ఆసిఫాబాద్, వెలుగు: షార్ట్ సర్క్యూట్‌తో మూడిండ్లు దగ్ధమైన ఘటన కెరమెరి మండలం ఖైరి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖైరి గ్రామానికి చెందిన మొహర్లె చంద్రయ్య కుటుంబం వ్యవసాయ పనుల నిమిత్తం చేనుకు వెళ్లింది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆయన ఇంట్లో ప్రమాదవశాత్తూ షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి.
తీవ్రంగా వ్యాపించిన మంటలు పక్కనే ఉన్న మొహర్లె గిర్మాజీ, వడాయి కమలాబాయి ఇండ్లకు కూడా అంటుకున్నాయి. మంటలు అర్పేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాలేదు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా.. ఆసిఫాబాద్ నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేలోపే మూడు ఇండ్లు పూర్తిగా కాలిపోయాయి.
ఆ ఇండ్లలో దాచుకున్న నగదు, నగలు, నిత్యావసరాలు, బట్టలు, పట్టా భూముల కాగితాలు, పూర్తిగా కాలిపోయి బాధిత కుటుంబాలు సర్వం కోల్పోయారు. ఈమేరకు రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మొహర్లె చంద్రయ్యకు చెందిన రూ.4 లక్షల 50 వేలు, గిర్మాజీకి రూ.4 లక్షలు, కమలాబాయికి రూ.2 లక్షల 50 వేలు ఆస్తి నష్టం జరిగిందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు.