- రూ.4 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం .
కామారెడ్డి టౌన్, వెలుగు : ముగ్గరు అంతర్జిల్లా దొంగలను కామారెడ్డి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సీ చైతన్యరెడ్డి దొంగల వివరాలను వెల్లడించారు. కామారెడ్డి టౌన్ కు చెందిననిమ్మలవోయిన సురేశ్, నిజామాబాద్జిల్లా నడ్పల్లి-కి చెందిన రుద్రబోయిన గణేశ్, నిజామాబాద్ జిల్లా తాడెంకు చెందిన గాజుల శ్రీధర్ ముగ్గురు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడేవారు. ఈనెల 10న రాత్రి కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో ఉన్న 5 టెంపుల్స్‌లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి సౌండ్ బాక్స్, ఇతర వస్తువులు ఎత్తుకెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. గురువారం హౌజింగ్‌బోర్డు కాలనీ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా, ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది. వీరి వద్ద నుంచి రూ. 4 లక్షల విలువైన 3 గ్రాములు బంగారం, 3 బైక్‌లు, 2 మైక్సెట్లు, ఆటో, 7 జతల వెండి కండ్లు, ట్రాక్టర్బ్యాటరీ, సెల్ ఫోన్స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి టౌన్, దేవునిపల్లి, భిక్కనూరు, రామారెడ్డి, ఎడపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరిపై 11 కేసులు ఉన్నట్లు ఏఎస్సీ తెలిపారు. సమావేశంలో టౌన్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.