USA vs IRE: ఐర్లాండ్‌తో అమెరికా ఢీ.. 3 దేశాల అభిమానుల్లో ఉత్కంఠ

USA vs IRE: ఐర్లాండ్‌తో అమెరికా ఢీ.. 3 దేశాల అభిమానుల్లో ఉత్కంఠ

టీ20 ప్రపంచకప్ 2024లో నేడు(జూన్ 14) కీలక మ్యాచ్ జరగనుంది. సంచలన ప్రదర్శన కనబరుస్తోన్న ఆతిథ్య జట్టు అమెరికా.. ఐర్లాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఈ ఇరు దేశాల అభిమానులతో పాటు.. పాకిస్థాన్ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫ్లోరిడా వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో అమెరికా గెలిచినా, మ్యాచ్ రద్దయినా.. పాకిస్తాన్ కథ ముగిసినట్టే.

గెలిచినా, రద్దయినా.. పాక్ ఇంటికే

తొలి మ్యాచ్‍లో అమెరికా చేతిలో ఓడిన బాబర్ సేన.. అనంతరం రెండో పోరులో భారత్ చేతిలో పరాజయం పాలైంది. ఆ తరువాత పుంజుకొని కెనడాపై విజయం సాధించి సూపర్-8 ఆశలను సజీవంగా నిలుపుకుంది. అయితే, పాకిస్థాన్ సూపర్-8 చేరాలంటే తదుపరి ఆదివారం(జూన్ 16) ఐర్లాండ్‍తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాలి. అంతేకాదు, ఐర్లాండ్‍ చేతిలో అమెరికా ఓటమి పాలవ్వాలి. ఈ రెండూ జరగపోయినా, ఏ ఒక్కటి రద్దయినా పాక్ ఇంటికెళ్లడం ఖాయం. 

ఫ్లోరిడాలో భారీ వర్షాలు

ఐర్లాండ్, అమెరికా మ్యాచ్‌ జరగాల్సిన ఫ్లోరిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యవ‌స‌రమైతే త‌ప్ప ప్రజ‌ల‌ను ఇళ్లనుంచి బ‌య‌ట‌కు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో మ్యాచ్ జరగడం కాస్త అనుమానంగానే ఉంది. ఒకవేళ ఇవాళ జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే అమెరికాకు ఒక్క పాయింట్ దక్కుతుంది. దీంతో 5 పాయింట్లతో లీగ్ స్టేజ్‌ను ముగించి నేరుగా సూపర్-8కి అర్హత సాధిస్తుంది. చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచినా.. ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లు మాత్రమే చేరతాయి. దీంతో ఆ జట్టు మెగా టోర్నీ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ్టి మ్యాచులో ఐర్లాండ్ గెలవడం పాక్‌కు అత్యవసరం. దీంతో పాక్ అభిమానులు ఐర్లాండ్ గెలవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు, చివరి మ్యాచ్‌లో గెలిచి గౌరవప్రదంగా టోర్నీ నుంచి వైదొలగాలని ఐర్లాండ్ చూస్తోంది.