ఎస్‌‌ఎల్‌‌బీసీ ప్రమాదం .. గుర్తుకొస్తున్న దేవాదుల ఘటన

ఎస్‌‌ఎల్‌‌బీసీ ప్రమాదం .. గుర్తుకొస్తున్న దేవాదుల ఘటన
  • 2011లో దేవాదుల టన్నెల్‌‌కు బుంగ పడి ముగ్గురు కార్మికులు జలసమాధి 
  • నెల రోజుల తర్వాత బయటపడ్డ అస్థిపంజరాలు

 జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లాలోని ఎస్‌‌ఎల్‌‌బీసీ సొరంగంలో ప్రమాదం జరగడంతో.. 14 ఏండ్ల కిందట దేవాదుల సొరంగ నిర్మాణంలో జరిగిన ప్రమాదాన్ని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం చలివాగు ప్రాజెక్ట్‌‌ కింద 2011లో జరిగిన ఘటనలో ముగ్గురు జలసమాధి కాగా 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. నెల రోజుల తర్వాత ముగ్గురి అస్థిపంజరాలు బయటపడ్డాయి. వాటర్‌‌‌‌ సీపేజీ కారణంగానే అప్పుడు ప్రమాదం జరిగినట్లు ఇరిగేషన్‌‌ ఆఫీసర్లు ప్రకటించారు. ఇప్పుడు ఎస్‌‌ఎల్‌‌బీసీలో కూడా వాటర్‌‌ సీపేజీ కారణంగానే బురద, మట్టి కూలి ప్రమాదం జరిగిందని అంటున్నారు.

దేవాదుల టన్నెల్‌‌లో జరిగిందిదీ..

జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా రామప్ప నుంచి ధర్మసాగర్‌‌ వరకు టన్నెల్‌‌‌‌ నిర్మాణం చేపట్టారు. రూ.1,410 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల్లో 54.88 కిలోమీటర్ల దూరం ఆరు మీటర్ల వ్యాసార్థంతో సొరంగం తవ్వి 5.6 మీటర్ల వెడల్పుతో ‘డి’ షేపులో ఉండేలా లైనింగ్‌‌ వేయాలి. పనులు పూర్తయ్యాక ప్రతి సంవత్సరం 25.75 టీఎంసీల గోదావరి నీటిని ధర్మసాగర్‌‌కు పంపింగ్‌‌ చేయాలని నిర్ణయించారు. కాంట్రాక్ట్‌‌ దక్కించుకున్న సంస్థ పది ఆడిట్‌‌‌‌ పాయింట్లు, ఏడు షాఫ్ట్‌‌‌‌లు ఏర్పాటు చేసి పనులు ప్రారంభించింది. 2011 జులైలో వసంతాపూర్‌‌ ఆడిట్‌‌ పాయింట్​ వద్ద మూడో షిఫ్ట్‌‌లో పనిచేయడానికి కార్మికులు సిద్ధం అవుతున్నారు. 

సీపేజీ ద్వారా సొరంగంలోకి వస్తున్న ఊట నీటిని డీ వాటరింగ్‌‌‌‌ చేయడానికి ముందుగా ముగ్గురు  కార్మికులు లోపలికి వెళ్లగా.. తర్వాత మరో 12 మంది టన్నెల్‌‌లోకి బయలుదేరారు. రాత్రి ఏడు గంటల టైంలో టన్నెల్‌‌లో భారీ శబ్ధం వినిపించింది. టన్నెల్‌‌పై పైభాగంలో చలివాగు ప్రాజెక్ట్‌‌ ఉండడంతో టన్నెల్‌‌కు బుంగపడి వాటర్‌‌ స్పీడ్‌‌గా రావడం మొదలైంది. దీంతో అప్రమత్తమైన వెహికల్‌‌ డ్రైవర్‌‌ రివర్స్‌‌లో స్పీడ్‌‌గా బయటకు రావడంతో 12 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వీరి కంటే ముందు టన్నెల్‌‌లోకి వెళ్లిన ముగ్గురు జల సమాధి అయ్యారు. ఎన్‌‌డీఆర్‌‌ఎఫ్‌‌, సింగరేణి రెస్క్యూ టీమ్‌‌‌‌లు, గజఈతగాళ్లు ఆక్సిజన్‌‌ సిలిండర్లు వేసుకొని టన్నెల్‌‌లో ఎంత గాలించినా డెడ్‌‌బాడీలు దొరకలేదు. చివరికి చలివాగు ప్రాజెక్ట్‌‌ నీటిని పూర్తిగా బయటకు విడుదల చేసి, ఆ తర్వాత టన్నెల్‌‌లో ఉన్న నీటిని డీవాటరింగ్‌‌ చేస్తే నెల రోజుల తర్వాత ముగ్గురు కార్మికుల అస్థిపంజరాలు బయటపడ్డాయి. వీటికి పరీక్షలు నిర్వహించి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. 

పదేండ్లకుపైగా ఆగిన పనులు

ప్రమాదం తర్వాత దేవాదుల టన్నెల్‌‌ నిర్మాణ పనులు పదేండ్లకు పైగా ఆగిపోయాయి. సొరంగంలోకి వెళ్లి పనిచేయాలంటే కార్మికులు, ఇంజినీర్లు భయపడేవారు. ప్రమాద సమయంలో కాంట్రాక్ట్‌‌ పనిచేసిన కంపెనీ ఆ తర్వాత దివాలా తీసింది. మొత్తం 54 కిలోమీటర్ల టన్నెల్‌‌లో 31.35 కిలోమీటర్లు పూర్తి చేశారు. 2.55 కిలోమీటర్ల దూరం సొరంగంలో లైనింగ్‌‌ పనులు పూర్తి చేసి వెళ్లిపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం సొరంగాన్ని 49.06 కిలోమీటర్లకు కుదించింది.

 కొత్తగా 3.98 కిలోమీటర్ల దూరం అప్రోచ్‌‌ కెనాల్‌‌, మరో 6.86 కిలోమీటర్ల దూరం వరకు మూడు మీటర్ల వ్యాసార్థం కలిగిన మూడు పైపైలైన్లు వేసి పంప్‌‌హౌజ్‌‌, సర్జ్‌‌పూల్‌‌ చేపట్టాలని నిర్ణయించారు. ఎస్టిమేషన్‌‌‌‌ను కూడా రూ.84 కోట్లు పెంచి రూ.1,494 కోట్లతో పనులు ప్రారంభించారు. అయితే దేవాదుల స్కీమ్‌‌కు నిధులు సరిగా విడుదల చేయకపోవడంతో పనులు ఇంకా పూర్తి కాలేదు.