- ఆదివారం కలిసివస్తదని శనివారం లీవ్
- సిద్దిపేట కలెక్టరేట్‌లో సగం సిబ్బంది గైర్హాజరు
- కామారెడ్డి డీఈవో ఆఫీస్‌లో ఖాళీ కుర్చీలు
- ఖమ్మం జిల్లా పెనుబల్లిఎంఈవో ఆఫీసుకు తాళం
- ‘వెలుగు’ పరిశీలనలో వెల్లడి
వెలుగు: ఈ నెల 25న క్రిస్మస్, 26న బాక్సింగ్‌డే. ఈ రెండు రోజులూ ప్రభుత్వ సెలవులే. మాజీ ప్రధాని మన్మోహన్ మృతితో ఆయన గౌరవార్ధం 27న కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో మూడోరోజు శుక్రవారం కూడా ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోలేదు. వరుస సెలవుల తర్వాత బద్దకమో, మధ్యలో శనివారం ఒక్క రోజు లీవ్ పెడ్తే ఆదివారం కూడా ఇంట్లో ఉండి, సోమవారం రావచ్చునన్న ఆలోచనోగానీ రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది ఉద్యోగులు శనివారం డ్యూటీలకు డుమ్మా కొట్టారు.
ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్‌నగర్ లాంటి జిల్లాలకు రాకపోకలు సాగించే ఉద్యోగులు ఎక్కువగా గైర్హాజరయ్యారు. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో కలెక్టరేట్లు, తహసీల్దార్, పంచాయతీరాజ్, మున్సిపల్, డీఈవో, సివిల్ సప్లై, ఇండస్ట్రీస్ తదితర ఆఫీసులన్నీ స్టాఫ్ లేక వెలవెలబోయాయి. హెచ్‌వోడీలు రాకపోవడంతో ఇదే అదనుగా.. అడపాదడపా హాజరైన ఉద్యోగులు సైతం ఇలా వచ్చి అలా ఇండ్లకు వెళ్లిపోయారు.
సిద్దిపేట కలెక్టరేట్‌లోని వివిధ డిపార్ట్‌మెంట్లలో చాలా మంది ఆఫీసర్లు డుమ్మా కొట్టారు. హెచ్‌వోడీలు లేకపోవడంతో కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు సగానికి పైగా రాలేదు. ముఖ్యంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో వివిధ పనులపై వచ్చిన వాళ్లంతా నిరాశతో వెనుదిరిగారు. జిల్లా వైద్య శాఖ అధికారి ఆఫీస్, ఫిషరీస్ ఆఫీస్, ఎనిమల్ హస్పెండరీ ఆఫీసుల్లో హెచ్‌వోడీలతో పాటు కిందిస్థాయి అధికారులు సగానికి పైగా గైర్హాజరయ్యారు. సివిల్ సప్లై, డీపీవో, ఇండస్ట్రీస్, అండర్ గ్రౌండ్ వాటర్, డీఈవో, మెప్మా ఆఫీసుల్లో సైతం శనివారం అధికారులు అందుబాటులో లేరు. లీడ్ బ్యాంక్ ఆఫీస్‌కు తాళం వేసి ఉండగా, ఫుడ్ సేఫ్టీ ఆఫీసులో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ ఆఫీసులో 45 మంది ఉద్యోగులు ఉండగా, శనివారం ఉదయం 11 గంటల నుంచి ఆఫీసులో ఏ ఒక్కరూ అందుబాటులో లేరు. సాయంత్రం 4 గంటల వరకు ఎవరూ తమ కుర్చీల్లో కనిపించలేదు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుకుఫోన్ చేయగా, ఆయన కనీసం ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాలేదు. మున్సిపల్ మేనేజర్ చిట్టిబాబును అడిగితే సిబ్బంది ఉదయం10 గంటలకే వచ్చి సంతకాలు పెట్టి వివిధ వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం వెళ్లారని చెప్పారు. కాగా, ఆ సర్వేలో సగం మంది కూడా లేకపోవడం గమనార్హం.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని ఎంఈవో ఆఫీస్‌కు శనివారం తాళం వేసి కనిపించింది. ఎంఈవో హైదరాబాద్‌లో మీటింగ్‌కు వెళ్లగా, మిగిలిన సిబ్బంది డుమ్మా కొట్టడంతో ఆఫీసు తెరుచుకోలేదు. కామారెడ్డి డీఈవో ఆఫీసులో పలువురు ఉద్యోగులు సెలవుపై వెళ్లడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.
ఎలాంటి సమాచారం లేకుండా డ్యూటీకి డుమ్మా కొట్టిన ఇద్దరికి యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు మెమో ఇచ్చారు. భువనగిరిలోని జిల్లా హాస్పిటల్‌ను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వరుసగా మూడు రోజులు చెప్పాపెట్టకుండా డ్యూటీకి రాని డాక్టర్, రెండు రోజులుగా హాజరుకాని ఫార్మాసిస్ట్‌కు మెమోలు జారీ చేశారు.
మంచిర్యాల కలెక్టరేట్‌లోని ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌లో ఉదయం 11 దాటినా ఆఫీసర్లు, సిబ్బంది రాలేదు. మొత్తం ఎనిమిది మందికిగానూ జూనియర్ అసిస్టెంట్‌తో పాటు మరొకరే అటెండ్ అయ్యారు. 11.30 తర్వాత సిబ్బంది ఒక్కొక్కరుగా ఆఫీస్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్‌లోని పలు డిపార్ట్‌మెంట్స్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.