ఏసీబీకి చిక్కిన ముగ్గురు ఉద్యోగులు

ఏసీబీకి చిక్కిన ముగ్గురు ఉద్యోగులు

జమ్మికుంట/మేళ్లచెరువు/మెహిదీపట్నం, వెలుగు: లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కరీంనగర్  జిల్లా జమ్మికుంట పట్టణంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో కమ్యూనిటీ కో ఆర్డినేటర్(సీసీ)గా పని చేస్తున్న పసరకొండ సురేశ్​ రూ.10 వేలు లంచం తీసుకోగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పెద్దంపల్లి గ్రామానికి చెందిన గ్రామైక్య సంఘం అసిస్టెంట్  దొడ్డే స్వప్నకు రావాల్సిన రూ.60 వేల జీతం ఇచ్చేందుకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్  చేశాడు. మొదట రూ.4 వేలు ఇచ్చినప్పటికీ, మిగిలిన రూ.16 వేలు ఇచ్చాకే వేతనం వస్తుందని చెప్పాడు.

దీంతో బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు మంగళవారం సీసీ సురేశ్​కు రూ.10 వేలు లంచం ఇవ్వగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సీసీని కరీంనగర్  కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.

స్టేషన్  బెయిల్ కు లంచం తీసుకుంటూ ఎస్సై..

స్టేషన్  బెయిల్  ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ సూర్యాపేట జిల్లా చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. నల్గొండ రేంజ్  ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ మంగళవారం మీడియాకు వివరాలు తెలిపారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన ఆరుగురు వ్యక్తులు చింతలపాలెం మండలంలో రేషన్  బియ్యాన్ని కొనుగోలు చేసి తరలిస్తూ గత ఏడాది అక్టోబర్ 23న పోలీసులకు పట్టుబడగా.. కేసు నమోదు చేసిన ఎస్సై లంచం తీసుకుని స్టేషన్  బెయిల్ ఇచ్చాడు.

దర్యాప్తులో మరో వ్యక్తి కూడా ఉన్నాడని తేలడంతో అతడికి బెయిల్  ఇవ్వడానికి ఎస్సై రూ.15 వేలు డిమాండ్  చేయగా, రూ. 10 వేలకు అగ్రిమెంట్ కుదిరింది. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు రూ.10 వేలను చింతలపాలెం పీఎస్ లో ఎస్సైకు ఇవ్వగా, ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. మరో టీం ఎస్సై ఇంట్లో సోదాలు చేస్తోందని, పూర్తి విచారణ అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

మెహిదీపట్నంలో ఆర్టిజన్  ఉద్యోగి..

హైదరాబాద్​ సిటీలోని టీజీ ఎస్పీడీసీఎల్​ మంగళహాట్  డివిజన్​ కిషన్ నగర్ కు చెందిన ఓ వినియోగదారుడి మీటర్  ట్యాంపరింగ్  అయిందని, ఈ విషయంలో మేనేజ్  చేసేందుకు 
ఆర్టిజన్  ఉద్యోగి అబ్దుల్  రహమాన్  రూ.20 వేలు డిమాండ్  చేశాడు. మంగళవారం మధ్యాహ్నం ఆఫీస్​లో రూ.20 వేలు ఇవ్వగా, ఏసీబీ అధికారులు  రహమాన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడిని కోర్టులో హాజరు పరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు