కార్బన్​ మోనాక్సైడ్​ పీల్చడం వల్లే ముగ్గురు మృతి?

కార్బన్​ మోనాక్సైడ్​ పీల్చడం వల్లే  ముగ్గురు మృతి?
  • సనత్​నగర్​ ఘటనలో డాక్టర్ల ప్రాథమిక అంచనా 

పంజాగుట్ట, వెలుగు: హైదరాబాద్​లోని సనత్​నగర్​లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ముగ్గురి మృతి మిస్టరీ ఇంకా వీడలేదు. జెక్​కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు మాధవి,  వెంకటేశ్​తో పాటు వారి కొడుకు హరికృష్ణ.. బాత్​రూమ్​లో విగతజీవులుగా కనిపించిన విషయం తెలిసిందే. వీరి మృతికి కరెంట్​షాకే కారణమనే అనుమానాలు మొదట వ్యక్తమయ్యాయి. 

కానీ, గ్యాస్​తో నడిచే గీజర్​ నుంచి వెలువడిన కార్బన్​ మోనాక్సైడ్​ వాయువు పీల్చడం వల్లే ముగ్గురూ స్పృహ కోల్పోయి ఊపిరి ఆడక చనిపోయి ఉండవచ్చని పోస్టుమార్టమ్​ చేసిన గాంధీ డాక్టర్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కార్బన్​ మోనాక్సైడ్​ వాయువును పీల్చిన ఐదు నిమిషాలకే వారు సృహతప్పి పడి ఉంటారని, ఆ తర్వాత ఆక్సిజన్​ అందక ప్రాణాలు కోల్పోయి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా, కొన్ని శరీర భాగాలను పరీక్షల కోసం పంపామని, అవి వస్తేనే మృతికి గల అసలు కారణాలు తెలుస్తాయని డాక్టర్లు తెలిపారు.