీడియాకు వెల్లడించారు. 

సామరస్య పరిష్కారం కోసమే: భట్టి 

రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రులు రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, చంద్రబాబునాయుడు సమావేశంలో నిర్ణయించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఉమ్మడి ఏపీ విభజన ద్వారా గత 10 ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలను త్వరగా చర్చించుకుని ముందుకు పోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. విభజన చట్టంలోని సమస్యలన్నిటికీ మొదటి సమావేశంలోనే పరిష్కారం దొరుకుతుందని భావించడం లేదని, అందులో భాగంగానే కమిటీలు ఏర్పాటు చేసుకున్నట్లు వివరించారు. 

సమస్యల పరిష్కారానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని   రెండు రాష్ట్రాల ప్రతినిధులంతా చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి మూడు దశల్లో కమిటీలు ఏర్పాటు చేయాలనుకున్నామని.. ఇందులో ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, మరో ముగ్గురు చొప్పున ఉన్నతాధికారులతో ఒక కమిటీ, ఇరు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇంకో కమిటీ ఫామ్​ అయ్యి  పరిష్కార మార్గాలు కనుగొనాలని ప్రాథమికంగా నిర్ణయించామని భట్టి విక్రమార్క ప్రకటించారు. 

వీటితోపాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలపై కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. యాంటీ నార్కోటిక్ అంశంపై తెలంగాణ  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అడిషనల్ డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నదని,  సైబర్ క్రైమ్ సంబంధించి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని,  ఈ రెండు అంశాల్లో రెండు రాష్ట్రాలు సమన్వయంతో పని చేయాలని, వీటిని నియంత్రించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. డ్రగ్స్​, సైబ్​ క్రైమ్​ మహమ్మరుల నుంచి రెండు రాష్ట్రాల ప్రజలను కాపాడుకునేందుకు అడిషనల్ డీజీ స్థాయిలో రెండు రాష్ట్రాల్లో కమిటీ ఏర్పాటు చేసుకొని సమన్వయంతో పని చేయాలని భావిస్తున్నామని..   తద్వారా డ్రగ్స్​, గంజాయి, సైబర్​ క్రైమ్స్​ను అరికట్టేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 

డ్రగ్స్​ ఫ్రీగా రెండు రాష్ట్రాలు మారాలి: సత్యప్రసాద్​

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంను కలిసి విభజన సమస్యలపై చర్చించడం.. తెలుగు జాతి అంత హర్షించే మంచి రోజు అని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్​ అన్నారు. ప్రోగ్రెసివ్​ వేలో తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకువెళ్లేలా సీఎం రేవంత్​రెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. తమ సీఎం చంద్రబాబు నాయుడు విభజన సమస్యల పరిష్కారానికి కలుద్దామని చెప్పిన వెంటనే సీఎం రేవంత్​రెడ్డి సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు. నిధులు, నియా మకాలు, నీళ్లు అంశంతో తెలంగాణ ఉద్యమం నడిచి రాష్ట్రం ఏర్పాటు అయిందని..  అలాగే ఏపీ అభివృద్ధి, సెంటిమెంట్​ను పరిగణనలోకి తీసుకుని ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సమస్యలు పరిష్కారం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

సానుకూలంగా, సత్వరం పరిష్కరించుకునేందుకు కమిటీలు ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. కేవలం విభజన సమస్యలకే కాకుండా.. ఇతర అన్ని డెవలప్​మెంట్​ అంశాలలో ప్రీక్వెంట్​గా కలవాలని సీఎంలు అనుకోవడం మంచి విషయమన్నారు. డ్రగ్స్​ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ మాత్రమే కాకుండా.. ఏపీని కూడా డ్రగ్స్​ విముక్తి చేసే కార్యాచరణను రూపొందించుకున్నామని వెల్లడించారు. ఏపీలో 8వ తరగతి విద్యార్థుల బ్యాగుల్లో డ్రగ్స్​ దొరికాయని, డ్రగ్స్​ మహమ్మారిని అరికట్టేందుకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని ఆయన అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్​ బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ మంత్రులు కందుల దుర్గేష్‌‌‌‌‌‌‌‌, బీసీ జనార్ధన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఇరు రాష్ట్రాల సీఎస్‌‌‌‌‌‌‌‌లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.