
- బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించిన ఏసీబీ
- ఏసీపీ ఉమామహేశ్వర్ కస్టడీలో వెలుగులోకి కీలక విషయాలు
- ఇయ్యాల్టితో ముగియనున్న కస్టడీ
హైదరాబాద్, వెలుగు: ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు అక్రమాస్తుల కేసులో కీలక విషయం బయటపడింది. ఇందులో మరో ముగ్గురు డీసీపీ స్థాయి అధికారులు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. ఉమామహేశ్వర్‌రావుతో సన్నిహితంగా ఉండే ముగ్గురు డీసీపీలు కూడా బినామీల పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఆధారాలు సేకరించింది. సోదాల సమయంలో ఉమామహేశ్వర్ రావు ఇంట్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, డైరీ, ల్యాండ్ డాక్యుమెంట్స్ లో ముగ్గురు డీసీపీల బినామీ ఆస్తులను గుర్తించినట్టు తెలిసింది. అవినీతి ఆరోపణలతో సిటీ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావును ఏసీబీ అధికారులు ఇటీవల అరెస్టు చేశారు. సోదాల టైమ్‌లో రూ.3.97 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించారు.
ఉమామహేశ్వర్‌రావును మూడ్రోజుల పాటు ఏసీబీ కస్టడీకి కోర్టు అప్పగించగా.. అధికారులు ఆయనను బుధవారం నుంచి కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారం రెండోరోజు కస్టడీలో భాగంగా కీలక సమాచారం రాబట్టినట్టు తెలిసింది. ఉమామహేశ్వర్‌రావు పని చేసిన పోలీస్ స్టేషన్లు, డివిజన్స్‌లో భారీగా అవినీతికి పాల్పడ్డట్టు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఎక్కువగా సెటిల్‌మెంట్లు చేసినట్టు గుర్తించారు. వీటికి సంబంధించి బాధితుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది.
సెటిల్‌మెంట్లు చేసి..
ఉమామహేశ్వర్ ల్యాప్‌టాప్‌లోని ఆర్థిక లావాదేవీల సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు అవినీతి సొమ్ము లెక్కలు తీస్తున్నారు. ఆయన సీసీఎస్‌లో పని చేస్తున్న సమయంలో ఎలాంటి కేసులు దర్యాప్తు చేశాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఉమామహేశ్వర్‌రావు దర్యాప్తు చేసిన కేసుల్లో బాధితులు, నిందితులను గుర్తించి విచారిస్తున్నారు. హైప్రొఫైల్ కేసుల సెటిల్ మెంట్లలో పలువురు డీసీపీ స్థాయి అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించారని తెలిసింది. డీసీపీలకు చెందిన ఆస్తులన్నీ బినామీల పేర్లతో ఉండడంతో.. ఆ బినామీల వివరాలను సేకరిస్తున్నారు. అవసరమైతే డీసీపీలను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఉమామహేశ్వర్ రావు కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. ఆయనను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు. ఉమామహేశ్వర్ రావు స్టేట్‌మెంట్ ఆధారంగా సంబంధిత పోలీస్ అధికారులను విచారించనున్నారు.