లక్నో: ఉత్తరప్రదేశ్ పిలిభిత్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి ముగ్గురు ఉగ్రమూకలను మట్టుబెట్టారు. ఎన్ కౌంటర్లో మృతి చెందిన వారు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ పోలీసు పోస్ట్‌పై గ్రెనేడ్‌తో దాడి చేసిన ఖలీస్థానీ ఉగ్రవాదులుగా అధికార వర్గాలు గుర్తించాయి. మృతులను గుర్విందర్ సింగ్, వీరేంద్ర సింగ్, జసన్‌ప్రీత్ సింగ్‌గా పోలీసులు ఐడెంటీఫై చేశారు.
గురుదాస్‌పూర్‌లోని పోలీసు పోస్ట్‌పై దాడి చేసిన ఖలీస్థానీ ఉగ్రవాదులు యూపీలో ఉన్నట్లు పోలీసులకు ఇంటలిజెన్స్ సమాచారం అందించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన యూపీ, పంజాబ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఆదివారం (డిసెంబర్ 22) రాత్రి పిలిభిత్‌లో పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఖలీస్థానీ వేర్పాటు వాదులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. బుల్లెట్ గాయాలు తీవ్రంగా కావడంతో ఆరోగ్యం విషమించి ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
మృతులు ముగ్గురు కూడా 25 సంవత్సరాల లోపు వారేనని.. మృతుల నుండి ఏకే సిరీస్‌కు చెందిన రెండు రైఫిళ్లు, అనేక గ్లాక్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్ కౌంటర్లో హతమైన ముగ్గురు గురుదాస్ పూర్ పోలీస్ చెక్ పోస్ట్‌పై జరిగిన దాడితో సంబంధం ఉన్న వారేనని పేర్కొన్నారు. వీరు ముగ్గురూ పాకిస్థాన్ ప్రాయోజిత ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్‌లో భాగమని చెప్పారు. ఈ డేరింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్నవారిని అధికారులు అభినందించారు.