సాక్షాత్తు నరసింహుడు నడిచిన నేల యాదాద్రి. స్వామివారు గుర్రం ఎక్కి ఇక్కడ తిరుగుతున్నప్పుడు... ఆయన బరువు వల్ల రాయిపై పడిన గుర్రం కాలి ముద్రలు ఇప్పటికీ కనిపిస్తాయి. అంతటి విశిష్టత ఉన్న ప్రాంతం కాబట్టే యాద మహర్షి పట్టుపట్టి మరీ ఇక్కడ తపస్సు చేసి స్వామివారి దర్శనం పొందాడు. ఆయన కోరిక వల్లే ఇప్పుడు మనందరికీ నరసింహ స్వామిని దర్శించుకునే అవకాశం దక్కింది. శ్రీకృష్ణ దేవరాయల నుంచి త్రిభువనమల్లుడి వరకు ఎంతోమంది రాజులు స్వామి సేవలో తరించారు. మూడు వందల ఏండ్ల నుంచి ఇక్కడ నిత్య పూజలు, ఏటా బ్రహ్మాత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలు యాదాద్రికి వస్తారని ప్రతీతి.
దేశంలోని సుప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో యాదగిరిగుట్ట ఒకటి. ఇక్కడ సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభుగా కొలువై ఉన్నాడు. ఏక శిఖరంపై అమ్మవారితో కలసి కొలువయ్యాడు. దాదాపుగా మూడు వందల ఏండ్ల క్రితం ‘వానమామలై జీయర్ స్వామి’ పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ రామానుజ సంప్రదాయాన్ని స్థిరపరిచాడు. అప్పటి నుంచి నిత్యోత్సవాల నుంచి బ్రహ్మోత్సవాల వరకు పూజాదికాలన్నీ ఆ పద్ధతిలోనే జరుగుతున్నాయి. ఏటా ఫాల్గుణ మాసంలో జరిగే నరసింహుడి వార్షిక బ్రహోత్సవాల్లో ముక్కోటి దేవతలు పాల్గొంటారని ప్రతీతి. ఈ ఏడాది ఈ నెల11 నుంచి 21 వరకూ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.
33 కోట్ల దేవతలు
భగవంతుడిని కొలిచే వాళ్లను వేధిస్తున్న రాక్షస రాజు హిరణ్య కశిపుడిని చంపడానికి కృతయుగంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆవిర్భవించాడు. హిరణ్య కశిపుడి సంహారం అయ్యాక అక్కడినుంచి దండకారణ్యంలోని యాదగిరి క్షేత్రానికి వచ్చి కొలువుదీరాడు. అప్పుడు 33 కోట్ల దేవతలు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారట. ఆ తర్వాత సృష్టి కార్యం కోసం నరసింహుడు తిరిగి స్వర్గానికి వెళ్లిపోయాడు. నరసింహుడి ప్రస్తావన కృత యుగంలోనే కాకుండా త్రేతాయుగం, ద్వాపరయుగంలోనూ ఉందని పండితులు చెప్తున్నారు.
విష్వక్సేనుడి ఆరాధన
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో తొలి అధ్యాయం విష్వక్సేన ఆరాధన. చతుర్భుజాలతో ముమ్మూర్తులా మహా విష్ణువులా ఉండే విష్వక్సేనుడు విష్ణు గణాలకు అధిపతి అయిన వైకుంఠసేనుడు. ఆయనను కశ్యపుడు పెంచి పెద్దచేశాడని చెప్తుంటారు. వేదాలు అవపోసన పట్టిన విష్వక్సేనుడు మంత్రశాస్త్రాలు నేర్చుకున్నాడు. వైష్ణవంలో విష్వక్సేన ఆరాధనకు చాలా ప్రాధాన్యత ఉంది. విష్వక్సేనుడిని కొలిస్తే సమస్త విఘ్నాలూ తొలగిపోయి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు దక్కుతాయని పాంచరాత్ర ఆగమ శాస్త్రం చెప్తున్నది. అందుకే విష్వక్సేనుడి పరాక్రమాన్ని తాళ్లపాక అన్నమాచార్యులు ఇలా కీర్తించారు.
అదె వచ్చి విదెవచ్చెనచ్యుతు సేనాపతి..
పది దిక్కులకు నిట్టి పాదరో అసురులు’
స్వస్తివాచనం.. రక్షాబంధనం
స్వస్తి అంటే మంగళప్రదం, శుభప్రదం. స్వామి ఉత్సవాలను మించిన మంగళ కార్యం మరేదీ ఉండదు. జగద్రక్షకుడి బ్రహ్మోత్సవాల్లో రక్షాబంధన వేడుక చాలా ముఖ్యమైనది. సర్వశత్రు వినాశనం, ఆయురారోగ్య ప్రదాయకం. పవిత్ర కంకణాలను మంత్రబద్ధం చేసి భగవానుడికి, అమ్మవారికి అలంకరించాక భక్తులకి ఇస్తారు. కంకణ స్పర్శతో సకల రోగాలూ తొలగిపోతాయని నమ్ముతారు భక్తులు. అదే రోజు సాయంత్రం ఆది వరాహమూర్తి అవతారంలో భూదేవిని ఉద్ధరించిన భగవానుడిని వేదమంత్రాలతో అర్చిస్తారు. విష్ణు పత్నీం మహీం దేవీం మాధవీల మాధవ ప్రియామ్..’ అంటూ తైత్తిరీయ సంహితంలోని భూసూక్తంతో భూదేవిని కొలుస్తారు.
మృత్సంగ్రహణం
మృత్సంగ్రహణం అంటే మట్టిని సేకరించడానికి అనుమతి కోరుతూ ముందుగా భూదేవిని ప్రార్థించడం. మృత్తికపై స్వామిని చిత్రించి, మంత్రోచ్ఛారణల మధ్య ఓ మట్టిపాత్రలో నింపి, నవధాన్యాలు పోసి మంత్రశక్తితో చైతన్యవంతం చేస్తారు. శుక్లపక్ష చంద్రుడిలా నవధాన్యాలు వృద్ధి చెందాలని, సకల లోకాలూ సస్యశ్యామలంగా ఉండాలని ధాన్యలక్ష్మిని పూజిస్తారు. ‘అంకురం’ అంటే ‘బీజం’. అది జీవాత్మలను సూచిస్తుంది. మట్టి పాత్ర శరీరానికి ప్రతీక. విత్తు మొలకెత్తి మొక్కగా మారడం అంటే జీవాత్మ వికసించి పరమాత్మ అనుగ్రహాన్ని పొందడమే. బ్రహ్మోత్సవాల్లో ధాన్యాన్ని మొలకెత్తించడం వెనకున్న అంతరార్థం ఇదే.
ధ్వజారోహణం
బ్రహ్మోత్సవాల్లో ఎంతో వైభవంగా చేసే వేడుక ధ్వజారోహణ మహోత్సవం ‘‘సకల దేవతలకూ జయం కలిగించి.. అసురులను నాశనం చేయాలనే సంకల్పంతో ధ్వజాన్ని ఏర్పాటు చేస్తారు’’ అని చెప్తుంది వైఖానసం. బ్రహ్మోత్సవాల్లో తొలి పూజ ఇదే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి తిరుకల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతల్ని ఆహ్వానించే బాధ్యత గరుత్మంతుడికి అప్పగించడమే ఈ వేడుక పరమార్థం. ఈ ఘట్టానికి అర్చకులు, వేదపండితులు, రుత్వికులు, పారాయణదారులు, యాజ్ఞిక బృందం శ్రీకారం చుడతారు.
దేవదేవుడితో గరుడాళ్వారు అనుబంధం చాలా పవిత్రమైనది.బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ ఘట్టానికి ముందు ప్రధానాలయంలో యాగశాల ప్రవేశం, ద్వారతోరణం, ధ్వజ కుంభారాధన, మహా కుంభారాధన, చతు స్థానార్చన చేస్తారు. పలు హోమాలు చేస్తారు. ధ్వజారోహణం అనంతరం అష్టదిక్పాలక బలిహరణ ఎంతో ఘనంగా చేస్తారు. ‘ధ్వజం’ అంటే ‘కదిలేది’ అని అర్థం. ధ్వజాన్ని స్తంభానికి కట్టడం వల్ల ‘ధ్వజస్తంభం’ అనే పేరు వచ్చిందని బ్రహ్మాండ పురాణంలో ఉంది. ధ్వజ దండాన్ని పూజించాక తెల్లని వస్త్రంపై గరుత్మంతుడిని చిత్రించి.. 27 విధాలైన ఉపచారాలు నిర్వహించి, చతుర్వేద మంత్రసహితంగా దేవతలను ఆవాహనం చేస్తారు.
భేరీతాండవం
భేరీతాండవం అనేది ఒక గొప్ప క్రతువు. ఈ ధ్వనికి దుష్టశక్తులు పారిపోతాయని విశ్వాసం. రాగ, తాళ, స్తోత్ర పాఠాల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. దేవ తాహ్వాన కార్యక్రమంలో భాగంగా... సభా స్థానంలో స్వామిని పెండ్లి కొడుకును చేసి 33 కోట్ల దేవతలను.. 38 రాగాలు, 33 తాళాలు, 33 వేద మంత్రాలతో సగౌరవంగా భూలోకానికి ఆహ్వానిస్తారు.
ఒక్కో దేవతకు మూడు రకాల ఉపచారాలు చేసి బ్రహ్మోత్సవంలో పాలుపంచుకోవాలని కోరతారు. దేవతలందరికీ స్వామి దివ్యవిమాన గోపురంలో వసతి సౌకర్యాలు, నైవేద్య కైంకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటిస్తారు. నరసింహుడి బ్రహ్మోత్సవాలను చూసేందుకు భువి నుండి దివికి దిగివచ్చిన సకల దేవతలకు భేరిపూజ ద్వారా అఖండ స్వాగతం పలుకుతారు. ఇలా వచ్చిన దేవతలంతా బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు స్వామివారి సన్నిధిలోనే కొలువుదీరుతారని ప్రతీతి.
అలంకార సేవలు
కోర దవడలతో.. కోటిసూర్యతేజంతో.. హారకేయూరా భూషణాంబరాలతో.. శంఖచక్రాలతో.. జంట పూదండలతో.. మెరిసిపోతుంటాడు దేవ దేవుడు. వేదరక్షణ కోసం మత్స్యావతారాన్ని ధరించాడు స్వామి. రాక్షసుడైన సోమకుడిని చంపి.. ఆ జ్ఞాన సంపదను బ్రహ్మదేవుడికి అనుగ్రహించాడు. ఈ అలంకారంలో నరసింహుడిని దర్శించుకుంటే అజ్ఞానం నశిస్తుందని, విజ్ఞానం వస్తుందని, ఆత్మ, పరమాత్మల వివేకం పెరుగుతుందని చెప్తారు.
ఈ వేడుక సమయంలో పట్టు పీతాంబరాలు, నవరత్న ఖచిత ఆభరణాలతో స్వామి భక్తులకు దర్శనమిచ్చి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ‘శేషవాహనం’ మీద ఊరేగుతారు. సృష్టి ప్రారంభమైన మొదట్లో మర్రి ఆకు మీద పవళించిన స్వామిని ‘వటపత్రశాయి’గా కొలుస్తారు. ఈ అవతారంలో ‘హంసవాహనం’ మీద ఊరేగే దేవదేవుడిని దర్శించుకుంటే కలి ప్రభావం ఆమడ దూరంలోనే ఆగిపోతుందనేది భక్తుల విశ్వాసం.
బ్రహ్మోత్సవాల్లో నారసింహుడు తన ద్వాపరయుగ అవతారాన్ని ధరించి మురళీకృష్ణుడై భక్తజనాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తాడు. కన్నయ్య ‘పొన్నవాహనం’పై ఊరేగుతాడు. కొండను తన చిటికెన వేలుతో ఎత్తిన గోవిందుడు ‘గోవర్ధన గిరిధారి’ రూపంలో దర్బారు నిర్వహిస్తాడు. ‘సింహవాహన సేవ’ను స్వీకరిస్తాడు.
గోవింద పట్టాభిషేక సమయంలో ఇంద్రుడి దర్పాన్ని అణచిన స్వామి.. దర్శనంతోనే భక్తుల్లో అంతర్లీనంగా ఉన్న అహాన్ని కరిగించి, మందగించిన బుద్ధిని శుద్ధి చేస్తాడు.
క్షీరసాగర మథనంలో అసురులకు జగన్మోహిని అవతారంలో విందులు వడ్డించిన స్వామి ఆ అవతారంతోనే భక్తులకు దర్శనమిచ్చి‘అశ్వవాహనం’ ఎక్కి నలుదిక్కులా విహరిస్తాడు. గుర్రం చంచలత్వానికి ప్రతీక. కళ్లాలతో గుర్రాన్ని అదుపుచేసినట్టు.. నవవిధ భక్తి మార్గాలతో మనసును స్థిరపరుచుకోవాలన్నది ఈ సేవ సంకేతం.
ఈ సేవల తర్వాత తిరుకల్యాణంలో ప్రధాన ఘట్టమైన ఎదుర్కోలు ఉత్సవం ప్రధానాలయంలో మొదలవుతుంది. మరుసటి రోజు.. దశరథ పుత్రుడిగా దశకంఠుడిని సంహరించిన స్వామి ‘హనుమంత వాహనం’పై ఊరేగే ఘట్టం అందరినీ ఆకట్టుకుంటుంది. ‘కావవే వరద. సంరక్షించు భద్రాత్మకా’ అంటూ ఆర్తితో పిలిచిన గజేంద్రుడి కోసం పరుగెత్తుకుని వెళ్లిన పరమాత్ముడు ‘గజవాహనం’పై ఊరేగుతాడు. పాలకడలిపై శేషతల్పమున లక్ష్మీసమేతుడై దర్శనమిచ్చే స్వామి బ్రహ్మోత్సవాల్లో మహావిష్ణువుగా కూడా పూజలు అందుకొని గరుడవాహనాన్ని అధిష్టిస్తాడు.
తిరుకల్యాణోత్సవం
లక్ష్మీసమేత నరసింహుడి తిరుకల్యాణం ముల్లోకాలకు పండుగే! ఎదుర్కోలుతో ఆరంభమై మాంగల్యధారణతో కల్యాణోత్సవ వేడుక ముగుస్తుంది. వరుడి సౌందర్యాన్ని మన్మథుడితో పోలుస్తారు. అమ్మవారి రూపలావణ్యాన్ని మాటల్లో చెప్పలేం. ముక్కోటి దేవతలు అతిథులుగా బ్రహ్మాదుల సమక్షంలో యాదగిరి నరసింహుడు సముద్రరాజ తనయ మెడలో మాంగల్యధారణ చేస్తాడు. ఆ ఇద్దరిదీ అన్యోన్య దాంపత్యం. ప్రతి అవతారంలోనూ శ్రీదేవి పరమాత్మకు తోడుగా నిలిచి, నీడై నడిచింది. స్వామి కోసమే పుట్టిన శ్రీదేవి ఆయనతో కలిసి పుట్టెడు కష్టాలను చిరునవ్వుతో అనుభవించింది.
అందులోనూ లక్ష్మీనరసింహుల అనుబంధం మరీ ప్రత్యేకం. కోమలాంగి అయిన కొల్హాపురవాసిని.. కోరల దేవుడిని కోరి వరించింది. మహోగ్రరూపుడైన నారసింహుడిని పరమ శాంతమూర్తిగా మార్చింది. నరసింహుడు మాత్రం తక్కువ వాడా! చంచల అయిన క్షీరాబ్ధి కన్యకు తన ఒడిలో, హృదిలో స్థానమిచ్చి స్థిరత్వాన్ని ప్రసాదించారు. శ్రీలక్ష్మీ నరసింహులు ఒకరి కోసం ఒకరు తమ సహజ స్వభావాన్ని మార్చుకొని దంపతులకు ఆదర్శంగా నిలిచారు.
దివ్యవిమాన రథోత్సవం
బ్రహ్మోత్సవాలలో భాగంగా దివ్యవిమాన రథంపై భక్తులకు దర్శనమిస్తాడు నరసింహుడు. దివ్యరథాన్ని పలు రకాల పుష్పాలు, పత్రాలు, లైట్లతో దేదీప్యమానంగా వెలుగొందేలా అలంకరిస్తారు. ఆ దివ్య రథంపై ఉన్న స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, జనన మరణాల జంజాటంలోంచి బయటపడతారనేది భక్తుల విశ్వాసం. కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఉత్సవమూర్తి ఊరేగుతాడు.
పూర్ణాహుతి, చక్రస్నానం
పరిపూర్ణులైన స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పూర్ణాహుతి ముఖ్య ఘట్టం. తొమ్మిది రోజుల వేడుకలో తెలిసో, తెలియకో పొరపాట్లు జరిగి ఉంటే.. పెద్ద మనసుతో క్షమించమంటూ ఆశ్రిత రక్షకుడిని వేడుకుంటారు. అగ్నిదేవుడికి హవిస్సును సమర్పిస్తారు. చక్రధారికి చక్రస్నానం చేయించే ఘట్టం కమనీయం, రమణీయం, నయనానందకరం. భక్తుల జయజయధ్వానాల మధ్య ప్రత్యేకంగా సిద్ధం చేసిన పుష్కరిణిలో లక్ష్మీసమేతుడైన యాదగిరీశుడు స్నానమాచరిస్తారు. సకలలోక పాలకుడైన లక్ష్మీనరసింహుడు పుష్పాభిమాని. కాబట్టి బ్రహ్మోత్సవాల వేళ ఘనంగా పుష్పయాగం చేస్తారు. ఆ తరువాత దేవతోద్వాసన జరుగుతుంది. ముక్కోటి దేవతలు తిరుగు ప్రయాణం అవుతారు.
స్వామివారి ప్రధానాలయ ముఖమండపంలో108 కలశాలు,106 ద్రవ్యాలు,108 ఓషధులు,108 మంత్ర జపాలతో వేదయుక్తంగా అర్చిస్తారు. అష్టోత్తర శతఘటాల్లోకి ముక్కోటి దేవతలను ఆవాహనము చేసి ఆహుతులు సమర్పిస్తారు.106 సంఖ్యలో భగవానుడి తత్త్వం నిక్షిప్తమై ఉన్నందున అష్టోత్తర శతఘటాభిషేకానికి ఎంతో విశిష్టత ఉంది. శ్రీవారిని అమ్మవార్లను పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ సుగంధ ద్రవ్యాలతో అభిషేకిస్తారు. సాయంత్రం స్వామ శృంగార డోలోత్సవం అత్యంత వైభవంగా చేపడతారు. ఉత్సవ పరిసమాప్తికి సూచకంగా మంగళ నీరాజనాలు పలుకుతారు.
‘సింగారాల నుంచి నరసింహదేవుడు..
చెంగట చున్నాడు నరసింహదేవుడు..
సురలు బయపెట్ట నసురులెల్ల మొరవెట్ట..
సిరితో మెలగీ నరసింహదేవుడు..
భరణి వంపెట్ట బ్రతిధ్వనులు మిన్నులు ముట్ట..
శిరసెత్తె నలి నరసింహదేవుడు....
యాదగిరిగుట్ట నరసింహదేవుడు..’’
ఓం నమో నారసింహాయ.!!!
యాదర్షికి దర్శనం
చిన్నప్పటి నుంచి యాదర్షి(యాదరుషి) నరసింహస్వామి భక్తుడు. అతని తండ్రి రుష్యశృంగుడు, తల్లి శాంతాదేవి. యాదర్షి పసితనం నుంచీ నరసింహుడి కథలే వినేవాడు. నరసింహుడి పాటలే పాడేవాడు. ఆ స్వామి నిజరూపాన్ని దర్శించుకోవాలని ఆరాటపడేవాడు. ప్రహ్లాదుడిలా పరమాత్మ ముందు నిలబడి ప్రస్తుతించాలని కోరుకునేవాడు. ఆ విన్నపం సత్యయుగం నాటి స్వామికి చేరేదెలా? అనుకుంటున్నప్పుడు యాదర్షికి అనుకోకుండా హనుమంతుడి కటాక్షం లభించింది. రామసేతు నిర్మించిన హనుమంతుడు... భక్తుడికి, భగవంతుడికి మధ్య అనుసంధానకర్తగా మారి, యాదర్షికి ‘నృసింహ మంత్రం’ ఉపదేశించాడు. అప్పుడు సింహరూపుడైన శ్రీహరి కొండగుహలో దర్శనమిచ్చాడు. జ్వాల, యోగానంద, గండభేరుండ, ఉగ్రనరసింహ, లక్ష్మీనరసింహ వంటి ఐదు అవతారాల్లో యాదర్షిని కరుణించాడు.
నమామ్యహం మానవ సింహం..
ప్రమాదాం మహోబల సింహం..
దానవ దైత్య విచారణ సింహం..
నానాయుధకర నరసింహం..
భూ నభోంతరాళ పూరిత సింహం..
అనన వహ్మిలయాంతక సింహం..
శాంత నృసింహం, శౌర్య నృసింహం..
సంతత కరుణా జయసింహం..
అంటూ యాదరుషి నరసింహుడిని వేడుకున్నాడు. తనను కటాక్షించిన గుహలోనే సామాన్య భక్తులకు కూడా దర్శనం ఇవ్వమని ప్రార్థించాడు. భక్త సులభుడైన నరసింహుడు వెంటనే అందుకు ఒప్పుకున్నాడు. స్వయంభూ మూర్తిగా కొండ మీద వెలిశాడు. స్వామివారికి ‘అభినవ వైద్యుడు’ అని పేరు. అంతేకాదు.. ఆయన ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్యాన్ని అనుగ్రహించే మహాదాత కూడా!
త్రిభువనమల్లుడు
భువనగిరి పాలకుడు త్రిభువనమల్లుడు. మొదట నరసింహుని ఉనికిని ప్రశ్నించాడు. పరమాత్మతత్వానికి సవాలు విసిరాడు. సింహరూపుడైన శ్రీహరి మాత్రం అతని చేయి వదల్లేదు. యుద్ధాలలో ఆయుధమై నిలిచాడు. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఔషధమై ఆదుకున్నాడు. సంక్షోభాల్లో ఆత్మీయుడై వెన్నంటి ఉన్నాడు. సకల భాగ్యాలతో పాటు ‘సంతాన’ భాగ్యాన్ని కూడా ఇచ్చాడు. ఆ వాత్సల్యం వల్లే కొంతకాలానికి త్రిభువనమల్లుడు నరసింహుడి భక్తుడయ్యాడు. ఆయనే ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తున్నది. కృష్ణదేవరాయలు కూడా స్వామివారిని సేవించాడని చెప్తుంటారు.
కాలక్రమంలో.. ఈ ప్రాంతంలో అరాచకాలు పెరిగాయి. స్వామివారి పూజాదికాలు ఆగిపోయాయి. చుట్టూ చిట్టడవితో క్షేత్రం క్రూరమృగాలకు ఆవాసమైంది. ఆ దశలో స్వామివారు గ్రామాధికారికి దర్శనమిచ్చి.. తన ఉనికిని చెప్పాడు. హైదరాబాద్‌కు చెందిన మోతీలాల్ చొరవతో ఈ క్షేత్రానికి పాత వైభవం మళ్లీ వచ్చింది. నిజాం నవాబులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి సాయం చేశారు. వైష్ణవాచార్యులు నిత్యపూజలను శాస్త్రోక్తం చేశారు. ఈగ బుచ్చిదాసు, బాపట్ల లక్ష్మీకాంతయ్య లాంటి సంకీర్తనాచార్యులు వేనోళ్ల కొలిచి పుణ్యాలు దక్కించుకున్నారు. వంగీపురం నర్సింహాచార్యులు రచించిన సుప్రభాత, మంగళాశాసనాది రచనలు ఇప్పటికీ గర్భాలయంలో వినిపిస్తుంటాయి.
నివాస, విహార, సభా స్థలాలు
నరసింహస్వామి యాదగిరి గుట్టతోపాటు ఇక్కడికి దగ్గర్లోని మరో రెండు ప్రదేశాల్లో కూడా వెలిశాడనేది భక్తుల నమ్మకం. తుర్కపల్లి మండలం వెంకటాపురంలో నరసింహుడు వెలిసిన కొండ(వేంకటగిరి) పాపాలను నశింపజేస్తుందని, అది పరమ పవిత్రమైనదని భక్తుల విశ్వాసం. కొండగుహలో వెలిసిన స్వామి ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడని చెప్తుంటారు.
అందుకే ఈ స్థలానికి నరసింహుడి ‘నివాస స్థలం’ అని పేరొచ్చింది. ఇక స్వామి వెలిసిన పాతగుట్టను ‘స్వామి విహార స్థలం’ అని పిలుస్తారు. ఈ ఉద్యానవనంలో అమ్మవారితో కలిసి నరసింహుడు విహరిస్తుంటాడని నమ్ముతుంటారు.
యాదగిరిగుట్ట క్షేత్రం స్వామివారి ‘సభాస్థలం’ అని భక్తులంతా చెప్తుంటారు. అందుకే ఇక్కడికే ఎక్కువమంది వచ్చి లక్ష్మీసమేత నరసింహుడిని దర్శించుకుని తరిస్తారు. నివాస స్థలమైన వెంకటగిరి, విహార స్థలమైన పాతగుట్ట, సభాస్థలమైన యాదగిరిగుట్ట... ఈ మూడు ఆలయాలు నిత్యం భక్తులతో నిత్యనూతనంగా వెలుగొందుతున్నాయి.
గుర్రం పాదాల గుర్తులు
నరసింహుడి విహార స్థలంగా నమ్మే పాతగుట్టపై స్వామి గుర్రం పాదాల గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి. స్వామి గుర్రంపై విహరిస్తున్నప్పుడు నరసింహుడి బరువుకు కొండపై గుర్రపు పాదాల గుర్తులు ఏర్పడ్డాయని పురాణాలు చెప్తున్నాయి. ఇప్పటికీ ఆ పాదాలకు భక్తులు పూజలు చేస్తుంటారు.
స్తంభోద్భవుడు
స్తంభోద్భవుడైన నరసింహ రూపాన్ని దర్శించుకోవాలంటే యాదగిరిగుట్టలోని పాతగుట్ట క్షేత్రానికి వెళ్లాలి. స్వామి స్తంభాన్ని ఏ రకంగా చీల్చుకుంటూ వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించాడో తెలిపే దృశ్యం పాతగుట్టలో చూడొచ్చు. రెండు శిలాఫలకాలను ఛేదించుకుని, రెండు స్తంభాల మధ్యభాగం నుంచి స్వామి ఆవిర్భవించిన దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఇలాంటి స్తంభోద్భవుడిని దర్శించుకునే భాగ్యం ఒక్క పాతగుట్టలో తప్ప మరెక్కడా లేదు.
పుష్కరిణిలోనే...
2014కు ముందు వరకు కొండపైన ఉన్న పుష్కరిణిలోనే భక్తులు స్నానాలు చేసేవాళ్లు. ఆలయం పునర్నిర్మాణంతో పుష్కరిణిని కొండ కిందే ఏర్పాటు చేశారు. దాంతో కింద స్నానం చేశాక కొండపైకి వెళ్లి, స్వామివారి దర్శనం చేసుకోవాలి.
కందుకూరి సోమయ్య, యాదాద్రిగొట్టిపర్తి ఉపేందర్, యాదగిరిగుట్ట
ఇలా వెళ్లాలి
హైదరాబాద్– వరంగల్ దారిలోని రాయగిరి నుంచి యాదగిరిగుట్టకు మెయిన్ రోడ్డు ఉంది. హైదరాబాద్, నల్గొండ, మేడ్చల్ నుంచి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. నిజామాబాద్, శ్రీశైలం, సిద్దిపేట నుంచి కూడా కొన్ని బస్సులు నడుపుతున్నారు. వరంగల్, హన్మకొండ, జనగామ నుంచి నేరుగా బస్సు సౌకర్యం లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్కు వెళ్లే బస్సులు ఎక్కి.. యాదగిరి గుట్ట జిల్లాలోని రాయగిరిలో దిగాలి. హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులన్నీ రాయగిరిలో ఆగుతాయి అక్కడ బస్సు ఎక్కితే యాదగిరిగుట్టకు వెళ్లొచ్చు.