Telangana Holi : ఈ తండాలో వందేళ్లుగా మూడు రోజుల హోలీ పండుగ.. స్పెషల్ ఎందుకంటే..!

హోలీ గిరిజనులకు ప్రత్యేకమైన పండుగ. ఎక్కడున్నా హోలీ రోజు ఊళ్లకు వెళ్లి వేడుకలు చేసుకుంటారు వాళ్లు. ఈ పండుగ గిరిజనుల సంప్రదాయాలకు నిలువుటద్దం. అందులోనూ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని లోక్యతండాలో జరిగే హోలీ ఉత్సవాలు మరీ స్పెషల్. ఎక్కడైనా ఒకే రోజు జరిగే ఈ వేడుకలు ఇక్కడ మాత్రం మూడు రోజులపాటు జరుగుతాయి. ఈ వేడుకలు వందేళ్ల నుంచి జరుగుతున్నాయి. మొదటి రోజు కోలాటం, రెండో రోజు కామదహనం, మూడో రోజు రంగోలీ ఉత్సవాలు చేస్తారు.

లోక్యాతండాలో హోలీ ఉత్సవాలు ఎంతో వైభవంగా చేస్తారు. మూడు రోజులపాటు చిన్నా-పెద్దా అంతా కలిసి ఆనందోత్సాహాల్లో తేలిపోతారు. గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా కోలాటం, కామదహనం, డూండ్, దండామారో, పాగ్రామ్, రంగోలీ పేరుతో ఉత్సవాలు చేస్తారు. ఇలా వందేళ్ల నుంచి చేస్తున్నారు. రాష్ట్రం నలుమూల నుంచి వేలాది మంది గిరిజనుల వస్తారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఇళ్లల్లో చుట్టాల సందడే సందడి. ఈ వేడుకలు ఈ నెల 21న ప్రారంభం కానున్నాయి. 

ఐదు గంటల కోలాటం

ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు 'హోలిలీ దండా మారేబాయ్ బయ్ రే' కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఊరంతా పంచాయతీ కార్యాలయం దగ్గరకు -వస్తారు. తర్వాత కుల పెద్దలు "గెరియా, ఖారోబారో' కోలాటం కార్యక్రమాన్ని డప్పు వాయిద్యంతో మొదలుపెడతారు. ఐదుగంటల పాటు కోలాటం ఆడ ఆడతారు. లోక్యాతండాలో కాసేపు కోలాటం ఆడిన తర్వాత అక్కడి నుంచి దగ్గరలోని జగ్నల్ తండాకు వెళ్తారు. అక్కడ కూడా కోలాటం ఆడి కార్యక్రమాన్ని ముగిస్తారు. కోలాటం చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. 

కామ దాహం

రెండో రోజు 'కామదహనం' నిర్వహిస్తారు. రాత్రి రెండు గంటలకు ఈ వేడుక మొదలవుతుంది. ముందు రోజు రాత్రి తండాలోని ప్రతి ఇంటి నుంచి కట్టెలు తీసుకొస్తారు. వాటిని కామదహనం చేసే చోట కుప్పగా పేరుస్తారు. కుల పెద్దలు ఈ కుప్ప చుట్టూ తిరిగి పూజలు చేస్తారు. తర్వాత కామదహనం చేస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకత నుంచి ఈ హోలీ మధ్య తండాలో "పుట్టిన మగ పిల్లలను కామదహనం చేసే దగ్గరకు తీసుకొచ్చి కాముడి ఆశీర్వాదం పొందుతారు. పిల్లలకు బొట్టుపెట్టించి ఇళ్లకు తీసుకెళ్లారు. పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు మంచి భర్త రావాలని పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత తండావాసులు కామదహనం మంటల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఇక యువకులు 'చెర్రీ' అంటూ చేసే సందడి అంతా ఇంతా కాదు.

డూండ్

రెండో రోజు వేడుకల్లో ప్రధాన ఘట్టం 'డూండ్'. తండాలో మగబిడ్డ పుట్టిన ఇళ్లలో ఈ వేడుక చేస్తారు. ఈ వేడుకలో బిడ్డకు అన్నప్రాసన చేస్తారు. గిరిజన సంప్రదాయంలో భాగమైన ఈ వేడుకకు ఆఇంటి బంధువులు అంతా వస్తారు. గ్రామ పెద్దలు గెరియా, ఖారోబారో ఆ ఇంటికి వచ్చి కోలాటం మొదలుపెట్టి అన్నప్రాసన వేడుకను మొదలుపెడతారు. తర్వాత పాయసం ఉట్టికొట్టే కార్యక్రమం ఉంటుంది. ఇందులో యువకులు ఉత్సాహంగా పాల్గొంటారు. తర్వాత కుల పెద్దలు బిడ్డకు నామకరణం చేస్తారు.

రంగోలీ

హోలీ వేడుకల్లో ప్రధానమైనది రంగోలీ. దీన్నే గిరిజనులు 'పాగ్రామ భరో' అని కూడా పిలుస్తుంటారు. రెండు రోజుల పాటు దైవ భక్తితో వేడుకలు చేసుకునే తండావాసులు మూడో రోజు రంగోలీ వేడుకలు చేసుకుంటారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఒకచోట చేరి రంగులు చల్లుకుంటారు. దీంతో హోలీ వేడుకలు ముగుస్తాయి.

లక్షల్లో ఖర్చు

లోక్యాతండాలో నిర్వహించే హోలీ వేడుకల కోసం గిరిజనులు భారీగా ఖర్చు చేస్తారు. వాళ్లకు ఇదే పెద్ద పండుగ కావడంతో బంధువులను పిలిచి విందు ఇస్తారు. కొందరు కొత్త దుస్తులు కూడా ఇస్తారు. ఒక్కో కుటుంబం లక్ష వరకు ఖర్చు చేస్తుంది. మగబిడ్డ పుట్టిన ఇంట్లో ఈ మూడు రోజులపాటు జాతర సంబరం కనిపిస్తుంది.
ఆ కుటుంబం సుమారు రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది.