రైల్వే కోడూరులో గంగమ్మ తల్లి జాతర.. ఎప్పుడంటే..

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో మూడు రోజుల పాటు గంగమ్మ తల్లి జాతర జరుగనుంది.   ఈ నెల 16 వ తేది రైల్వేకోడూరులో గంగమ్మ తల్లి జాతర గురువారంనాడు అంగరంగ వైభవంగా జరుగనుంది.  15వ తేదీ బుధవారం రాత్రి గంగమ్మ తల్లిని  పల్లకిని పట్టణములోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో  పల్లకిని ఊరేగింపుగా స్థానిక బలిజవీధిలో  వెలసిన శ్రీ అంకాలమ్మ దేవస్థానానికి తీసుకొని వస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. విచిత్ర వేషధారణ డిజె సౌండ్స్ బాణాసంచా భారీగా కాల్చుతూ పూల పల్లకి తీసుకొని రావడంతో గంగమ్మ  జాతర ప్రారంభమవుతుంది. ఈ నెల 16 వ తేది గురువారం ఉదయం గంగమ్మ తల్లి దర్శనార్థం భక్తులు తరలివస్తున్నారు. వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ పూజలు నిర్వహిస్తూ అమ్మవారి కృపకు పాత్రులు అవుతున్నారు.

ఈ గంగమ్మ జాతర సందర్భంగా వేసవి తాపానికి భక్తాదులు తట్టుకునే విధంగా చాలామంది భక్తాదులు మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లు విరివిగా పంపిణీ చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమం నందు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు, గంగమ్మ కమిటీ సభ్యులు అందరూ చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలియజేశారు.

 రైల్వేకోడూరులో గంగమ్మ జాతర నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే అంకాలమ్మ దేవస్థానములో సాంప్రదాయ బద్దంగా శ్రీ గంగమ్మ తల్లి విగ్రహాన్ని తయారు చేసి ఆ తరువాత అమ్మవారి విగ్రహాన్ని పల్లకిలో శ్రీ గంగమ్మ తల్లి గుడిలో అమ్మవారు  కొలువు తీరుతారు. గురువారం తెల్లవారు జాము నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుందని, శుక్రవారం 17వ తేదీ ఉదయం నుంచి శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారిని పట్టణములో ఊరేగింపు చేసి సమీపంలోని వాగువద్ద నిమజ్జనం చేయనున్నట్టు జాతర నిర్వాహకులు  తెలిపారు. 

 ప్రతి ఏటా రైల్వేకోడూరులో గంగమ్మ జాతరను చూసేందుకు రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచే కాకుండా రాజంపేట, తిరుపతి, రాపూరు, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తారు.  జాతర  రోజు పట్టణంలో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. గత ఏడాది కాన్నా మిన్నగా ఈ ఏడాది గంగమ్మ తల్లి జాతరను వైభవోపేతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్దమౌతున్నారు. ఇందులో భాగంగా పట్టణమంతా విద్యుత్ దీపాల అలంకరణ పెద్ద ఎత్తున ఏర్పాటుకు సిద్దం చేస్తున్నారు. మరోవైపు పట్టణములోని ప్రధాన కూడళ్లవద్ద విద్యుత్ దీపాలతో అమ్మవారి ప్రతిమలను ఏర్పాటు చేస్తున్నారు. 

రైల్వేకోడూరులో జాతరకోసం స్థానిక పోలీసు యంత్రాంగం పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటుకు సిద్దమౌతున్నారు. జాతర జరిగే రోజున మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్రాయులు భక్తులకు అన్నదాన సౌకర్యం ఏర్పాటు చేసేందుకు ఆయన సిద్దమౌతున్నారు. ప్రతి ఏటాకూడా జాతర జరిగేరోజు బత్యాల చంగల్రాయులు తన ఇంటివద్ద వేలాది మందికి భోజనాలు వండి వడ్డించటం ఓ అనవాతీగా ఉంది.  జాతరకు వచ్చే భక్తులకు ఉచితంగా మజ్జిగ, త్రాగునీరు కూడా ఏర్పాటు చేస్తారు. కాగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా జాతర నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జాతరలో ఇతర ప్రాంతాల నుంచి భారీఎత్తున చిరువ్యాపారులు తరలివచ్చి వారు తయారు చేసే వస్తువులు అమ్మకానికి సిద్ధంగా వుంచుతారు. గంగమ్మ తల్లి జాతర అంటేనే రైల్వేకోడూరులో  మూడు రోజుల పాటు పండుగ వాతావరణం నెలకొంటుంది.