పంట కాపాడుకునే ప్రయత్నంలో.. కరెంట్‌‌ షాక్‌‌తో ముగ్గురు మృతి

పంట కాపాడుకునే ప్రయత్నంలో.. కరెంట్‌‌ షాక్‌‌తో ముగ్గురు మృతి

జహీరాబాద్/గజ్వేల్‌‌, వెలుగు: అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు పొలం చుట్టూ కరెంట్‌‌ పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా ముగ్గురు చనిపోయారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌‌ మండలం గోవిందాపూర్‌‌ గ్రామంలో అన్నదమ్ములు చనిపోగా, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌‌ మండలంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే... గోవిందాపూర్‌‌ గ్రామానికి చెందిన ఎరుకల జగన్‌‌(48), ఎరుకల మల్లేశం(42) అన్నదమ్ములు. తమ పొలంలో వేసిన చెరకును అడవి పందుల బారి నుంచి రక్షించుకునేందుకు పొలం చుట్టూ కరెంట్‌‌ వైర్లు అమర్చారు. ప్రతి రోజు రాత్రి టైంలో హైటెన్షన్‌‌ లైన్‌‌కు కొక్కేలు తగిలించి పొలం చుట్టూ వేసిన వైర్లకు విద్యుత్‌‌ సరఫరా చేసేవారు.

ఇందులో భాగంగా గురువారం రాత్రి కూడా జగన్‌‌ హైటెన్షన్‌‌ లైన్‌‌కు కొక్కేలు వేసేందుకు ప్రయత్నించాడు. ముందుగా ఒక తీగను లైన్‌‌కు తగలించి, మరో తీగను తగిలించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో జగన్‌‌ షాక్‌‌కు గురయ్యాడు. గమనించిన అతడి తమ్ముడు మల్లేశం వెంటనే జగన్‌‌ చేతిలో ఉన్న తీగలను తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా అతడికి కూడా షాక్‌‌ కొట్టింది. దీంతో అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. గమనించిన స్థానిక రైతులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిరాక్‌‌పల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను జహీరాబాద్‌‌ ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌‌లో..
గజ్వేల్‌‌ మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన బోనగిరి బాలమణి (35), నర్సింహులు దంపతులు తమకున్న పొలంలో స్వీట్‌‌ కార్న్‌‌ సాగు చేశారు. అడవి పందులు పంటపై దాడి చేసి కంకులను నాశనం చేస్తున్నాయి. దీంతో పంటను రక్షించుకునేందుకు నర్సింలు గురువారం చేను చుట్టూ ఇనుప తీగ వేసి కరెంట్​ కనెక్షన్‌‌ ఇచ్చాడు. విషయం తెలియని బాలమణి శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లగా పొలం చుట్టూ వేసిన కంచెకు తగలడంతో షాక్‌‌ కొట్టి అక్కడికక్కడే చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.