- జీఎస్టీ స్కామ్‌లో సోమేశ్‌కుమార్
- ఫార్ములా ఈ-రేస్ కేసులో అర్వింద్‌కుమార్
- భూ లావాదేవీల్లో అమోయ్‌కుమార్
- కీలక దశకు చేరిన ఎంక్వైరీలు.. పూర్తి వివరాల సేకరణ
- ఆఫీసర్లకు, నాటి మంత్రులకు మధ్య జరిగిన ఫోన్ కాల్స్ డేటా రికవరీకి ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ముగ్గురు ఐఏఎస్‌ల చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తున్నది. జీఎస్టీ స్కామ్, ఫార్ములా ఈ – రేస్, భూ దందాలకు సంబంధించిన కేసుల్లో వీరిపై దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలు సేకరించాయి. జీఎస్టీ స్కామ్‌లో సోమేశ్‌కుమార్.. ఫార్ములా ఈ–రేస్‌లో అర్వింద్‌కుమార్.. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లోని భూ స్కాముల్లో అమోయ్‌కుమార్ విచారణ ఎదుర్కొంటున్నారు.
బ్యూరోక్రాట్స్ కావడంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలను దర్యాప్తు సంస్థలు చేపట్టాయి. కేసుల తీవ్రత నేపథ్యంలో ఐఏఎస్‌లపై వచ్చిన ఫిర్యాదులు, బాధితుల స్టేట్‌మెంట్స్, సాక్ష్యాధారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను ఇప్పటికే సేకరించాయి. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, నాటి మంత్రుల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఫోన్ కాల్స్ డేటాను రికవరీ చేస్తున్నాయి. ఇందుకోసం ఫోరెన్సిక్ నిపుణుల సహకారం తీసుకుంటున్నాయి.
సోమేశ్‌కుమార్@ జీఎస్టీ స్కామ్!
గత బీఆర్ఎస్ప్రభుత్వంలో సీఎస్‌గా సోమేశ్‌కుమార్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో రూ.1,000 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సోమేశ్‌కుమార్ సహా సర్వీస్ ట్యాక్స్ మాజీ అడిషనల్ కమిషనర్ ఎస్వీ కాశీవిశ్వేశ్వరరావు, మాజీ డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్,అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్లియాంటో టెక్నాలజీస్పైను నిందితులుగా చేర్చారు.
ఇతర రాష్ట్రాల్లోని 75 కంపెనీలకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. వీరంతా కలిసి ఏర్పాటు చేసుకున్న ‘స్పెషల్ ఇన్సియేటివ్’ వాట్సాప్ గ్రూప్‌లో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. దీంతో పాటు జీఎస్టీ చెల్లింపుల్లో జరిగిన అవకతవకలకు చెందిన ఫోరెన్సిక్ఆడిట్ రిపోర్టులు, సోమేశ్ కుమార్ గ్రూప్ చాటింగ్ రికార్డులు, సీ డాక్ రిపోర్టులను ఇప్పటికే సీఐడీ సేకరించినట్లు తెలిసింది.
అర్వింద్‌కుమార్ @ ఫార్ములా ఈ–రేస్ కేసు!
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అర్వింద్‌కుమార్ చుట్టూ ఫార్ములా ఈ–కారు రేస్ కేసు నడుస్తున్నది. నిరుడు ఫిబ్రవరి 11న నిర్వహించిన ఫార్ములా ఈ– కార్ రేస్‌కు సంబంధించి రూ.55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ శాఖ నిధులు దారిమళ్లడంపై ఏసీబీ కేసులో అర్వింద్కుమార్చుట్టే దర్యాప్తు జరుగుతున్నది. ఆయన ఇచ్చే స్టేట్‌మెంట్ ఆధారంగానే నాటి మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి.
హెచ్‌ఎండీఏ మాజీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో కూడా అర్వింద్‌కుమార్‌పై ఆరోపణలు ఉన్నాయి. కాగా.. నార్సింగిలోని 12 ఎకరాల్లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన మల్టీస్టోర్ బిల్డింగ్ విషయంలో నాడు హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఉన్న అర్వింద్ కుమార్ రూ.10 కోట్లు లంచం డిమాండ్ చేశారని శివబాలకృష్ణ ఏసీబీకి కన్‌ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీనిపైనా అర్వింద్‌కు ఉచ్చు బిగుస్తున్నది.
అమోయ్ కుమార్ @ భూముల స్కామ్..!
రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన అమోయ్ కుమార్ కూడా నాటి బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూదందాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 181లో గల 42 ఎకరాల 33 గుంటల భూమికి సంబంధించిన కేసులో ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో అమోయ్‌కుమార్‌ను ఇప్పటికే ఈడీ అధికారు లు మూడు రోజుల పాటు విచారించారు.
మహేశ్వరం తహసీల్దార్ జ్యోతిని విచారించి స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేశారు. వీరిద్దరు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సంబంధిత అధికారులను విచారిస్తున్నారు. ఇందులో భాగంగా అప్పటి ఆర్డీవో వెంకటాచారికి సమన్లు జారీ చేశారు. వెంకటాచారి స్టేట్‌మెంట్‌ను గురువారం రికార్డ్ చేశారు. రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరిలో జరిగిన భూ అక్రమాలపై ఈడీ ఇప్పటికే ఆధారాలు సేకరించినట్లు తెలిసింది.
ఈ కుంభకోణం వెనుక మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు అమోయ్‌కుమార్, మాజీ తహసీల్దార్ జ్యోతి, ఆర్డీవో వెంకటాచారి కీలక డాక్యు మెంట్లు ఈడీకి అందించినట్లు తెలిసింది. ఈ కేసులో మరికొంత మందికి ఈడీ నోటీసులు జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది.