భూదాన్ భూముల కేసు: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు IPS అధికారులు

భూదాన్ భూముల కేసు: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు IPS అధికారులు

హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. భూదాన్ భూముల వివాదంపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులకు చెందిన భూదాన్ భూములను ఈ నెల (ఏప్రిల్) 27 నుంచి నిషేదిత జాబితాలో పెట్టాలని 2025, ఏప్రిల్ 24న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. కాగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నంబర్​ 181, 182, 194, 195లోని భూదాన్​ భూములు అన్యాక్రాంతం అయినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. 

ఇందులో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో నాగారంలోని భూదాన్ ​భూముల్లో అక్రమాలపై విచారణ జరపాలంటూ మహేశ్వరం మండలానికి చెందిన బిర్ల మల్లేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి ఉన్నతాధికారులు ఫోర్జరీ పత్రాలు సృష్టించి, రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి బినామీ లావాదేవీలతో చట్టవిరుద్ధంగా భూదాన్​భూములను బదలాయించారని పిటిషన్లో పేర్కొన్నారు. అంతేగాకుండా భూదాన్​ చట్ట, తెలంగాణ భూదాన, గ్రామదాన నిబంధనలు-1965కు విరుద్ధంగా పలువురు ఐఏఎస్‌‌‌‎లు, ఐపీఎస్‌‎లు సొంత పేర్లతోపాటు కుటుంబసభ్యుల పేర్లతో కొనుగోలు చేశారని పేర్కొన్నారు. 

ఇందులో పెద్ద పెద్ద అధికారుల ప్రమేయం ఉండటంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్‎ను 2025, ఏప్రిల్ 24న జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నంబర్​ 181, 182, 194. 195లోని భూదాన్​ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తోపాటు సబ్‌రిజిస్ట్రార్లకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. భూదాన్​ భూముల అక్రమాల్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు ఉన్నతాధికారులపై ఆరోపణలున్న నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి అవకాశం ఉందని, దీంతో నిషేధిత జాబితాలో చేర్చాలని తాము విచక్షణాధికారంతో ఆదేశిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. 

తదుపరి ఆర్డర్స్​ ఇచ్చే దాకా ఈ ల్యాండ్స్​ను అన్యాక్రాంతం చేయరాదని, వీటిపై ఏ ఒక్క లావాదేవీని జరపడానికి వీల్లేదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో పెద్దాఫీసర్లు ఉండటంతో పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్‌ను అనుమతించొద్దని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. భూ అన్యాక్రాంతం ఆరోపణలు ఎదుర్కొంటున్న 27 మంది అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ఐపీఎస్ మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీరు హైకోర్టు సింగల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్‎లో అప్పీల్‎కు వెళ్లారు.