రంగు రంగుల పతంగులు.. తీరొక్క స్వీట్లు: పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్

  • 16 దేశాల నుంచి 47 మంది కైట్ ఫ్లయర్స్
  • 700 స్టాల్స్​లో 1,500 రకాల స్వీట్లు
  • ఫెస్టివల్​ను ప్రారంభించిన మంత్రులు పొన్నం, జూపల్లి

హైదరాబాద్ సిటీ, వెలుగు: సికింద్రాబాద్‌‌ పరేడ్‌‌ గ్రౌండ్‌‌లో ఇంట‌‌ర్నేష‌‌న‌‌ల్ కైట్ అండ్ స్వీట్‌‌ ఫెస్టివల్‌‌ సోమవారం ప్రారంభమైంది. 16 దేశాల‌‌ నుంచి 47 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్లు, వివిధ రాష్ట్రాల నుంచి 60 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పైడర్​మ్యాన్, కాంతారా, కోడి పుంజు, షార్క్, గొరిల్లా, కారును పోల్చే పతంగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కైట్ అండ్ స్వీట్‌‌ ఫెస్టివల్​ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ మంత్రులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 700 స్టాల్స్​లో 1,500కు పైగా స్వీట్స్ అందుబాటులో ఉంచారు. తెలంగాణ సంప్రదాయ వంట‌‌‌‌లు, కేర‌‌‌‌ళ‌‌‌‌, మ‌‌‌‌హారాష్ట్ర, పంజాబ్, గుజ‌‌‌‌రాత్‌‌తో పాటు ఇత‌‌‌‌ర రాష్ట్రాల‌‌‌‌కు చెందిన మ‌‌‌‌హిళ‌‌‌‌లు ఇంట్లో త‌‌‌‌యారు చేసిన ర‌‌‌‌కరకాల స్వీట్లను ఫుడ్​కోర్టులో పెట్టారు. ప్రారంభోత్సవం సందర్భంగా స్టేజీపై కళాబృందాల ఆటపాటలు, చిన్నారుల డ్యాన్సులు ఆట్టుకున్నాయి.

మన సంప్రదాయాలు కాపాడుకోవాలి: జూపల్లి

అనాదిగా వస్తున్న మన సంప్రదాయాలను కాపాడుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ‘‘కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఆయా రాష్ట్రాల వంటకాలు స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచాయి. నేను చిన్నప్పుడు పతంగులు ఎగురవేసేవాణ్ని. ఒకసారి మాంజాతో నా చేయి తెగింది. ఈ మధ్య కాలంలో పతంగులు ఎగురవేసే సంప్రదాయం కనుమరుగైంది. మన కలలు, సంస్కృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినం. 19 దేశాల ప్రతినిధులు కైట్ ఫెస్టివల్ కు వచ్చిన్రు. దేశంలోని అన్ని రకాల వంటలు ఒకే చోట రుచి చూసే అవకాశం ఈ ఫెస్టివల్​తో సాధ్యమైంది. ఫ్యామిలీతో వచ్చి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్​ను ఎంజాయ్ చేయండి’’అని జూపల్లి కోరారు.

పర్యాటక ప్రదేశాలను డెవలప్ చేస్తున్నం: పొన్నం

రాష్ట్రంలో టూరిజం డెవలప్ అవుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఎంతో గ్రాండ్​గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘‘మా ప్రభుత్వం ఇటీవలే టూరిజం పాలసీ తీసుకొచ్చింది. పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నం. సంక్రాంతి హాలిడేస్​లో కైట్, స్వీట్ ఫెస్టివల్​ను సందర్శించండి’’ అని పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ రమేశ్ రెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్​పర్సన్ వెన్నెల గద్దర్, రోడ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్​రెడ్డి రాంరెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సంకేపల్లి సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.