- ముగ్గురు భారతీయ మహిళలు మృతి
- ప్రమాదం తీవ్రతకు నుజ్జునుజ్జయిన కారు
సౌత్ కరోలినా: అమెరికాలో శనివారం జరిగిన ఘర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గుజరాతీ మహిళలు చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొట్టి 20 అడుగులు గాల్లోకి ఎగిరింది. చివరకు ఓ చెట్టుపై ల్యాండయింది. సౌత్ కరోలినా రాష్ట్రంలోని గ్రీన్ విల్లే కౌంటీలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతులను గుజరాత్ లోని ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్ గా గుర్తించారు.
‘‘ఆ మహిళలు ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టి 20 అడుగులు గాల్లోకి లేచి చివరకు ఓ చెట్టుపై ల్యాండయింది. అంటే వారి వెహికల్ ఎంత వేగంగా ప్రయాణించిందో అర్థం చేసుకోవచ్చు. కారు అత్యంత వేగంగా ప్రయాణిస్తుండడంతో 4 నుంచి -6 వరుసలు ఉన్న రోడ్డుపై నుంచి పల్టీలు కొట్టింది. ప్రమాద తీవ్రతకు వారి వెహికల్ నుజ్జునుజ్జయిపోయింది. ఈ ఘటనలో ఇతర వాహనాలకు ప్రమాదమేమీ జరగలేదు” అని పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ బృందాలు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించాయి. కాగా, ఆ మహిళలు ప్రయాణిస్తున్న కారులో డిటెక్షన్ సిస్టమ్ ఉండడంతో ప్రమాదం గురించి వారి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వారు సౌత్ కరోలినాలోని అధికారులను అప్రమత్తం చేశారు.