ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్​

ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్​

సూర్యాపేట, వెలుగు : జిల్లాలో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ కు చెందిన కొరపాటి నరసింహరావు, మన్యం జిల్లా పార్వతిపురానికి చెందిన ప్రసాద్ ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. అయితే ఇద్దరు కార్లను అద్దెకు తీసుకొని మార్గమధ్యలో డ్రైవర్ కు మద్యం తాగించి అతడు మత్తులోకి వెళ్లగానే కార్లు దొంగతనం చేసేవారు.

గత నెల 16న  సూర్యాపేట పట్టణానికి చెందిన వెంకటేశ్వరరావు విజయవాడలో చదువుతున్న తన కుమార్తె వద్దకు కారులో వెళ్తుండగా సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు లిఫ్టు అడిగారు. వారికి లిఫ్ట్ ల ఇవ్వడంతో కారు యజమానితో మాటలు కలిపి విజయవాడ చేరుకొని హోటల్ కు వెళ్లి వచ్చేసరికి అక్కడ పార్కు చేసిన కారును ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీస్ స్టేషన్​లో కంప్లైంట్ ఇవ్వంతో పోలీసులు విచారణ చేట్టారు. హుజూర్ నగర్ కు చెందిన శ్రీకాంత్ పార్కు చేసిన బైకును ఎత్తుకెళ్లి అమ్ముకున్నాడు.

ఈనెల 7న సూర్యాపేటలో విద్యార్థి మహేశ్ కాలేజ్ ముందు పార్క్ చేసిన బైక్​ను ఎత్తుకెళ్లడంతో బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గురువారం సూర్యాపేటలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అటుగా వచ్చిన ముగ్గురు వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు పట్టుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితుల నుంచి రూ.30 లక్షల విలువైన రెండు కార్లు, 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్​చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.